రెండు రాష్ట్రాలు రెండుకళ్ల సెంటిమెంట్ పారలేదు. రాష్ట్ర విభజన అనివార్యం కావటంతో తెలంగాణపోయినా ఏపీనన్నా దక్కించుకుందామని తట్టాబుట్టా సర్దేశారు. విభజన తర్వాత తొలి ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత జగన్ దెబ్బకి బొక్కబోర్లా పడ్డారు. మళ్లీ సడెన్‌గా చంద్రబాబుకి తెలంగాణ గుర్తుకొచ్చింది. ఆ మధ్య తుమ్మల తేడాగా మాట్లాడటం టీడీపీ కార్యకర్తలతో మీటింగేయడం చూసినప్పుడే కొందరికి డౌట్‌కొట్టింది. సమ్‌థింగ్ జరగబోతోందన్న అనుమానాలకు తగ్గట్లే ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు టీడీపీ అధినేత. స్పీచ్ గురించి చెప్పుకోవడానికేముంది కొన్నేళ్లుగా ప్లేచేస్తున్న పాత రికార్డే. హైటెక్ సిటీ నుంచి రింగ్‌రోడ్డుదాకా అంతా తానే చేశానన్నారు.
ఓవరాల్‌గా బాబుగారి స్పీచ్ చూశాక జనానికి క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో సైకిల్‌పార్టీ అన్నీ కాకపోయినా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం సహా కొన్ని జిల్లాల్లో పోటీచేయబోతోంది. ఖమ్మం మీటింగ్‌లో చంద్రబాబు స్పీచ్‌లో హైలైట్ చేయదగ్గ పాయింటేదన్నా ఉంటే అది విభజన జరిగిపోయిందని ఒప్పుకోవడమే. మళ్లీ రెండు రాష్ట్రాలు కలవాలనే వితండవాదమేమీ చేయకుండా అది జరిగేపని కాదని చెప్పేశారాయన. ఆల్రెడీ వైఎస్ షర్మిల వైఎస్సార్‌టీపీ పార్టీతో ఓ రేంజ్‌లో హడావుడిచేస్తున్నారు. ఖమ్మంజిల్లా పాలేరునుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఆంధ్రాకు పొరుగునున్న ఖమ్మం నుంచే రీ ఎంట్రీకి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన గులాబీపార్టీ ఆయన్ని ఇరకాటంలో పడేసే పాయింట్‌ని తెరపైకి తెచ్చింది.
ఆంధ్రాపార్టీ అనో, తెలంగాణద్రోహి అనో సెంటిమెంట్ రాజేసే పరిస్థితి ఇప్పుడులేదు. అందుకే ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి సీనియర్ నేతలు కొత్త వాదన లేవనెత్తారు. జూనియర్ ఎన్టీఆర్‌కి టీడీపీ బాధ్యతలు అప్పగించాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేయడం ఊహకందని పరిణామం. ఎన్టీఆర్ మీద గౌరవం ఉంటే టీడీపీ మీద నిజంగానే ప్రేముంటే ఆయన మనవడికే పార్టీ పగ్గాలు ఇవ్వాలన్న డిమాండ్‌తో చంద్రబాబుని డిఫెన్స్‌లోపడేసింది బీఆర్‌ఎస్. ఖమ్మం సభలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించాయి. తారక్‌కి అనుకూలంగా నినాదాలు వినిపించాయి. గతంలో ఏపీలోనూ ఇదే జరిగింది. అయితే ఫ్యాన్స్ అడగడం వేరు. ఆ మాట బీఆర్‌ఎస్ నేతల నోటి వెంట రావడం వ్యూహాత్మకమే.
జూనియర్ ఎన్టీఆర్ పాయింట్‌లో చంద్రబాబు బీఆర్‌ఎస్ వాదనని ఖండించలేరు. అలాగని ఆహ్వానించలేరు. కొడుకుకో, కోడలికో తెలంగాణ బాధ్యతలు అప్పగించాలనేది ఆయన ఆలోచన అంటున్నారు. బాలయ్య బావమరిది కాబట్టి, కొడుక్కి పిల్లనిచ్చిన వియ్యంకుడు కాబట్టి ఆమాత్రం చొరవ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కి పెత్తనం ఇవ్వడానికి ఆయనెందుకు ఒప్పుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన వారసుడు తేలిపోతాడు. అయితే ఇప్పటిదాకా పార్టీవీడిన కొందరు నేతలు హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అప్పుడప్పుడూ చేస్తున్న డిమాండ్ ఇప్పుడు బీఆర్‌ఎస్‌నుంచి వస్తుందని చంద్రబాబు ఊహించలేదు. చంద్రబాబు తెలంగాణలో మళ్లీ హడావుడి చేయకుండా ఇక బీఆర్‌ఎస్ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ఇదేనేమో!