ఒరిజనల్ వర్సెస్ వలస నేతలు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొన్నాళ్లుగా ఇదే లొల్లి. ఇన్నాళ్లూ కాస్త బ్యాలెన్స్‌గా ఉన్న భట్టి విక్రమార్క, మధుయాష్కీలాంటి నేతలు కూడా చివరికి బరస్ట్ అయ్యారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాంగ్రెస్‌కి అలవాటేగా. చిరిగి చేటయ్యాక సీన్లోకొచ్చారు ట్రబుల్ షూటర్ దిగ్విజయ్‌సింగ్. ఆయనొచ్చాక కూడా లీడర్లు గల్లాలు పట్టుకున్నప్పుడే అర్ధమైంది జబ్బు బాగా ముదిరిపోయిందని. చివరికి ఏఐసీసీ అబ్జర్వర్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. టూ లేట్ అని తేల్చేశారు దిగ్విజయ్‌సింగ్ కూడా.
జబ్బు ముదిరిందని మార్చురీలో పడేయలేరుగా. వెంటిలేటర్ ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయాలని సూచిస్తున్నారు ఏఐసీసీ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్. టీకాంగ్రెస్ నేతల వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు తన అనుభవంతో కొన్ని ప్రతిపాదనలు చేయడానికి రెడీ అయ్యారు. రేవంత్‌రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగించినప్పటినుంచీ సీనియర్ల ప్రతిఘటన మొదలైంది. ఎన్నికలముందు టీపీసీసీ బాధ్యతలు మార్చే అవకాశమేలేదు. దీంతో రాజీ ప్రతిపాదనతోనే ఉండబోతోంది డిగ్గీరాజా ట్రీట్మెంట్.
ఏడాదిన్నర కాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరిదారివారిదే. నేతల మధ్య అనైక్యతతో పార్టీకి ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిందని దిగ్విజయ్‌సింగ్ గుర్తించారు. దీంతో పార్టీలోని కొందరు నేతలు భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారని అంచనాకొచ్చారు. తక్షణం రంగంలోకి దిగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు దిగ్విజయ్. డిగ్గీరాజా ప్రిస్క్రిప్షన్ ప్రకారం పార్టీ రాష్ట్ర ఇంచార్జిని మార్చే అవకాశాలున్నాయి. మాణిక్కంఠాగూర్ స్థానంలో మరో సీనియర్‌కి బాధ్యతలు అప్పగించడమే మేలంటున్నారు దిగ్విజయ్. దీంతో త్వరలోనే మాణిక్కం స్థానంలో మరో నేత తెరపైకొచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఎన్నికలకు ఎంతో సమయం లేదు. వెంటనే నేతల మధ్య అంతరాలు పూడ్చాలి. పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సిద్ధంచేయాలి. ఇప్పటికే తానే ప్రత్యామ్నాయమని బీజేపీ బలపడే ప్రయత్నాల్లో ఉంది. టీకాంగ్రెస్‌లో విభేదాలు ఇలాగే కొనసాగితే అది బీజేపీకి లాభిస్తుందని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. సీనియర్ల అసంతృప్తిని తక్షణం చల్లారిస్తేనే సమస్యకో పరిష్కారం దొరుకుతుందనే భావనతో ఉంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై ఏఐసీసీ స్థాయిలో సమన్వయం కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించాలని లేదంటే ఏఐసీసీ ముఖ్యులకు ఈ బాధ్యతని అప్పగించాలని దిగ్విజయ్ సూచిస్తున్నారు. జబ్బు ఇంత ముదిరాక డిగ్గీ డాక్టర్ ట్రీట్మెంట్ టీకాంగ్రెస్‌ని లేచి కూచోబెడుతుందా అంటే అప్పుడే చెప్పలేం.