సినిమా ఇండస్ట్రీలో ఆయన పవర్ స్టార్, తమ్ముడు సక్సెస్ ఫుల్ గా అత్తారింటికి దారి వెదుక్కున్నాడు. పాలిటిక్స్ లో మాత్రం దారీతెన్నూ లేకుండా తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్.. తన పార్టీ తరపున ఏపీలో కేవలం ఒకరిని మాత్రమే గెలిపించుకోగలిగారు. ఈసారి ఎలాగైనా ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని పవన్ కలలు కంటున్నారు.. పొత్తు చర్చలకు రెడీ అని కూడా చెప్పేశారు. ఇప్పటికే బీజేపీతో పవన్ కల్యాణ్ పొత్తులో ఉన్నట్లు చెబుతారు. టీడీపీతోనూ ఆయన సర్దుబాటు చేసుకుంటారని చర్చ జరిగింది. అంతలోనే పొత్తులు ఇంకా ఫైనల్ కాలేదంటూ ఇటీవలే ప్రకటన చేసి జనాన్ని మళ్లీ అయోమయంలోకి నెట్టారు. ఏపీ పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతుండగానే… తెలంగాణ పాలిటిక్స్ పై జనసేనాని ఓ మాట అనేశారు..
తెలంగాణలో జూనియర్ పార్ట్ నర్
పవన్ కల్యాణ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా లక్కారం గ్రామానికి చెందిన కొంగర సైదులు, కోదాడకు చెందిన కడియం శ్రీనివాస్ కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా లక్కారంలో మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి పరిమిత పాత్ర పోషిస్తామని, ఎవరితో కలిసి ఆ పాత్ర పోషించాలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన చెప్పారు. తనకు ఆంధ్రప్రదేశ్ జన్మనిస్తే… తెలంగాణ పునర్జన్మనిచ్చిందని పవన్ అన్నారు. ఓడినా బాధ్యతతో కూడిన రాజకీయాలు చేస్తానని చెప్పుకున్నారు…
పొత్తుగా మారనున్న బీజేపీతో దోస్తీ
పవన్ కల్యాణ్ కు బీజేపీకి చాలా రోజులుగా దోస్తీ ఉంది. ఆ దోస్తీ ఇప్పుడు తెలంగాణలోనూ పొత్తుగా మారబోతోంది. ఆయన పార్టీ జనసేన 20 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రతీ నియోజకవర్గంలోనూ ఆరు నుంచి ఏడు వేల మంది అభిమానులు ఉన్నారని పవన్ చెబుతున్నారు. పైగా తన పార్టీకి సానుభూతి ఎక్కువగా ఉందని విశ్వస్తున్నారు. పైగా తన బలానికి బీజేపీ ఓట్లు చేరితే విజయం తధ్యమని ఆయన విశ్వసిస్తున్నారు..
తెలంగాణలో బీజేపీ దూకుడును పెంచుతోంది. అధికార టీఆర్ఎస్ పై ఆరోపణాస్త్రాలు సంధిస్తూ… జనాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన రెండో దఫా పాదయాత్రను విజయవంతంగా ముగించారు. భారీ ప్రజా స్పందన వచ్చిన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని తెలంగాణ ఓటర్లకు సంజయ్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బహుముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో బీజేపీ తనకు అనుకూలమైన పార్టీలతో పొత్తు ఆలోచనలో ఉన్నట్లే తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ నాయకుడు అనడంలో సందేహం లేదు. అయితే సినిమా నటుడిగా ఆయనకు ప్రత్యేకమైన అభిమాన జనం ఉన్నారు. తెలంగాణ ఫీలింగ్ ఉన్నప్పటికీ సినీ గ్లామర్ కు ఓటేస్తారన్న విశ్వాసం ఉంది. తమ బలానిక పవన్ గ్లామర్ తోడయితే విజయం ఖాయమని బీజేపీ నమ్ముతోంది. పవన్ కల్యాణ్ ఆలోచన కూడా అదే కావచ్చు…
తెలివిగల పనే !
పవన్ కల్యాణ్ తెలివిగల పనే చేస్తున్నారనుకోవాలి. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ రెండు బలమైన పార్టీలున్నాయి. షర్మిల ఇప్పటికే పాదయాత్రలు చేస్తూ సగటు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్లు ఆప్ లో చేరకపోతే విడిగా పోటీ చేస్తారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దానితో తెలంగాణలో ఓట్ల చీలిక ఎక్కువగానే ఉంటుంది. జనసేన విడిగా పోటీ చేస్తే ఒక సీటు కూడా రాదు. పైగా డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమే. ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకునే పవన్ కల్యాణ్ పరిమితపాత్ర అంటూ కొత్త వాదన తెరపైకి తెచ్చారు. ఫైనల్ గా తెలంగాణలో కూడా బీజేపీతో చేతులు కలిపే అవకాశాలే ఉన్నాయి…