రాజకీయాల్లో విలువలు పతనమైపోతున్నాయి. నాయకుల్లో విశ్వసనీయత కొరవడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు జుగుప్సాకరంగా మారుతున్నాయి అని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. ఇప్పుడంతా దాడులు, దూషణల పర్వం సాగుతోంది. హుందాగా వ్యవహరించాల్సిన అధికార, ప్రతిపక్ష నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకునే వరకు వెళ్తున్నారు. అంతేనా ఇప్పుడు తెలుగునాట కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే చెప్పుల రాజకీయం. గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలో అలాంటి రాజకీయం చేస్తే దానిపై పెద్ద చర్చ జరిగేది కాదేమో. కానీ పార్టీలకు అధినేతలుగా ఉన్న వారు కీలక భూమిక పోషించే నేతలే చెప్పు ఎత్తుతున్నారు. చెప్పుతో కొడతానంటూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నారు.
ఏపీలో మంత్రులకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్నామధ్య చెప్పు చూపించారు. అధికార నేతలు పదే పదే పవన్‌ను మూడు పెళ్లిళ్ల విషయంలో టార్గెట్ చేస్తూ చిరాకు పెడుతున్నారు. దాంతో విసిగివేసారిపోయిన జనసేనాని విచక్షణ కోల్పోయారు. మీరు చేసుకోండి ఎవరు వద్దాన్నారు అంటూనే ఇంకోసారి పెళ్లి విషయం ఎత్తితే చెప్పుతో కొడతానంటూ చెప్పు చూపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా చట్టబద్ధంగానే చేసుకున్నానని మంత్రుల్లాగ 30 మంది స్టెపినీలు లేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోసారి మాట్లాడితే చెప్పుతో కొడతానని, లాక్కొచ్చి కొడతానంటూ నిప్పులు చెరిగారు. పవన్ వ్యాఖ్యలను తప్పుబడుతూ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంతో దానిపై తీవ్ర దుమారం రేపింది.
ఇక తెలంగాణ నేతలు తామేమీ తక్కువ కాదంటున్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితల మధ్య డైలాగ్ వార్ నడిచింది. కవితపై అరవింద్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు, అతని ఇంటిపై దాడికి కూడా దిగాయి. అదే సమయంలో ఇష్టానుసారం మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ అరవింద్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కవిత. ఇది రెండు పార్టీల మధ్య అగ్గిరాజేసింది. ఇక ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది. తాను డ్రగ్స్ తీసుకున్నానంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ శివాలెత్తారు. వెంట్రుకలు, గోర్లు, కిడ్నీ కూడా ఇస్తానని, పరీక్ష చేయించుకోవాలని బండికి సవాల్ విసిరారు కేటీఆర్. లేదంటే కరీంనగర్ చౌరస్తాలో చెప్పుదెబ్బలు తినడానికి సిద్ధమేనా? హెచ్చరించారు. అంతకుముందు మంగళవారం మరదలు అన్న మంత్రి నిరంజన్ రెడ్డిని మెట్టుతో కొడాతనంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా హెచ్చరించారు. ఇలా పార్టీల్లో పెద్దస్థాయిలో ఉన్న నేతలు చెప్పులు చూపించే సంస్కృతి మంచిది కాదని దిగువ శ్రేణి నాయకులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే హద్దులు మీరి మాట్లాడేవారికి చెప్పు చూపించడం తప్పేమీకాదని సమర్థించేవారూ ఉన్నారు.