ఏ పార్టీలోనైనా భావస్వేచ్ఛ ఉండాలి. కష్టమోనష్టమో వస్తే అధినేతకు చెప్పుకునే పరిస్థితి ఉండాలి. దానికో సొల్యూషన్ చూపించాలి. అలాకాకుండా వన్‌సైడ్ ఆర్డర్‌లా ఉంటే ఆ ఉక్కబోతను తట్టుకుంటూ అలాగే ఉండిపోవడం కష్టమవుతుంది. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాటల్లో ఏపీలో సంక్షేమ ప్రభుత్వం నడుస్తోంది. గడపగడపకీ ఏదో ఒక లాభం చేకూరుతోంది. ఆయన చరిష్మా మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తుంది. 2019లో ముక్కూ మొహం తెలీనివాళ్లు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారు. కానీ ఎల్లకాలం ఇలాగే ఉంటుందా? కేవలం సంక్షేమమే మరోసారి వైసీపీని అధికారంలోకి తెస్తుందా. వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలను కూడా తొలిచేస్తున్న ప్రశ్న ఇది.
కొందరు అవమానాలను మౌనంగా భరిస్తారు. నాలుగ్గోడల మధ్యే బాధపడతారు. కానీ కొందరు చెప్పుకుంటే పోయేదేముందని అనుకుంటారు. వారిలో నెల్లూరుజిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కూడా ఒకరు. నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆవేదనను అసంతృప్తిగా భావిస్తే, ధిక్కారస్వరంగా చూస్తే వైసీపీ నాయకత్వం ఆలోచన పక్కదారి పడుతున్నట్లే భావించాలి. సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారపార్టీ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేసే పరిస్థితి ఎందుకొచ్చింది? అన్ని ప్రయత్నాలూ అయిపోయాయని ఇక ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి చెప్పటం ప్రభుత్వం తక్షణం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
ప్రభుత్వంలో పనులు కావడం లేదని ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యేనో ఆవేదన చెందితే అర్ధముంది. అధికారపార్టీ ఎమ్మెల్యేకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైతే క్షేత్రస్థాయిలో ఏంజరుగుతోందన్న చర్చ మొదలైంది. కోటంరెడ్డి ఎవరితోనో రహస్యంగా మాట్లాడలేదీ మాటలు. మంత్రి కాకాని గోవర్దన్‌రెడ్డి సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలోనే తన అనుభవాలను ఏకరువు పెట్టారు. ఆర్థికశాఖ కార్యదర్శి వ్యవహారశైలిని అందరి దృష్టికీ తెచ్చారు. సీఎం అనుమతి ఇచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని కోటంరెడ్డి గోడు వెళ్లబోసుకున్నారు. ఇది ఎమ్మెల్యేకు కాదు ప్రభుత్వానికే అవమానం.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి మంత్రి బొత్స సత్యనారాయణ 2021 డిసెంబర్‌లో హామీ ఇచ్చారు. 2022 డిసెంబరు గడిచిపోతున్నా పనులు మాత్రం అంగుళం కూడా కదల్లేదు. అంటే మధ్యలో ఎక్కడో కొర్రీ పడిందన్నమాట. ఎమ్మెల్యేలను పట్టించుకోవాల్సిన పన్లేదన్నట్లు ఉన్నతస్థాయి యంత్రాంగం ఉందన్నమాట. ఇదికేవలం కోటంరెడ్డి ఆవేదన మత్రమే కాదు రాష్ట్రంలో పదులసంఖ్యలో ఎమ్మెల్యేలకు ఇలాంటి అనుభవాలే ఉన్నాయంటున్నారు. కాస్త నోరున్న నలుగురైదుగురు పెద్ద నాయకులకు తప్ప పనులు జరగడం లేదు.
సీఎం సంతకం పెట్టిన జీవోలకు కూడా ఫైనాన్షియల్ అప్రూవల్ రావడం లేదంటే ప్రభుత్వానికే పరువుతక్కువ. ఎందుకు ఆగిందో ఎప్పుడు అవుతుందో కనీసం చెప్పగలగాలి. సీఎం సంతకం కూడా చెల్లడం లేదన్న అర్ధం ధ్వనించేలా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడాల్సి వచ్చిందంటే ప్రభుత్వ యంత్రాంగం పనితీరు మేడిపండులాగే ఉందని అర్ధంచేసుకోవాలి. కేవలం ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను నమ్ముకుని ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా లైట్ తీసుకుంటే కోరి కష్టాలు కొనితెచ్చుకోవడమే. ఎవరో ఎమ్మెల్యే ఏదో వాగాడాని తేలిగ్గా తీసుకుంటే ఇవాళ కోటంరెడ్డి రేపు ఇంకొంతమంది.