నాటు నాటు నాటు.. RRRకి ఆస్కార్‌ షార్ట్‌లిస్ట్‌లో చోటు!

By KTV Telugu On 22 December, 2022
image

ప్రపంచ చలనచిత్ర రంగంలోనే ఆస్కార్‌ అవార్డ్‌ ప్రతిష్ఠాత్మకం. ఆ అవార్డ్‌ దక్కటం ప్రతీ నటుడికీ జీవితలక్ష్యం. అలాంటి ఆస్కార్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది మన సిన్మా. నాలుగు భారతీయ చిత్రాలు ఆస్కార్‌ వైపు తొలి అడుగు వేశాయి. ఆస్కార్‌ అవార్డుల నామినేషన్లలో పోటీ పడనున్న చిత్రాల షార్ట్‌లిస్ట్‌ను అకాడమీ ప్రకటించింది. సుమారు పది విభాగాలకు సంబంధించిన జాబితాలో నాలుగు విభాగాల్లో భారతీయ సిన్మాలకు స్థానం దక్కింది.

ఉత్తమ అంతర్జాతీయ సినిమా కేటగిరీలో ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’, ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటునాటు’, ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్‌’ చోటు దక్కించుకున్నాయి. అందులో అంతర్జాతీయంగా పాపులర్‌ అయిన ట్రిపులార్‌ పాట కూడా ఉండటం అందరినీ ఉత్సాహపరుస్తోంది. జనవరి 12 నుంచి 17 వరకూ నిర్వహించే ఓటింగ్‌ని ఆధారం చేసుకుని జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన చిత్రాలను ప్రకటిస్తారు.

ఈ ఏడాది సిల్వర్‌స్క్రీన్‌మీద సందడి చేసిన పాన్‌ ఇండియా సిన్మాల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా ఉంది. ట్రిపులార్‌తో టాలీవుడ్‌ సత్తాని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మార్చి 25న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు చేసింది. రూ. 550 కోట్లతో నిర్మించిన సిన్మా దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లతో రికార్డ్‌ సృష్టించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని ప్రతిష్టాత్మక ఆస్కార్‌ రేసులో నిలిచింది. బెస్ట్‌ ఒరిజనల్‌ సాంగ్‌ కేటగిరీ షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్న నాటునాటునాటు పాట ప్రపంచమంతా దుమ్మురేపింది. పిల్లలు, పెద్దలు, సెలబ్రిటీలు వారూవీరనే తేడాలేకుండా ఎంతోమంది ఈ పాటకు స్టెప్పులేశారు. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ వేదికపై కూడా ఈ పాట సందడి చేసేలా ఉంది.