తిరుగుబాటుకు కేసీఆర్ మౌనమే సమాధానమా ?

By KTV Telugu On 21 December, 2022
image

భారత రాష్ట్ర సమితి స్థాపించిన ఆనందంలో ఉన్న కేసీఆర్ అనుకోకుండా తొలి దెబ్బ తగిలింది. కేసీఆర్ మాట జవదాటని ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రెస్ పెట్టి మరీ అధిష్టానం ప్రతినిధులను తిడుతున్నారు. వరుసగా రెండు సార్లు గెలిచి ముచ్చటగా మూడో సారి అధికారానికి చేరువ కావాలనుకుంటున్న తరుణంలో కేసీఆర్ కు ఇది ఊహించని పరిణామం. టీ కప్పులో తుపానులా అది కొట్టుకుపోతే ఫర్వాలేదు. కొంచెం మోతాదు పెరిగినా క్యాష్ చేసుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ అధిష్టానికి కూడా తెలియడంతో మీనమేషాలు లెక్కించాల్సి వస్తోంది.

ఇంతవరకు లోలోన ఉన్న బీఆర్ఎస్ అసంతృప్తి ఇప్పుడు బయట పడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశం కావడం బీఆర్ఎస్ లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా వాళ్లు గళమెత్తడాన్ని కేసీఆర్ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతగా తీసుకోవాలని కూడా కొందరు అంటున్నారు. పైగా వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీ పరువును బజారుకీడ్చారు.

మల్లారెడ్డి కేవలం మేడ్చల్‌ నియోజకవర్గానికి మాత్రమే మంత్రిగా వ్యవహరిస్తున్నారని పదవులన్నీ తన సొంత నియోజకవర్గానికే ఇచ్చుకుంటున్నారంటూ వారు తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రికి వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఈ మేరకు మల్కాజిగిరి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి, ఉప్పల్‌ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, అరికపూడి గాంధీ, కేపీ వివేకానంద్‌, మాధవరం కృష్ణారావు, భేతి సుభాష్ రెడ్డి భేటీ అయ్యారు. మీడియా మైనంపల్లి ఇంటికి చేరుకోవడంతో ప్రెస్ మీట పెట్టక తప్పలేదు. తమకు తెలియకుండానే మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్పుతో పాటు మల్లారెడ్డి అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మల్లారెడ్డి నిర్ణయాలు కారణంగా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని వారికి తాము సమాధానం చెప్పుకోలేకపోతున్నామని మీడియా ముందు మైనంపల్లి వివరణ ఇచ్చారు.

మంత్రితో ఉన్న గ్యాప్ ను పూడ్చుకునేందుకే మీటింగ్ పెట్టామని చెబుతూ మంత్రిని తొలగించాలని కోరడం లేదని ఎమ్మెల్యేలు ప్రకటించడంతో వారేదో ఆశిస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. అసలే ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరై ఉన్న మంత్రి మల్లారెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్యేలు తనపై కత్తికట్టడం కోలుకోలేని పరిణామమవుతోంది. అయితే ఆయన మాత్రం తనదైన శైలిలో గుంభనంగా ఉన్నట్లు నటిస్తున్నారు. నిజానికి తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మైనంపల్లి  చాలాకాలంగా కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. అధినేత మాట జవదాటరని చెబుతారు. ఎన్నెన్నో పార్టీలు తిరిగిన తర్వాత ఆయన టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇప్పుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ ఒక రకంగా డాన్ గానూ మరో రకంగా ప్రజల మనిషిగానూ పేరు తెచ్చుకున్నారు. తనయుడు రోహిత్ ను రాజకీయాల్లో ప్రమోట్ చేసుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.

మైనంపల్లి నేతృత్వంలో తిరుగుబాటు జరగడంతో దానికి కేసీఆర్ మద్దతు ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కొంతకాలంగా మంత్రి తీరుపై కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెడ్డి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు, రేవంత్ రెడ్డిపై తొడ కొట్టి సవాలు చేయడం, మెడికల్ కాలేజీ సభలో అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కు అసలు రుచించలేదు. అందుకే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారన్నది ఒక వాదన. అయితే మరో వాదన కూడా ప్రచారంలో ఉంది. ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని కొందరంటున్నారు. కేసీఆర్ పనైపోయిందని తమ వైపుకు వచ్చేయ్యాలని బీజేపీ వర్తమానం పంపిందని. దాన్ని ఆసరాగా తీసుకునేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారన్నది మరో వాదన. అధిష్టానాన్ని బెదిరించి మల్లారెడ్డికి దారికి తెచ్చే వాళ్లు ప్రయత్నం చేస్తున్నారట. ఏది జరిగినా ప్రస్తుతానికి బహిరంగ చర్చకు తావివ్వకూడదని ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారన్నది ప్రగతి భవన్ టాక్. బీఆర్ఎస్ ఇంకా నిలదొక్కుకోకముందే పంచాయతీలు పెట్టుకుంటే దాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. దానితో తొందరపడి మాట్లాడిన మైనంపల్లి బ్యాచ్ కూడా పార్టీలో సేఫ్ గానే ఉంటారు.