నవరస నటనాసార్వభౌముడు. 60దశాబ్దాల కెరీర్లో 777 సిన్మాలు చేసిన దిగ్గజం. రెండుతరాలకు చిరపరిచితుడైన నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, కమెడియన్‌గా ఆయన విశ్వరూపాన్ని మాటల్లో చెప్పలేం..వెండితెరపై వీక్షించాల్సిందే. అన్నిరకాల పాత్రల పోషణతో నవరస నటనలో సార్వభౌముడు అనిపించుకున్నారు కైకాల.
కేవలం నటుడిగానే కాదు నిర్మాతగానూ కైకాల కొన్ని సినిమాలు రూపొందించారు. పౌరాణిక, సాంఘిక, జానపద సిన్మాల్లో ఆయనది అసమాన ప్రతిభ. 28 పౌరాణికం, 51 జానపద సిన్మాల్లో నటించటం కైకాలకున్న రికార్డు. మొదట్లో ఎన్టీఆర్‌కి డూప్‌గా కూడా నటించారు కైకాల. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వీ రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల ముందుంటారు.
యమగోల, యమలీల సిన్మాల్లో యముడి పాత్రతో ఆ క్యారెక్టర్‌కు ట్రేడ్ మార్క్‌గా నిలిచిపోయారు కైకాల.
కృష్ణా జిల్లా బంటుమిల్లి గ్రామంలో1935 జులై 25న జన్మించారు కైకాల సత్యనారాయణ. గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులున్నారు. సిపాయి కూతురు సిన్మాతో తెరంగేట్రం చేసిన కైకాల నటించిన చివరి చిత్రం మహర్షి. ఈమధ్యే నటశేఖర కృష్ణ మరణం తర్వాత మరో సీనియర్ నటుడిని కోల్పోవటం చిత్రపరిశ్రమకు తీరని విషాదం మిగిల్చింది. సినీ ప్రముఖులు కైకాల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కైకాల భౌతికంగా మన మధ్య లేకపోవచ్చుగానీ ఆయన నటనాకౌశలం మన కళ్లెదుట ఎప్పటికీ కదలాడుతూనే ఉంటుంది.