కృష్ణ జన్మభూమిపై మధుర కోర్టు కీలక నిర్ణయం

By KTV Telugu On 24 December, 2022
image

హిందువులు అత్యంత భక్తిభావంతో పూజించే శ్రీకృష్ణుడి జన్మస్థానంపై కొనసాగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉన్న షాహీ ఈద్గా వివాదాస్పద స్థలంపై సర్వే చేయాలని మధుర కోర్టు ఆదేశించింది. శ్రీకృష్ణుడి జన్మస్థలం ఉన్న ప్రదేశంలో 17వ శతాబ్దంలో మసీదును నిర్మించారని కోర్టులో హిందూసంస్థలు పిటిషన్ దాఖలు చేశారు.
హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త, ఉపాధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ డిసెంబరు 8న కోర్టులో వాదనలు వినిపించారు.

శ్రీకృష్ణుని జన్మస్థానానికి చెందిన భూమిలో 13.37 ఎకరాల స్థలంలో ఉన్న దేవాలయాన్ని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కూలగొట్టాడని దానిపై ఈద్గాను నిర్మించాడని తెలిపారు. శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్, షాహీ మసీదు ఈద్గా 1968లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా ఈ పిటిషన్ సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. షాహి ఈద్గా మసీదుకు సంబంధించిన వివాదాస్పదన స్థలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు జనవరి 2 తర్వాత సర్వేను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. సర్వే నివేదికను జనవరి 20 తర్వాత సమర్పించాలని పేర్కొంది. ఇటీవల జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల తరహాలోనే మధుర కోర్టు ఆదేశాలు ఉండడం విశేషం.