నిత్య అసమ్మతితో రగిలిపోతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని చక్కదిద్దడానికి ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుంటే ప్రజల్లోకి వెళ్లడం మానేసి తమలో తాను కీచులాడుకుంటున్న పార్టీని బలహీన పరుస్తున్న నేతలను దారిలో పెట్టడానికి హైకమాండ్ నిర్ణయించుకుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య విబేధాలను పరిష్కరించడానికి ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు రానున్నారు.
పీసీసీ కమిటీలపై సీనియర్లు బహిరంగంగానే విమర్శలు చేయడం, పీసీసీ కమిటీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావెద్, రోహిత్ చౌదరి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె, ప్రియాంకగాంధీకి సమాచారం అందించారు. ఈ వివాదం మరింత ముదరకముందే నష్టనివారణ కోసం ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్‌ను అధిష్టానం హైదారాబాద్‌కు పంపించింది అధిష్టానం. అయినా అసమ్మతి సద్దుమనగలేదు.
దాంతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధి కూడా రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో నెలకొన్న వివాదాలను పరిష్కరించడానికి సీనియర్లతో ప్రియాంక గాంధి సమావేశం కానున్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీన పరిచే చర్యలకు అవకాశం ఇవ్వొద్దని కొంతకాలం అందరూ మౌనం పాటించాలని ఆమె టీ కాంగ్రెస్ నేతలను కోరినట్లు తెలుస్తోంది. ఈనెల 23 తరువాత ఎనిమిది మంది అసమ్మతి నేతలను ఢిల్లీకి రావాలసిందిగా ఏఐసీసీ నుంచి సమాచారం పంపించారు. ఇదే విషయం గురించి ఏఐసీసీ కార్యదర్శి ఫోన్ చేసినప్పుడు సీనియర్లు ఎవరూ సరిగా స్పందించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అవసరమైతే హైదరాబాద్ కు వెళ్లి అసమ్మతి నేతలతో చర్చించాలని ప్రియాంక అనుకుంటున్నారని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపైన ఇప్పటికే ఆమె ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఉత్తమ్ అనుచరులు మాత్రం ఎలాంటి ఫోన్ రాలేదని దాటవేస్తున్నారు. మరి ప్రియాంక పిలుపుపై అసమ్మతి నేతలు ఢిల్లీ వెళ్తారా లేక ప్రియాంక గాంధినే హైదరబాద్‌కు వస్తారా అని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.