తెలంగాణ కేబినెట్లో అంతర్యుద్ధం

By KTV Telugu On 24 December, 2022
image

టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనుకుంటోంది. మొన్ననే పార్టీ మొత్తం ఢిల్లీ వెళ్లి అక్కడ కార్యాలయాన్ని ప్రారంభించి వచ్చారు. బయట చూడటానికి ఇదో తిరునాళ్లలా కనిపించింది. అంతర్గతంగా మాత్రం అసంతృప్తి రగులుతోంది. చాలా మంది మంత్రులు తమకు పనిలేకుండా పోతోందని ఆవేదన చెందుతున్నారు. ఇతర మంత్రులు వచ్చి తమ శాఖల్లో తల దూర్చుతున్నారని ఆగ్రహం, ఆవేదన చెందుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్ అన్ని శాఖల వ్యవహారాల్లో తలదూర్చుతూ సమీక్షలు చేసే వారని చెబుతుంటారు. సంబంధిత మంత్రులకు సమాచారం ఇవ్వకుండానే అధికారులను పిలిచి మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన నిదానించారు. ఆ పని వేరే మంత్రులు మొదలు పెట్టారు.

తెలంగాణ కేబినెట్లో మంత్రి కేటీఆర్ నెంబర్ టూ అని చెప్పక తప్పదు. కొంత కాలం ఆయన కూడా కేసీఆర్ లాగే ఇతర మంత్రుల శాఖల్లో రివ్యూలు నిర్వహించారు. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ను ఆదర్శంగా తీసుకుని కొందరు మంత్రులు కూడా ఆటాడుకుంటున్నారు. చిన్న అవకాశం వస్తే చాలు ఇతర మంత్రుల శాఖల్లో దూరిపోతున్నారు. అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ మధ్య ఇలాంటి వార్ తారా స్తాయికి చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఫారెస్ట్​రేంజ్​ఆఫీసర్ శ్రీనివాసరావు హత్యపై ఒకరి మీద మరొకరు సీఎం దగ్గర ఫిర్యాదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తర్వాత మంత్రి సత్యవతి రాథోడ్‌కు సమాచారం ఇవ్వకుండానే ఫారెస్ట్​మినిస్టర్ ​పోడు భూములపై ఆఫీసర్లతో అంతర్గత సమీక్ష చేశారు. అయితే తనకు చెప్పకుండా సమావేశం ఎలా జరిగిదంటూ ఆమె ట్రైబల్ వెల్ఫేర్‌ అధికారులపై సీరియస్ అయ్యారు. మంత్రుల మధ్య ఆధిపత్య పోరులో తాము బలవుతున్నామని అధికారులు గగ్గోలు పెడుతున్నారు.

మంత్రి సబితా రెడ్డి విద్యా శాఖామంత్రి అయినప్పటికీ నిర్ణయాలన్నీ కేటీఆర్ తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఆ శాఖలో సీఎంఓ అధికారులదే పైచేయి అవుతోంది. మంత్రి సబితకు సంబంధం లేకుండానే ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి కనుసన్నల్లో సమీక్షలు జరుగుతుండడం ఆమెకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. విద్యాశాఖలోని కీలక నిర్ణయాలన్నీ సీఎం స్పెషల్​సెక్రటరీ, మంత్రి కేటీఆరే తీసుకుంటున్నారు. దీంతో తనకంటే ఇతరుల నిర్ణయాలే శాఖలో అమలవుతున్నాయని ఆమె విద్యాశాఖ సెక్రటరీతో వాపోయినట్లు తెలుస్తోంది. బాసర స్టూడెంట్స్‌ సమ్మె​విషయంలోనూ కేసీఆర్‌, కేటీఆర్​ దగ్గర తనను బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారని ఆమె సన్నిహితులతో చెప్పిన్నట్లు టాక్‌ నడుస్తోంది.

ఇక హైదరాబాద్‌లో చేపట్టే కార్యక్రమాల విషయంలో సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ ​వ్యవహారశైలిపైనా ఇతర మంత్రులు గుస్సా అవుతున్నారు. ఇటీవల క్రిస్టియన్ భవన్ శంకుస్థాపన కార్యక్రమం మంత్రులు తలసాని, కొప్పుల మధ్య చిచ్చుపెట్టింది. ఎస్సీ డెవలెప్‌మెంట్‌ శాఖ మంత్రిగా ఉన్న తనకు చెప్పకుండానే తలసాని క్రిస్టియన్ భవన్ శంకుస్థాపన చేసేందుకు వెళ్లడంపై కొప్పుల మండిపడ్డారు. హైదరాబాద్లో ఏ కార్యక్రమమైనా తలసాని చేతుల మీదుగానే జరగాలంటున్నారు. జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. జిల్లా మంత్రులకు చెప్పకుండానే మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నీ తానై దూరిపోతున్నారు. రోడ్లు, డబుల్ బెడ్ రూములు ఏవైనా సరే ఆయనే వచ్చేస్తున్నారు. దానితో అధికారులు తమను పట్టించకోవడం లేదని జిల్లా నేతలు వాపోతున్నారు. వీటన్నింటినీ ప్రగతి భవన్ దృష్టికి తీసుకెళ్దామంటే అప్పాయింట్ మెంట్ దొరకడం లేదని కొందరు మంత్రులు తమ అనుచరుల వద్ద చెప్పుకున్నారు. మరి ఈ అసంతృప్తి ఎటు దారి తీస్తుందో చూడాలి.