కరోనాపై విజయం సాధించామని సంబరపడుతున్నారా. వైరస్‌ని జయించామనే ధైర్యంతో బతికేస్తున్నారా? ఆదమరిచిన ప్రపంచానికి మళ్లీ వైరస్ వార్నింగ్. మరోసారి కరోనా కాటేయబోతోంది. కొత్త వేరియంట్ పడగవిప్పుతోంది. ఇప్పుడు చైనా రేపు ఏదేశమూ ఈ వైరస్‌ని తప్పించుకోలేకపోవచ్చు. వుహాన్ కరోనా పుట్టినిల్లు. చైనా కాదన్నా అదే నిజమని ప్రపంచమంతా నమ్ముతోంది. ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన వైరస్ వుహాన్‌లోనే ఊపిరిపోసుకుందన్న అనుమానాలకు ఆధారాలెన్నో. వైరస్ మహమ్మారినుంచి బయటపడి ఇప్పుడిప్పుడే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా దెబ్బకి కుదేలైన వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ లోపే మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. వైరస్ పుట్టినిల్లుగా భావించే చైనా దానికి మూల్యం చెల్లిస్తోంది. చైనాలో లక్షలకేసులు నమోదవుతున్నాయి. వేలమరణాలు భయపెడుతున్నాయి. షరామామూలుగానే వాస్తవాల్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది డ్రాగన్ కంట్రీ. కానీ నిప్పుని గుప్పెట్లో ఎన్నాళ్లు దాచగలుగుతుంది?
చైనా ఇప్పుడు చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతోంది. నిర్బంధాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించటంతో ఆంక్షలు సడలించిన చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. అది చైనాతో ఆగిపోదని మళ్లీ ప్రపంచాన్ని కబళిస్తుందని అంతా ఆందోళనపడుతున్నారు. టీకాలు వేయించుకున్నా రోగనిరోధకశక్తి ఉందనుకున్నా ఈసారి వైరస్ ఎవరినీ వదిలేలా లేదు. ఎందుకంటే కొత్త వేరియంట్ల పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉందంటున్నారు నిపుణులు. అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఎరిక్ ఫీగల్ డింగ్ చెబుతున్న వాస్తవాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. వచ్చే మూడు నెలల్లో చైనా జనాభాలో 60 శాతం మంది కరోనా బారిన పడబోతున్నారు. ప్రపంచంలో 10 శాతం జనాభా వైరస్ బారినపడతారు. ఇక ఈసారి కరోనా మరణాలు మిలియన్లలో ఉంటాయని అంచనా వేస్తున్నారు డాక్టర్ ఎరిక్.
కోవిడ్ ఆంక్షల సడలింపుతో చైనా రాజధాని నగరం వైరస్ కబంధహస్తాల్లో చిక్కుకుంది. భారీగా మరణాలు నమోదవుతున్నాయి. అయినా చైనా నోట పాత పాట. కట్టడిలో ఉందని మరణాలు పెద్దగా లేవంటూ డ్రాగన్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
అయితే బీజింగ్ దోంగ్జా శ్మశానంలో సిబ్బంది 24 గంటలూ పనిచేయాల్సి వస్తోంది. మృతదేహాలు ప్రవాహంలా వచ్చిపడుతున్నాయి. రాత్రింబవళ్లు దహనక్రియలు జరుగుతూనే ఉన్నాయి. బీజింగ్‌లోని ఆసుపత్రులు, శ్మశానాలు, ఇతర అంత్యక్రియల ప్రాంతాల్లో గణాంకాలను తీస్తే మరణాల సంఖ్య అసాధారణంగా ఉంది. చైనాలో గుర్తించిన ఓమిక్రాన్ కొత్త సబ్‌వేరియంట్ BF.7 తీవ్రమైన ఇన్ఫెక్షన్ సామర్థ్యం కలిగిఉంది. ఇతర వేరియంట్ల కన్నా వేగంగా వ్యాపించడం ఈ వేరియంట్ లక్షణం. BF.7 RO 10 నుంచి 18.6 వరకూ ఉంటుందని అంచనావేస్తున్నారు. అంటే వైరస్ ఒకరి నుంచి సగటున 10నుంచి 19 మందిదాకా వ్యాప్తి చెందుతుంది. ఓమిక్రాన్ సగటుకంటే ఇది మూడురెట్లు. ఈ శీతాకాలంలో చైనా మూడు కోవిడ్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవల్సి ఉంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుత స్పైక్ జనవరి మధ్య వరకు కొనసాగవచ్చు. తర్వాత రెండో స్పైక్ ఉండొచ్చు. ఫిబ్రవరి చివరి నుంచి మార్చి మధ్యలో మూడో వేవ్ సంభవించవచ్చు.
చైనాతో పాటు జపాన్, అమెరికా, దక్షిణకొరియా, బ్రెజిల్లో వంటి దేశాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అమెరికాలో మొత్తం కేసులసంఖ్య 10కోట్లు దాటింది. దీంతో భారత్ అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. పాజిటివ్ నమూనాల పూర్తి జన్యుక్రమాన్ని విశ్లేషించాలని సూచించింది. జీనోమ్ సీక్వెన్సింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఎన్సీడీసీ, ఐసీఎంఆర్‌లకు లేఖ పంపారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం దేశంలో కరోనా అదుపులోనే ఉన్నా భవిష్యత్తే భయపెడుతోంది. ప్రాణవాయువు అందని చావుల్ని తలచుకుంటేనే భయమేస్తోంది. జనాభాలో చైనా తర్వాతి స్థానంలో ఉన్న భారత్ ముందే జాగ్రత్తపడకపోతే జరిగే ఉత్పాతాన్ని ఊహించడం కూడా కష్టమే.