ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన టీడీపీ వర్గాల్లో కొత్త ఉత్సాహానికి కారణమైంది. చంద్రబాబు సరికొత్త వ్యూహాలతో వైజాగ్ మీదుగా విజయనగరంలోకి అడుగు పెట్టడంతో పార్టీ శ్రేణులు అమితానందంలో మునిగిపోతున్నాయి.. రోడ్ షోలకు జనం పోటెత్తడంతో ఇక జయం మనదేరా అన్న ఆలోచన పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. నిజానికి మూడు రాజధానులను వ్యతిరేకించి అమరావతి ఒక్కటే రాజధాని అని తెలుగుదేశం ఎప్పుడూ వాదిస్తూనే ఉంది. ఆ క్రమంలో విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నినాదాన్ని నెత్తికెత్తుకున్న వారు చంద్రబాబును తరిమి కొడతారని భావించిన వైసీపీ నేతలకు నిరాశే ఎదురైంది..
ఉత్తరాంధ్రలో బీసీలదే మెజార్టీ. ఏ పార్టీకైనా గెలుపోటములు నిర్ణయించేదీ బీసీలే. ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించిన తర్వాత బీసీలంతా ఆ పార్టీ ఓటు బ్యాంకుగా మారిపోయారు. నేటి వరకు ఆ పార్టీకి ఉత్తరాంధ్రా నీరాజనం పట్టింది. దీంతో పడి లేచే కడలి తరంగంలా ఎప్పటికప్పుడు పసుపు జెండా అస్థిత్వాన్ని చాటుకుంటూ వస్తోంది. అయితే 2019 ఎన్నికల్లో గత చరిత్రకు విరామం ఏర్పడింది. ఉత్తరాంధ్రలో వైసీపీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. నామమాత్రంగా కొన్ని నియోజకవర్గాలు మాత్రమే చేజారాయి. అక్కడ టీడీపీ ఘోరపరాజయం పాలైంది.
కంచుకోటలో ఖంగు తిన్న టీడీపీ గత మూడున్నరేళ్ల కాలంలో ఫ్యాక్ట్ చెక్ చేసుకుంది. తమ వైపు నుంచి జరిగిన తప్పిదాలను సమీక్షించుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టింది. దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకునేందుకు ప్రయత్నించింది. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఘోర తప్పిదాలు కూడా ఆ పార్టీకి కలిసొచ్చాయి. జనంలో క్రమంగా వైసీపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశాన్ని టీడీపీ సద్వినియోగం చేసుకుంటోంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్న వైసీపీ ప్రభుత్వంతో వస్తున్న నష్టాన్ని జనానికి వివరిస్తోంది గతంలో తాము చేసిన అభివృద్ధి మళ్లీ అవకాశం ఇస్తే చేపట్టబోయే కార్యక్రమాలను వివరిస్తూ సగటు ఓటర్లను ముఖ్యంగా బీసీలను తమ వైపుకు తిప్పుకుంటోంది.
చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ తరచూ ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తున్నారు. దీనితో తెలుగు తమ్ముళ్లలో కొత్త జోష్ కనిపిస్తోంది. తొలుత బాదుడే బాదుడు ఇప్పుడు ఇదేం ఖమ్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలతో జనంలో ఉంటూ వారితో మమేకమవుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటించారు. విశాఖ విమానాశ్రయంలోనే చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది. ఆయనకు నిరసనలతో స్వాగతం పలుకుతారని ఎదురు చూసిన వైసీపీ నేతలకు నిరాశ తప్పలేదు. ఇక రాజాం, బొబ్బిలి ఎక్కడ చూసినా జనం కిక్కిరిసి పోయారు. గంటల తరబడి వేచి ఉండి చంద్రబాబు స్పీచ్ విన్నారు. ఆయన ప్రతి మాటకు కేరింతలు కొట్టారు.
వైసీపీ హేమాహేమీల ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాల మీదుగా చంద్రబాబు యాత్ర సాగినప్పటికీ ఆయన్ను చూసేందుకు భారీగా జన సందోహం కనిపించింది. చంద్రబాబు అనుకూల నినాదాలు మారుమోగాయి. టీడీపీ గ్రూపులు కూడా ఒకటై చంద్రబాబు పర్యటనను సక్సెస్ చేశాయి. రాజాం నియోజకవర్గంలో ఆ పరిస్థితి కొట్టొచ్చినట్లు కనిపించింది. చంద్రబాబు వస్తున్నారని తెలిసిన రోజు నుండి మాజీ మంత్రి ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోండ్రు మురళి అనుభవాన్ని ప్రయోగించి సభ విజయవంతానికి కృషి చేశారు. అలాగే తానూ రేసులోనే ఉన్నానని ఇటీవలే అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ నిరూపించారు. అయితే ఇరువురి మధ్య పోటీ మాత్రం చంద్రబాబు పర్యటనకు బాగా ఉపయోగపడిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రాజన్న దొర, బొత్స కుటుంబం ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలు దగ్గర్లోనే ఉన్నప్పటికీ జనం వారిని పట్టించుకోకుండా చంద్రబాబు రోడ్ షోలకు తరలి వచ్చారు.
చంద్రబాబు తన ప్రసంగాల్లో సీఎం జగన్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనం ఆయన్నుబంగాళాఖాతంలో కలిపేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించేశారు. పెన్షన్లు ఆగిపోవడం దగ్గర నుంచి అభివృద్ధి ఎలా కుంటుపడిందో వివరించారు. మరో సారి జగన్ ను గెలిపించే పొరపాటు చేయవద్దని ఓటర్లకు హితబోధ చేశారు. జనం కూడా ప్రతీ మాటకు స్పందించారు. చంద్రబాబు అడిగిన ప్రతీ ప్రశ్నకు అవును మళ్లీ మీరే రావాలని సమాధానమిచ్చారు. మొత్తానికి చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన టీడీపీ వర్గాలకు ఊపిరినిచ్చింది. విశాఖ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కు జనం మద్దతిస్తున్నారన్న వైసీపీ వాదనపైనా అనుమానాలకు తావిచ్చింది.