ముగ్గురు ఎమ్మెల్యేలు – నలుగురు సీఎం అభ్యర్థులు

By KTV Telugu On 25 December, 2022
image

 

తెలంగాణ బీజేపీలో విచిత్ర పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీకి జనంలో ఆదరణ పెరిగిందని తెలిసినప్పటి నుంచి నేతలకు ఆశలు పెరిగాయి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లుగా పెద్ద పోస్టుకే గాలం వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేసుకుంటూ సీఎం అభ్యర్థులు తయారవుతున్నారు. కమలం పార్టీలో ఎమ్మెల్యేల కంటే సీఎం అభ్యర్థులే ఎక్కువ ఉన్నారన్న టాక్ నడుస్తోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గెలవాల్సిన హేమాహేమీలు ఓడిపోయారు. పరాజయం పాలైన వారిలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. కేవలం గోషామహల్ నుంచి రాజా సింగ్ గెలిచారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలవడంతో పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య మూడుకు పెరిగింది. ఇక లోక్ సభ ఎన్నికలు వచ్చే నాటికి ఎంపీలుగా నలుగురు గెలిచారు. అందులో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయితే బండి సంజయ్ టీ బీజేపీ అధ్యక్షుడయ్యారు. గత ఏడాదిన్నరగా తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తూ జనంలో ఉంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఒంటి కాలి మీద లేస్తున్నారు. అధికారానికి రాగానే కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించడం ఖాయమని సవాలు చేస్తున్నారు.

తెలంగాణ బీజేపీకి బలం పెరుగుతుందన్న విశ్వాసం కలగడంతో నేతల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఈ సారి అసెంబ్లీకే పోటీ చేయాలనుకుంటున్నారు. తాము లోక్ సభకు పోటీ చేయదలచుకోలేదని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సారి పార్టీ గెలిస్తే తనకు సీఎంగా అవకాశం వస్తుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారట. చిన్నప్పటి నుంచి మోదీతో ఉన్న సాన్నిహిత్యం తనకు ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి ఆలోచనా విధానంగా తెలుస్తోంది. పైగా కేంద్రమంత్రిగా ఆయన బాగానే పనిచేస్తున్నారు. టీ. బీజేపీ అధ్యక్షుడిగా తనకే అవకాశం రావచ్చని బండి సంజయ్ ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్న తీరుపై మోదీ, అమిత్ షా, నడ్డా కూడా సంతృప్తి చెందడంతో పాటు తెలంగాణ టూర్ కు వచ్చినప్పుడల్లా భూజం తట్టడం తనను సీఎం అభ్యర్థిగా ప్రోత్సహించడమేనని సంజయ్ వాదన.

టీఆర్ఎస్ లో మంత్రిగా చేసి కేసీఆర్ కుటుంబంతో పొసగక బయటకు వచ్చిన ఈటల రాజేందర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన కూడా అధిష్టానానికి బాగా దగ్గరయ్యారు. వస్తే ముఖ్యమంత్రి పదవి తనకే రావాలని ఈటల అనుకుంటున్నారట. తాను చేరిన తర్వాతే తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు వచ్చిందని ఈటల చెప్పుకుంటున్నారు. మరో పక్క మహిళల కోటాలో సీఎం పదవి తనకే వస్తుందని డీకే అరుణ ఎదురు చూస్తున్నారు. ఒక పాపులర్ టీవీ ప్రోగ్రాంలో కూడా తానే సీఎం అభ్యర్థినంటూ ఆమె బహిరంగంగా చెప్పుకున్నారు. పైగా అందులో తప్పేముందని ఆమె ప్రశ్నిస్తున్నారు. డీకే అరుణ ఇప్పుడు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసే వారిలో ఆమె కూడా ముందు వరుసలో ఉంటారు. మొత్తానికి గెలిచే మాట ఎలా ఉన్నా..తెలంగాణ కమలనాథుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు మాత్రం పెరిగిపోయారు….