తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు ఈ మధ్య చెప్పుల భాషలోనే మాట్లాడుకుంటున్నారు. చెప్పుతో కొడతా..చెప్పు దెబ్బలు తింటావ్..చెప్పులు మెడలో వేస్తాం. ఈవిధంగా ప్రత్యర్థులపై విమర్శలు చేసుకుంటున్నారు. ఆమధ్య ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులకు చెప్పు చూపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చారు. ఆ తరువాత తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత బీజేపీ ఎంపీ అరవింద్‌ను ఇదే భాషను ప్రయోగించారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్‌కు డ్రగ్స్ అలవాటు ఉంది అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నెల రెండు వారాల క్రితం ఆరోపించారు.
బండి సంజయ్‌కు పొగాకు నమిలే అలవాటు ఉందని అంతకుముందు కేటీఆర్ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ పరీక్ష కోసం కోసం తన రక్తం, వెంట్రుకలు, గోళ్లు, చర్మం ఇస్తా అవసరమైతే కిడ్నీ కూడా ఇస్తా, టెస్టు చేసుకోమను. తనకు క్లీన్ చిట్ వస్తే బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటాడా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా చెప్పు కాదు తన చెప్పుతో తననే కొట్టుకోమని ఒక సలహా కూడా ఇచ్చారు. కేటీఆర్ చాలెంజ్‌పై బండి మళ్లీ రియాక్టయ్యారు. కేటీఆర్ విత్ డ్రావల్ సింప్టమ్స్ తో బాధపడుతున్నాడు అని ఆరోపించారు. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు. ఆ తరువాత ప్రజల కోసం తాను తల నరకించుకోవడానికైనా చెప్పు దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి నాయకులు ఇలా చెప్పుల బాషలో మాట్లాడుకుంటుంటే జనం వినలేక చెవులు మూసుకుంటున్నారు.