ప్రముఖ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని డిసైడ్ చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సైన్ చేసిన తమిళ్, హిందీ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయా సినిమాల నిర్మాతలకు ఆమె సమాచారం ఇచ్చినట్లు టాక్. ఇటీవల తాను మయోసైటిస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు ఆవిడే స్వయంగా ప్రకటించింది. ప్రస్తుతం దానికి చికిత్స తీసుకుంటోంది. కోలుకున్న తరువాత ముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని భావించింది. అయితే కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి. అంతేకాక ట్రీట్‌మెంట్ పూర్తయిన తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని కూడా సమంత భావిస్తున్నట్లు సమాచారం. అయితే అన్ని రోజులపాటు నిర్మాతలను వెయిట్ చేయించడం కష్టం కాబట్టి ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తయిన సినిమాలను ఎలాగోలా పూర్తి చేయాలని అనుకుంటున్నారట.
అలాగే షూటింగ్ పూర్తి కాని సినిమాలను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏం మాయ చేసావే సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైన సమంత స్వల్పకాలంలోనే తన అభినయంతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగుతోపాటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ది ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ సక్సెస్ తో బాలీవుడ్‌లో కూడా సమంతకు మంచి క్రేజ్ వచ్చింది. దీంతో హిందీలో కూడా ఆమెకు పలు ఆఫర్లు వచ్చాయి. అలాగే ఒక హాలీవుడ్ సినిమా కూడా ఒప్పుకుంది. అయితే తన అనారోగ్యం కారణంగా ఈ సినిమాలన్నింటి నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన యశోద హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత తెలుగులో శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటిస్తోంది. ఇందులో శాకుంతలం సినిమా షూటింగ్ చాలావరకు పూర్తికాగా, ఖుషి సినిమా షూటింగ్ 60 శాతం మేర జరిగింది. దీంతో ఈ రెండు సినిమాలను పూర్తి చేయాలని సమంత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సమంత త్వరగా కోలుకోని మళ్లీ సినిమాల్లో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.