ఒక పార్టీ అనేది మహాసముద్రం లాంటిది. దట్టమైన అడవి లాంటింది. కడలిలోనూ, కారవడిలోనూ అన్ని రకాల జీవులుంటాయి. అవీ కలిసి జీవిస్తాయి. కీచులాడుకుంటాయి… చంపుకుంటాయి.. వాటి మధ్య పేచీకి ఎవరినో బాధ్యత వహించాలంటే కుదురుతుందా.. గొడవలకు సముద్రుడిని, సింహాన్ని తప్పుపట్టడం భావ్యమా… ఇప్పుడు టీఆర్ఎస్ లో జరిగింది కూడా అదే.. ఒక జిల్లాకు చెందిన ఇద్దరు నేతల మధ్య వివాదంతో ఒకాయన టీఆర్ఎస్ ను వీడిపోయారు. దానికి కొందరేమో కేసీఆర్ కే షాకిచ్చారన్న ప్రచారం మొదలెట్టారు….
కాంగ్రెస్ లోకి ఓదెలు దంపతులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ గూటికి చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అతన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లారు. వెంట ఓదెలు సతీమణి, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి కూడా ఉన్నారు. సోనియాగాంధీతో భేటీ అయిన తర్వాత ప్రియాంకా గాంధీ సమక్షంలో వారిద్దరూ కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓదెలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి గెలిచి ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు. 2018లో పార్టీ ఆయనకు టికెటివ్వలేదు. యువ నాయకుడు బాల్క సుమన్ కు, చెన్నూరు టికెట్ కేటాయించి గెలిపించుకున్నారు. బదులుగా ఓదెలు సతీమణి భాగ్యలక్ష్మికి జెడ్పీ చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టారు…
కేసీఆర్ కాదు సుమన్..
ఓదెలుకు కేసీఆర్ పై ఎలాంటి కోపం లేదని తెలుస్తోంది. జిల్లాలో కొందరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నా అధిష్టానం పట్టించుకోలేదన్న బాధ మాత్రం ఉంది. ఎమ్మెల్యే బాల్క సుమన్ తో ఆయన విభేదాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అవి మరింతగా ముదిరిపోయాయి. నియోజకవర్గంలో బాల్క సుమన్ ఒంటెద్దు పోకడలు పోతున్నారని నల్లాల ఓదేలు ఆరోపిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసిన పార్టీ పెద్దలు పట్టించుకోవడం లేదన్న ఆవేదనతోనే ఓదెలు బయటకు వెళ్లిపోయారు. కేసీఆర్ పట్ల ఓదెలుకు గౌరవభావమే ఉందట.
ఓదెలు వర్సెస్ సుమన్
బాల్క సుమన్ దూకుడును ప్రదర్శించే యువ నాయకుడు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని టీఆర్ఎస్ యూత్ లో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే జిల్లాలో మాత్రం తొందరపాటును ప్రదర్శిస్తూ.. ఇతరులను పూర్తిగా పక్కకు తోసేస్తున్నారని ఓదెలు వర్గం అంటోంది. ఇటీవలి కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. సుమన్ తీరును ఓదెలు వర్గం అసలు సహించలేకపోతోంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాల నడుమ.. కీలక ఆదిలాబాద్ జిల్లాలో అంతర్గత కుమ్ములాట టీఆర్ఎస్ అధిష్టానానికి నెత్తినొప్పిగా మారింది. ఇప్పుడు ఓదెలు నిష్క్రమణ తర్వాత జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి…
ఫిరాయింపులు ఇబ్బందేనా..
తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఫిరాయింపులు అధికార పార్టీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా నరుక్కుపోతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు అన్ని పార్టీల వారు తమతో చేతులు కలుపుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంతకాలం చెబుతూ వచ్చారు. వాస్తవ పరిస్తితి అందుకు భిన్నంగా ఉంది. టీఆర్ఎస్ లో ఇమడలేని వాళ్లు కాంగ్రెస్ వైపుకే అడుగులు వేస్తారని ఓదెలు వ్యవహారంలో తేలిపోయింది. మరి బీజేపీలో అసంతృప్తిపరులు ఏం చేస్తారో చూడాలి…