టార్గెట్ 2029..ప‌వ‌న్‌కళ్యాణ్ దూర‌దృష్టి!

By KTV Telugu On 24 December, 2022
image

 

ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు జ‌న‌సేనాని. పార్టీపెట్టి తొమ్మిదేళ్ల‌యిపోయినా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి అసెంబ్లీలో అడుగుపెట్టే అవ‌కాశం రాలేదు. 2019 ఎన్నిక‌ల్లో రాజోలులో పార్టీ గెలిచినా ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ వైసీపీ గూటికి చేరిపోయారు. అందుకే ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్‌కి త‌త్వం బోధ‌ప‌డిన‌ట్లుంది. ప‌రిగెత్తి పాలు తాగ‌డం కంటే నిల‌బ‌డి నీళ్లు తాగితేనే మంచిద‌నుకుంటున్నారు. ఒక్క‌సారి మాకు అవ‌కాశం ఇవ్వండ‌ని జ‌నంలోకి వెళ్తున్నా, ఆయ‌నే సీఎం అభ్య‌ర్థి కావాల‌న్న డిమాండ్ తెర‌పైకొస్తున్న 2024లో అద్భుతం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌క‌మైతే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి లేన‌ట్లే క‌నిపిస్తోంది.

సీరియ‌స్‌గా పాలిటిక్స్ చేసుంటే ఈపాటికి ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన మూడో ప్ర‌త్యామ్నాయంగా బ‌ల‌ప‌డి ఉండేది. రాజ‌కీయంగా కొన్ని త‌ప్ప‌ట‌డుగులు ప‌డ్డాయి. ఆవేశంతో ఊగిపోయే అభిమాన‌గ‌ణంతో పొలిటిక‌ల్ లైఫ్ సెటిల్ కాద‌నే విష‌యం నిల‌క‌డ‌మీద అర్ధ‌మైంది. అందుకే ఇప్పుడు కొంత వ్యూహాత్మ‌కంగా ముందుకెళ్తున్నారు ప‌వ‌న్‌కళ్యాణ్‌. ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయం మారిపోతుంద‌ని ఆయ‌న అనుకోవ‌డం లేదు. అయితే అసెంబ్లీలో గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప్రాతినిధ్యం ఉండాల‌ని కోరుకుంటున్నారు. 2029లో అధికార‌మే టార్గెట్‌గా బ‌ల‌ప‌డేందుకు అది ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న ఆలోచ‌న‌తో ఉన్నారు.
ఏపీలో అధికార‌పార్టీ ఈ నాలుగేళ్ల‌లో డీలాప‌డ‌లేదు. ఇంకా బ‌ల‌ప‌డే ప్ర‌య‌త్నాల్లో ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వై నాట్ 175 అన్న నినాదంతో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. మ‌రోవైపు తెలుగుదేశానికి 2019లో ఆశించిన సీట్లు రాక‌పోయినా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా బ‌లంగానే ఉంది. పొత్తులుంటాయా లేదా స‌మీక‌ర‌ణాలు మారిపోతాయా అన్న‌ది వేరే ముచ్చ‌ట‌. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లోనైతే వైసీపీ, టీడీపీల‌ను ఢీకొట్టి అధికారంలోకి రావ‌డం అన్న‌ది అసాధ్య‌మే.

పోయిన ఎన్నిక‌ల్లో ఏపీలో సింగిల్ సీటుకూడా రాని బీజేపీని న‌మ్ముకున్నా అది జ‌ర‌గ‌ని ప‌ని. అందుకే జ‌న‌సేన వ్యూహం అధికారం కంటే ఎక్కువ సీట్లు ఎలా సంపాదించాల‌న్న‌దానిపైనే ఉంది. జ‌న‌సేన బ‌ల‌హీన‌త అధికార‌ప‌క్షానికి తెలుసు. అందుకే ఆ పార్టీనుంచి ప‌దేప‌దే 175 స్థానాల‌కు పోటీచేస్తామ‌ని ప‌వ‌న్ చెప్ప‌గ‌ల‌రా అన్న ప్ర‌శ్న వ‌స్తోంది. ప‌వ‌న్‌కి క్రేజ్ ఉంది. ప్ర‌తీచోటా ఎంతోకొంత కేడ‌ర్ ఉంది. కానీ ఎన్నిక‌ల్లో నిల‌బ‌డి త‌ల‌ప‌డేందుకు అది స‌రిపోదు. అన్ని స్థానాల్లో స‌రైన అభ్య‌ర్థులు దొరుకుతార‌న్న న‌మ్మ‌కం కూడా లేదు. అందుకే పొత్తులున్నా లేక‌పోయినా క‌నీసం 30 సీట్ల‌న్నా గెలుచుకోవాల‌న్న‌ది జ‌న‌సేన టార్గెట్‌. నేల‌విడిచి సాముచేస్తే అస‌లుకే మోసం అన్న వాస్త‌విక‌త‌ను గుర్తించిన జ‌న‌సేన వ్యూహం మారుస్తోంది. జ‌నసేనకు గోదావరి జిల్లాలలో గ‌ట్టి ప‌ట్టుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల‌పై జ‌న‌సేన ఆశ‌లు పెట్టుకుంటోంది. అలాగే జ‌న‌సేన టార్గెటెడ్ జిల్లాల్లో విజయవాడ, గుంటూరు, కర్నూలు అనంతపురం జిల్లాలు ఉన్నాయి. నెల్లూరు, చిత్తూరువంటివి కూడా క‌లుపుకుంటే ఓ ఏడెనిమిది జిల్లాల‌పై ప్ర‌ధానంగా ఫోక‌స్ పెడితే త‌క్కువ‌లో త‌క్కువ పాతిక సీట్లు కొట్ట‌టం క‌ష్ట‌మేం కాద‌నుకుంటున్నారు ప‌వ‌న్‌కళ్యాణ్‌. అసెంబ్లీలో ఆ మాత్రం బ‌లంతో ఐదేళ్ల‌లో త‌మ ప్ర‌భావం చూప‌గ‌లిగితే 2029 టార్గెట్‌గా తాము అనుకున్న‌ది సాధించ‌వ‌చ్చ‌నే అభిప్రాయంతో జ‌న‌సేన ఉంది.

టీడీపీతో పొత్తు కుదిరితో క‌నీసం 40 సీట్లు డిమాండ్ చేయ‌డం ఖాయం. లేదూ విడిగా పోటీచేసినా 30 సీట్ల‌లో గెలుస్తామ‌న్న ధీమా గ్లాసు పార్టీ నేత‌ల్లో ఉంది. గతం కంటే ఓట్ల‌శాతం పెరుగుతుంద‌ని అందుకే ప‌వ‌న్‌కూడా 2029 టార్గెట్‌గానే ముందుకెళ్తున్నార‌ని జ‌న‌సైనికులు విశ్లేషిస్తున్నారు. మంచిదే. అతిగా బ‌లాన్ని ఊహించుకుని బొక్క‌బోర్లా ప‌డ‌టం కంటే మ‌న బ‌లాల‌తో బ‌ల‌హీన‌త‌ల‌ను కూడా తెలుసుకోవ‌డ‌మే విజ‌యం దిశ‌గా న‌డిపిస్తుంది. ఎంతైనా అన్న‌గారి అనుభ‌వం క‌ళ్లెదుట క‌నిపిస్తూనే ఉందిగా. కాస్త తిక్కుందంటున్నార‌ని గ‌బ్బ‌ర్‌సింగ్‌కి ఓ లెక్క ఉండ‌దా ఏంటీ!