చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా బంగ్లాదేశ్‌పై టీమిండియా రెండో టెస్టులో నెగ్గింది. అతికష్టం మీద పోరాడి విజయం సాధించింది. 2-0తో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది. అయితే పేరుకు సిరీస్ గెలిచిందనే గానీ మన ఆటగాళ్ల ప్రదర్శన ఎంతమాత్రం బాగోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన టీమిండియా రెండోటెస్టులో మాత్రం దారుణ ఆటతీరు కనబరిచింది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తున్నప్పటికి చిన్నజట్టైన బంగ్లాదేశ్ చేతిలో దాదాపు ఓడినంత పనయింది. స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ను బంగ్లా స్పిన్నర్లు హడలెత్తించారు. అశ్విన్, శ్రేయాస్ అయ్యర్లు నిలదొక్కుకోకుంటే టీమిండియా కచ్చితంగా బంగ్లా చేతిలో ఓటమి పాలయ్యేది. 74 పరుగులకే ఏడు వికెట్ల కోల్పోయిన దశలో అయ్యర్, అశ్విన్‌లు గట్టెక్కించారు. ఎనిమిదో వికెట్‌కు 71 పరుగులు జోడించి భారత్‌కు విజయం అందించారు.
రోహిత్ శర్మ గైర్హాజరీలో బాధ్యతలు చేపట్టిన రాహుల్ జట్టును ముందుండి నడిపించాడు. బ్యాటింగ్, బౌలింగ్ వనరులను ఎప్పటికప్పుడు ఉపయోగించుకొంటూ సిరీస్‌ను సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టులు కలిపి కేఎల్ రాహుల్ చేసిన పరుగులు 57 మాత్రమే. గత టీ20 ప్రపంచకప్‌లోనూ పెద్దగా ఆడిందేమీ లేదు. అయినా సరే జట్టులో మాత్రం సుస్థిర స్థానం సంపాదిస్తున్నాడు. ఇంకెన్నాళ్లు ఇలా అవకాశాలు ఇస్తారని అభిమానులు నెట్టింట్లో తెగ ట్రోలింగ్ చేసేస్తున్నారు. విరాట్ కోహ్లీ కూడా తన మునుపటి ఫామ్‌ను కోల్పోయాడా అన్నట్లుగా ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడని సంతోషపడేలోపే బంగ్లాతో టెస్టుల సిరీస్‌లో విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్‌లు కలిపి 35 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన ఛెతేశ్వర్ పుజారా, శుబ్‌మన్ గిల్ రెండో టెస్టులో నిరాశపర్చారు. పంత్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆకట్టుకున్నప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేశాడు. తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన పుజారా ఓవరాల్‌గా 222 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
ఇలాంటి ప్రదర్శనతో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలవడం కష్టమంటున్నారు అభిమానులు. బంగ్లాదేశ్పైనే ఇలా ఆడితే తర్వాతి సిరీస్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఆటతీరు ఏవిధంగా ఉంటుందో ముందే పిక్చర్ వేసుకుంటున్నారు. భారత క్రికెట్ జట్టులో ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఫామ్‌లో లేని వారిని పక్కనబెట్టాల్సిందేనని తేల్చిచెబుతున్నారు. ప్రయోగాలు ఆపి జట్టును పటిష్ఠంగా తయారు చేయడంపై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ దృష్టిసారించాలని సూచిస్తున్నారు. మరో ప్లేయర్‌ను జట్టులోకి తీసుకొచ్చేందుకు ఉత్తమంగా ఆడే ఆటగాళ్లను బెంచ్‌కు పరిమితం చేయడం సరైంది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. దీనికి ఉదాహరణగా తొలి టెస్టులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన కుల్దీప్కు రెండో మ్యాచ్‌లో స్థానం లేకపోవడాన్ని పలువురు మాజీలు ప్రశ్నించిన విషయం తెలిసిందే.