సెల్ఫ్ డబ్బాతో నవ్వులపాల్

By KTV Telugu On 22 December, 2022
image

ఏడు పదుల వయసులోనూ అలుపులేకుండా తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అహర్నిషలు కష్టపడుతున్నారు. గంటల తరబడి ఉపన్యాసాలతో కేడర్‌ను ఉత్తేజపరుస్తున్నారు. ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు తెలంగాణలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. దాంట్లో భాగంగానే పార్టీని పటిష్టం చేసేందుకు ఖమ్మంలో శంఖారావం ఊదిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏ పార్టీని విమర్శించకుండా తాను ఏం చేశానో చెప్పుకొచ్చారు. అయితే అందులో ఆణిముత్యాల్లాంటి పదాలను వదిలారు. ట్రోల్స్‌కు కారణమయ్యారు. 40ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. విజన్ ఉన్న నాయకుడని చంద్రబాబుకు పేరుంది. అయితే మనం ఏదైనా మంచి పనిచేస్తే ఆ గొప్పతనం గురించి నలుగురు చెప్పుకుంటే ఆ ఆనందమే వేరుంటుంది. కానీ సుదీర్ఘ అనుభవం ఉన్న బాబు తన గురించి తానే డబ్బా కొట్టుకునే వీక్‌నెస్ పాయింట్ ప్రత్యర్థులకు వరంగా మారుతోంది.

ఖమ్మంలో టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్తగా ఏది వచ్చినా దానికి కారణం తానే అని చంద్రబాబు చెప్పుకుంటారని విపక్షాలు పదే పదే అరోపణలు చేస్తుంటాయి. సోషల్ మీడియా లోనూ మీమ్స్ నడుస్తాయి. అందుకు తగ్గట్టే ఖమ్మంలో బాబు చేసిన కామెంట్స్‌ మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చాయి. తనకు విజన్ ఉందని యువకుడిలా ఆలోచిస్తాననని 30 ఏళ్ళ తర్వాత ఏం జరగనుందో ఇప్పుడే చెప్పగలనన్నారు. హైదరాబాద్ అభివృద్ది చేసింది తానేనని చెప్పారు. అక్కడితోనే ఆగలేదు కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన ఘనత తనదేనని లేకపోతే ఎంతమంది చనిపోయేవారో అంటూ చెప్పుకొచ్చారు. అంతేనా ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారంటే అందుకు కారణం తన కృషియేనంటూ గొప్పలకు పోయారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో తాను చేసిన అభివృద్ధి గురించి గూగుల్‌ని అడిగితే చెబుతుందనడంపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.

ఖమ్మం టూర్‌లో చంద్రబాబు ఏ ఒక్కరినీ పల్లెత్తు మాట అనలేదు. బీఆర్ఎస్, బీజేపీలతో వైరం పెట్టుకుంటే ఏపీలో ఇబ్బందులు తప్పవని గ్రహించారో ఏమో విమర్శల జోలికి వెళ్లలేదు. కానీ పరోక్షంగా మాత్రం అటు ఏపీలో జగన్‌ను, ఇటు తెలంగాణలో కేసీఆర్‌ను దెప్పిపొడిచారు. బాబు పర్యటన ముగియగానే గులాబీ నేతలు లైన్‌లోకి వచ్చారు. ఏపీలో బీజేపీతో పొట్టుపెట్టుకోవడం కోసమే బాబు డ్రామా ఆడుతున్నారని తెలంగాణలో ఆయన ఆటలు సాగవని మంత్రి హరీష్ విమర్శలు గుప్పించారు. తన బలాన్ని చూపించుకునేందుకు ఖమ్మం సరిహద్దులో పెట్టారని ఆ సభకు పక్కరాష్ట్రం నుంచి జనాన్ని తీసుకొచ్చారని సెటైర్లు వేశారు. 2018 ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాటు చేస్తే చంద్రబాబు దెబ్బకు కూటమే ఖతమైపోయిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది భస్మాసుర హస్తమని అన్నారు. చుక్కలెన్ని ఉన్నా చంద్రుడు ఒక్కటేనని ఎన్ని పార్టీలు వచ్చినా తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆరే ఉంటారని కవిత డైలాగులు కొట్టారు. ఇక బాబు టూర్‌పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఏ రాష్ట్రంలో ఉన్నారో కూడా తెలియడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం మార్కెటింగ్‌ సంస్థ మాదిరిగా తన పార్టీకి డిమాండ్‌ క్రియేట్‌ చేసుకునే పనిలో ఉన్నారని ఎద్దేవా చేసారు. చంద్రబాబుకు తెలంగాణ కాంగ్రెస్ లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని సజ్జల వ్యాఖ్యానించారు.