రాజకీయాల్లో ఆ ఇద్దరిదీ ప్రత్యేకమైన బంధం

By KTV Telugu On 22 December, 2022
image

రాజకీయాల్లో వారిద్దరిదీ ప్రత్యేకమైన బంధం. పార్టీలు వేరైనా ఇద్దరి లక్ష్యం ఒక్కటే. టార్గెట్ జగన్ పార్టీ. కనిపించే శత్రువుతో పోరాడే కనిపించని స్నేహితులుగా పేరుబడిపోయారు. వారెవరో కాదు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఎన్నికలు వచ్చిన ప్రతీసారి కలిసిపోతే ఎంత బాగుంటుంది అనే సాంగ్ వేసుకుంటాయి ఆ రెండు పార్టీలు. అందుకే కాబోలు టీడీపీ, జనసేన ఒకే గూటి పక్షులని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి భాషలో లవ్ బర్డ్స్ అని అర్థం. ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ టీడీపీపై ఏనాడు పెద్దగా బాణం ఎక్కుపెట్టకపోగా వైసీపీ టార్గెట్‌గానే రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారి తప్పులను పవన్ ఎత్తిచూపింది తక్కువేనంటారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ పెట్టిన దగ్గర్నుంచి పవన్ ప్రశ్నలన్నీ వైసీపీకే పరిమితం చేశారు. దానివల్లే పవన్ కళ్యాణ్‌ వైసీపీకి శత్రువుగా మారి రకరకాల పేర్లతో అభివర్ణించబడుతున్నారు. ప్యాకేజీ స్టార్ అని, పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని, బాబు దత్తపుత్రుడనే బిరుదులు పొందారు.

ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ-జనసేనల పొత్తుపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికలు టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. దాంతో మరోసారి బాబు జనసేనాని భుజం మీద తుపాకీ పెట్టి వైసీపీని షూట్ చేసేందుకు ఎత్తుగడ వేస్తున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తోంది. 2014లో పవన్ సపోర్ట్‌తో గద్దెనెక్కిన బాబు, 2024లో తన స్నేహితుని పార్టీతో జత కట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. మధ్యలో గురి తప్పడంతో ఈసారి లెక్క పక్కాగా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, జనసేన భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అయితే పేరుకు దోస్తులే గానీ కలిసి పోరాటాలు చేసింది లేదు. దీన్ని చంద్రబాబు తమకు అనుకూలంగా మల్చుకోవాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఒంటరిగా ఎదుర్కోలేమని భావించిన బాబు మరోసారి 2014 ఎన్నికల పొత్తును తెరపైకి తెస్తున్నారు. అయితే కమలనాథులు బాబుతో దోస్తీకి ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో పవన్ టీడీపీవైపు వెళ్లకుండా మోకాలడ్డుతోంది. బాబు పవన్‌ను సీఎంగా ఒప్పుకుంటేనే మద్దతిస్తామని బీజేపీ మెలిక పెడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దాన్ని ఎట్టిపరిస్థితులో చంద్రబాబు ఒప్పుకనే ప్రసక్తే ఉండదు. అదే సమయంలో పవన్‌ను దూరం చేసుకునే ఛాన్స్ ఉండదు. అందుకే రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ జనసేనగా సాగుతున్న పోరులో ప్రతీసారి పవన్‌కు మద్దతుగా బాబు వ్యాఖ్యలు చేస్తున్నారు.

చంద్రబాబుకు కష్టమొచ్చిన ప్రతీసారి పవన్ తెరపైకి వస్తుంటాడని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే ఉన్నట్టుగా అనుమానం కలుగుతోంది. ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెంటర్ ఆప్ అట్రాక్షన్‌గా మారారు. ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తున్నారు. వైసీపీ లక్ష్యంగా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. అందుకే పవన్‌తో పొత్తుకోసం టీడీపీ, బీజేపీలు వెంపర్లాడుతున్నాయి. బీజేపీ బాబుతో వద్దంటున్నా జనసేనాని మాత్రం టీడీపీని వదులుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. జగన్‌ను గద్దెదించాలంటే అంతా కలిసి నడవాలని అంటున్నారు. టీడీపీవైపు వెళ్లేందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. మోడీతో మీటింగ్ తర్వాత సైలెంట్ అయిన పవన్ పల్నాడు జిల్లా పర్యటనలో మళ్లీ సైకిల్‌ పార్టీతో పొత్తుకు సిగ్నల్ ఇచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో ఈసారి ఓట్లు చీలనివ్వనని అందర్నీ ఏకం చేస్తానని రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవకుండా చూసే బాధ్యత తనదేనని జనసేనాని స్పష్టం చేసారు. అంటే బాబుతో తన బంధం గట్టిదని మరోసారి చెప్పకనే చెప్పారు.

2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ ఆ ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మాత్రం మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా అప్పట్లో జనసేన పార్టీ నామమాత్రంగానే ఉండిపోయింది. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి గుడ్‌బై చెప్పిన పవన్ వామపక్ష పార్టీలతో జతకట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకుంది. జనసేన ఓట్లు చీల్చడంతో టీడీపీని గట్టి దెబ్బ కొట్టింది. దీంతో మరోసారి ఆ తప్పు చేయబోనంటున్నారు పవన్. 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని శపథం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అవుతానని పవన్ కళ్యాణ్ పైకి చెబుతున్నా వైసీపీని అడ్డుకునేందుకు బాబును ముఖ్యమంత్రిని చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నారు.

వ్యూహం తనకు వదిలేయని చెబుతున్న పవన్ వైసీపీని ఓడించే బాధ్యత తనదంటూ పరోక్షంగా చంద్రబాబుకు హామీ ఇస్తున్నారు. చంద్రబాబుకు తక్షణం కావాల్సింది అదే. ఇప్పుడు పవన్ చెబుతున్న వ్యూహాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా ఎలా మలచుకుంటారు పొత్తుపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయనేది ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి మరోసారి పోటీకి సిద్ధమయ్యే సూచనలు కనిపిస్తుండడంతో వైసీపీ వ్యూహం మార్చుకుంటోంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్దమవుతున్నారంటూ జనసేనానిని ఆత్మరక్షణలో పడేసే వ్యూహం తెరమీదకు తెస్తోంది అధికార వైసీపీ. దమ్ముంటే పవన్ రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటూ సవాల్ విసురుతోంది. కాపుల ఓట్లు పవన్ హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. బాబు కోసమే పవన్ ఎప్పుడూ పనిచేస్తుంటారని విమర్శిస్తోంది.