పిల్లల్ని కనండి..పైసలిస్తాం..జపాన్‌ బంపరాఫర్‌!

By KTV Telugu On 23 December, 2022
image

 

ఎక్కడయినా పిల్లల్ని కనండి డబ్బులిస్తామంటారా? కానీ జపాన్‌ ప్రజలకు అక్కడి ప్రభుత్వం ఈ బంపరాఫర్‌ ఇచ్చింది. పిల్లల్ని కంటే ఇదిగో నజరానా అంటూ ఆ మొత్తాన్ని పెంచేసింది. జపాన్‌లో జనాభా నానాటికి తగ్గిపోతోంది. వృద్ధులసంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలను పిల్లల్ని కనమంటూ జపాన్‌ ప్రోత్సహిస్తోంది. ఇదివరకే ఆఫర్‌ ప్రకటించినా ప్రజలు పెద్దగా ముందుకు రాకపోవటంతో ప్రైజ్‌ మనీ మరింత పెంచేసింది. జపాన్‌లో పిల్లల్ని కంటే ఇచ్చే మొత్తం ఎంతో తెలుసా..అక్షరాలా 3లక్షలు.

ఎంత ఎంకరేజ్‌ చేస్తున్నా జనం కంటేనే కదా. అందుకే మరో మార్గం లేక ప్రోత్సాహక మొత్తాన్ని పెంచేసింది జపాన్‌. ఈ దెబ్బతో పిల్లల్ని కనడానికి భారీగా ముందుకొస్తారని అంచనావేస్తోంది. ఆ దేశంలో 1972 నుంచే చైల్డ్ బెన్‌ఫిట్ యాక్ట్ అమలులో ఉంది. ఇప్పటికే జపాన్‌లో బిడ్డ పుడితే రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. ఇప్పుడా మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచాలనే ఆలోచన చేశారు. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పెంపు అమల్లోకి రాబోతోంది.
2021లో జపాన్‌లో అత్యల్ప సంఖ్యలో జననాలున్నాయి. దీంతో ప్రభుత్వం యువ జనాభా పెరుగుదలని ఓ యజ్ఞంలా తీసుకుంది. జనాభా పెరుగుదల ఆవశ్యకతపై పెళ్లయిన జంటలకు అవగాహన కల్పిస్తోంది. అయినా పెద్దగా ఫలితం లేకపోయేసరికి నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించింది. గణాంకాలు చూస్తే గత ఏడాది జపాన్‌లో మొత్తం 8,11,604 మంది పిల్లలు పుట్టగా ఆ ఏడాది చనిపోయిన వారి సంఖ్య 14 లక్షలకుపైనే ఉంది. మరోవైపు జపాన్‌లో సెంచరీకొట్టినవారి వృద్ధులసంఖ్య 86 వేలు దాటింది. వీరిలో 88 శాతం మంది మహిళలే కావడం విశేషం.

2021లో జపాన్ ప్రభుత్వ నివేదిక ప్రకారం జననాల రేటు 10 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 2060 కల్లా ప్రతి10 మందిలో నలుగురు 65 ఏళ్లవారే ఉంటారనేది ఓ అంచనా. జనాభా తగ్గితే ఆర్థికవృద్ధిపై దాని ప్రభావం ఉంటుంది. అందుకే జపాన్‌ జనాభాపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే ప్రోత్సాహక మొత్తాన్ని పెంచేసినా జనాభా పెరుగుతుందన్న గ్యారంటీ మాత్రం లేదు. ఎందుకంటే ఆ దేశంలో ఒక డెలివరీకోసం అక్కడి ప్రజలు 2లక్షల 88వేలు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం అందించేదాంట్లో డెలివరీఖర్చులు పోను మిగిలేది12,400 రూపాయలే.

జపాన్‌ మాదిరిగానే జర్మనీ, రష్యా, తైవాన్‌, కొన్ని యూరోపియన్ దేశాల్లోనూ జననాల రేటు తగ్గుతోంది. దీంతో కొన్ని దేశాలు జనాభా పెంచేందుకు కుటుంబాలకు ఆర్థిక సాయం ఇస్తున్నాయి. బేబీ బోనస్‌ స్కీమ్ అమలు చేస్తున్నాయి. కోవిడ్ కారణంగా సింగపూర్‌లోని చాలా జంటలు పిల్లల్ని వద్దనుకోవడంతో ఆర్థికసాయం ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మొదటి బిడ్డకు 4 లక్షల 80 వేలు, మూడో బిడ్డకు ఆరు లక్షల రూపాయలు ఇస్తోంది. చైల్డ్ డెవలప్‌మెంట్ బోనస్ కింద 3లక్షల 41 వేల రూపాయలదాకా ఇస్తోంది. ఈ లెక్కన జపాన్‌ ఐదారు లక్షలదాకా ఇస్తేగానీ పిల్లల్ని కంటానికి జనం ముందుకొచ్చేలా లేరు.