బాబు రమ్మంటున్నాడు.. రేవంత్ వెళ్తాడా!

By KTV Telugu On 22 December, 2022
image

కేసీఆర్ బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లోకి వెళ్లిన వేళ తెలంగాణలో పుంజుకునేందుకు మళ్లీ తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్టీకి పునర్ వైభవం తీసుకువచ్చేందుకు చంద్రబాబు రంగంలోకి దిగారు. మళ్లీ సైకిల్‌ తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం గుమ్మం నుంచి సైరన్ మోగించారు. తండోపతండాలుగా తరలొచ్చిన తమ్ముళ్లు ఆశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ సర్ధార్ పటేల్ మైదానంలో జరిగిన శంఖారావంలో టీడీపీ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలను కలిపేయాలని కొందరు బుద్ధిలేని వాళ్లు మాట్లాడుతున్నారంటూ ఏపీలో జగన్ పార్టీని టార్గెట్ చేస్తూనే తెలంగాణ ఓటర్ల సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. ఎప్పటికీ రెండు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశమే లేదన్న చంద్రబాబు విడిపోయినా దేశంలో ఆదర్శంగా నిలపాలన్నదే తమ అభిమతమని తెలిపారు. ఏపీలో కంటే కూడా తెలంగాణలోనే ఎక్కువ అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు.

ఇక తెలంగాణలో టీడీపీని వీడి వెళ్లిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరం కలిసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకొద్దామని అభివృద్ధిలో, సంక్షేమంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లోని వలస నేతలపై సీనియర్లు తిరుగుబాటు చేసిన వేళ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. టీడీపీ నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పదవులన్నీ వారికే కట్టబెడుతున్నారని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని సీనియర్లు రేవంత్‌పై యుద్ధం ప్రకటించారు. తాజాగా బాబు చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ లోకి వెళ్లిన నాయకులు మళ్ళీ టీడీపీలోకి వెళ్తారా అనే చర్చ ఇప్పుడు కొనసాగుతుంది.

టీడీపీలో ఓ నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చాక ఓ శక్తిగా మారారు. ఏకంగా ఆ పార్టీకి అధ్యక్షుడయ్యారు. పార్టీలో పెద్దన్నలు రేవంత్‌ తీరును వ్యతిరేకిస్తున్నా రాహుల్ సపోర్ట్ మెండుగా ఉంది. త్వరలోనే పాదయాత్రకు సిద్ధమవుతున్నారు రేవంత్. ఈనేపథ్యంలో బాబు పిలిచినా రేవంత్ మళ్లీ టీడీపీలోకి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. రేవంత్ వెంట వచ్చిన కేడర్ టీడీపీలోకి వెళ్తుందా అంటే అది కూడా జరగకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ బలపడడం కష్టమే. ఈ నేపథ్యంలో వారంతా రేవంత్ వెంటే ఉండే అవకాశం ఉంది. మాజీ టీడీపీలే తిరిగి పార్టీలో చేరకపోతే ఇక మరే ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వలసలు ఉండే అవకాశం లేదు. పదవులు లేని నేతలు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీలు మాత్రమే టీడీపీ వైపు చూసే అవకాశం కనిపిస్తుంది. వారిని నమ్ముకొని రాష్ట్రంలో టీడీపీ రాజకీయం చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదు. మున్ముందు తెలంగాణ టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది చూడాలి.