లిక్కర్‌ స్కామ్‌ కంపు.. కవిత అరెస్ట్‌ నుంచి తప్పించుకోవడం కష్టమే

By KTV Telugu On 21 December, 2022
image

కేసీఆర్‌ జాతీయపార్టీ పెట్టినందుకే కక్షసాధింపు. ఫాంహౌస్‌ కేసులో అడ్డంగా దొరికిపోయారనే కేంద్ర దర్యాప్తుసంస్థల వేధింపులు. ఈడీ వచ్చినా, సీబీఐ పిలిచినా భయపడం. ఇప్పటిదాకా కేసీఆర్‌ అండ్‌ కో ఎంత గట్టిగా హూంకరించినా చట్టం తన పని తాను చేసుకుపోతోంది. లిక్కర్‌స్కామ్‌తో తనకేంటి సంబంధమని బుకాయించిన కేసీఆర్‌ కూతురికి ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఈమధ్య ఇంటికొచ్చి విచారించిన సీబీఐ స్కామ్‌లో కవిత ప్రమేయంపై పక్కా ఆధారాలు సిద్ధంచేసుకుంటోంది. ఈసారి విచారణకు పిలిస్తే వ్యవహారం అరెస్ట్‌దాకా వెళ్లేలా ఉంది.

దినేశ్‌ అరోరా వాంగ్మూలంలో మొదటిసారి సౌత్‌గ్రూప్‌ కంపెనీతో కలిపి కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. మొదట సాక్షిగానే భావించినా కవితను నిందితుల జాబితాలో చేర్చేసింది. లిక్కర్‌ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సమీర్‌ మహేంద్రుపై ఈడీ దాఖలు చేసిన 181 పేజీల చార్జ్‌షీట్‌ కల్వకుంట్ల కవిత పేరుని ఈడీ 28 సార్లు ప్రస్తావించింది. కవితతో కలిసే సమీర్‌ మహేంద్రు లిక్కర్‌ బిజినెస్‌ నడిపినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, బినయ్‌ బాబు ఆప్‌ నేతలతో భేటీ అయినట్లు ఆధారాలున్నాయి. కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌చంద్రారెడ్డిల సౌత్‌గ్రూప్‌ ఈ స్కామ్‌లో కీలకంగా వ్యవహరించిందనేది ఈడీ అభియోగం.

అరుణ్‌పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు సౌత్‌గ్రూప్‌ తరపున ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టారు. సౌత్‌గ్రూప్‌ ద్వారా విజయ్‌ నాయర్‌కు రూ.100 కోట్ల ముడుపులు అందాయి. మొత్తం 32 రిటైల్‌ జోన్లలో తొమ్మిదింటిని ఈ సిండికేట్‌ దక్కించుకుందని ఈడీ చెబుతోంది. కేసీఆర్‌ కూతురు ఎప్పుడు ఎక్కడ ఎవరెవరిని కలుసుకున్నారో, ఎవరెవరితో మాట్లాడారో పూసగుచ్చినట్లు ఈడీ చార్జిషీట్‌లో పొందుపరిచింది. ఆప్‌కు రూ.100 కోట్లు చెల్లించటంతో ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఇండోస్పిరిట్స్‌కు వాటాలు లభించాయి. ఇండోస్పిరిట్స్‌ తరపున పిళ్లై కవితకు ప్రాతినిధ్యం వహించారు. అంతా అబద్ధమని ఊహాజనితమని కొట్టిపారేయడానికి వీల్లేకుండా పకడ్బందీగా ఉంది ఈడీ చార్జిషీట్‌. 28సార్లు తన పేరున్నా, 28వేలసార్లు ప్రస్తావించినా అబద్దం నిజం కాదంటూ కవిత చెబుతున్నా కళ్లెదుట కనిపిస్తున్న ఆధారాలతో ఆమె వాదన తేలిపోతోంది.