బీఎఫ్‌-7.. టీకా వేసుకున్నా వైర‌స్ త‌ప్ప‌దా?

By KTV Telugu On 23 December, 2022
image

 

ఎవ‌రు చేసుకున్న ఖ‌ర్మ వారు అనుభ‌వించ‌క త‌ప్పదు. త‌న త‌ప్పుల‌కు చైనా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. తాను సృష్టించిన వైర‌స్‌కు తానే బ‌ల‌వుతోంది డ్రాగ‌న్ కంట్రీ. సొంత టీకాల‌పై గుడ్డి నమ్మకంతో ప్రజ‌ల‌ను పాడెక్కిస్తోంది. కానీ ఈ ఉత్పాతం చైనాతో ఆగ‌డం లేదు. వైర‌స్ స‌రిహ‌ద్దులు దాటేసింది. ఖండాంత‌రాల‌కు వ్యాపిస్తోంది. చైనాని వ‌ణికిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్‌-7 స‌బ్ వేరియంట్ చివ‌రికి మ‌న దేశంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. దీంతో కేంద్రం అలారం మోగించింది. రాష్ట్రాలు అప్రమ‌త్తమ‌య్యాయి.

బీఎఫ్‌-7 గ‌తంలోని వైర‌స్‌ల‌కంటే తీవ్రమైన‌దేమీ కాద‌న్న వార్త కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తోంది. అయితే దీని వ్యాప్తి మాత్రం గ‌తంకంటే ఎక్కువ‌స్థాయిలో ఉంటుంద‌న్న విష‌యం మాత్రం గుబులుపుట్టిస్తోంది. కోవిడ్‌ కారక సార్స్‌-కోవ్ 2 వైరస్‌ ఉత్పరివర్తనంతో పుట్టుకొచ్చిన వేరియంట్లలో ఒమిక్రాన్‌ ఒకటి. ఒమిక్రాన్ నుంచి బీఏ-5’, దానినుంచి బీఏ-5.2.1.7 పుట్టుకొచ్చాయి. బీఎఫ్‌-7 కూడా ఇంచుమించు అలాంటిదే. అయితే వ్యాక్సిన్ తీసుకున్నవారిని క‌రోనాబారిన‌ ప‌డ్డవారిలో ఉత్పత్తయ్యే యాంటీబాడీలను బీఎఫ్‌-7 సబ్‌ వేరియంట్ దెబ్బకొడుతోంది.

చైనా వుహాన్‌లో మొద‌టిసారి వెలుగుచూసిన కరోనా వైరస్‌తో పోలిస్తే బీఎఫ్‌-7 సామర్థ్యం 4.4 రెట్లు ఎక్కువగా ఉంది. ఒమిక్రాన్‌లోని బీక్యూ-1 స‌బ్‌వేరియంట్‌కి ప‌దిరెట్లు ఎక్కువ‌గా దీని తీవ్రత ఉందంటున్నారు. యాంటీబాడీలను నిరోధించగల సామర్థ్యం ఎక్కువ‌గా ఉండ‌టంతో వైరస్ విస్తృతంగా వ్యాపించే అవ‌కాశం ఉంది. ఒక‌రిద్వారా స‌గ‌టున 10 నుంచి 18.6 మందికి బీఎఫ్‌-7 వ్యాపిస్తోంది. 2022 అక్టోబరులో అమెరికాలో నమోదైన కరోనా కేసుల్లో 5శాతం బీఎఫ్‌-7 వేరియంట్ వైర‌స్సే.

జీరో కోవిడ్ పేరుతో ప్రపంచంలోనే ఎక్కడా లేనంత క‌ఠిన‌మైన ఆంక్షలు విధించింది చైనా. అయినా ఆ దేశం కొత్త వేరియంట్‌తో నిలువెల్లా వ‌ణుకుతోంది. దీనికి ముఖ్యమైన కార‌ణం చైనీయుల్లో ఎక్కువ‌మంది మునుపు క‌రోనాబారిన ప‌డ‌క‌పోవ‌డ‌మే. ప్రపంచ‌మంతా వ‌ణికినా మ‌నం సేఫ్ అనుకున్న చైనావాసులకు నష్టమే జరిగింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో బీఎఫ్‌-7 వేగంగా వ్యాపిస్తోంది. స్థానిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి రూపొందించిన వ్యాక్సిన్లు పెద్దగా ప్రభావం చూప‌లేక‌పోతున్నాయి.

చైనాలోనే అంత తీవ్రంగా ఉంటే జ‌నాభాలో ప్రపంచంలో ఆ త‌ర్వాతిస్థానంలో ఉన్న మ‌న ప‌రిస్థితి ఏంట‌న్న ఆందోళ‌న ఉంది. అయితే బీఎఫ్‌-7తో ప్రస్తుతానికి భారతీయులు భయాందోళన చెందాల్సిన అవ‌స‌రంలేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే గతంలోనే డెల్టా, ఒమిక్రాన్‌ వంటి వేరియంట్లు దేశంలో విస్తృతంగా వ్యాపించాయి. ఆ ప్రభావంతో ప్రజ‌ల్లో వైర‌స్‌ని త‌ట్టుకోగ‌ల రోగనిరోధక శక్తి ఎక్కువ‌గా ఉంది. కాబట్టి ఈ స‌బ్ వేరియంట్ మ‌న‌ల్ని పెద్దగా ఇబ్బంది పెట్టక‌పోవ‌చ్చంటున్నారు. అదే స‌మ‌యంలో తేలిగ్గా తీసుకోవ‌డానికి కూడా లేదు. నిబంధ‌న‌లు పాటిస్తూ ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకుంటే వైర‌స్‌ని తిప్పికొట్టడం పెద్ద క‌ష్టమేంకాదు.