ఉత్తరాదిలో కమలవికాసం జరిగింది. ఈశాన్యరాష్ట్రాల్లోనూ కాషాయపార్టీ బలం పుంజుకుంటోంది. కానీ దక్షిణాదిలో పాగా వేయాలన్న లక్ష్యం మాత్రం ఎప్పటికప్పుడు ఊరించి ఉసూరుమనిపిస్తోంది. సౌత్‌లో బీజేపీకి పట్టుంది ఒక్క కర్నాటకలోనే. ప్రస్తుతం కమలం పార్టీనే అక్కడ అధికారంలో ఉంది. ఇప్పుడక్కడ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అయితే గుజరాత్ రాష్ట్రంలా కర్నాటకలో మళ్లీ గెలుపుపై బీజేపీ ధీమాగా లేదు. సమీకరణాలు మారిపోతున్నాయి. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి.
గుజరాత్‌లో ఏడోసారి కూడా తిరుగులేని మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కానీ కర్నాటకలో పరిస్థితులు వేరు. కన్నడిగులు ఏకపక్షంగా కమలంపార్టీ వైపు ఎప్పుడూ లేరు. పోయిన ఎన్నికల్లో కూడా బీజేపీ ఆధిక్యం సాధించి అధికారంలోకి రాలేదు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవటంతో జేడీఎస్-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. దీంతో తెరవెనుక ఫిరాయింపుల్ని ప్రోత్సహించి హంగ్ ప్రభుత్వాన్ని గద్దెదించి బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మొదట యడ్యూరప్పని సీఎంని చేసి తర్వాత బస్వరాజబొమ్మైని తెరపైకి తెచ్చింది.
ఇద్దరు సీఎంలు మారినా కర్నాటకలో కమలంపార్టీ బలమైన ముద్రనైతే వేయలేకపోయింది. ఓరకంగా చెప్పాలంటే కన్నడనాట ఆ పార్టీ పెనంమీంచి పొయ్యిలో పడింది. యడ్యూరప్ప ఉన్నప్పుడే పరిస్థితి గుడ్డిలో మెల్లలా ఉండేది. బొమ్మై అధికారంలోకి వచ్చినప్పటినుంచి హిందుత్వ విధానాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేంత చరిష్మా బొమ్మైకి లేదు. ఎన్నికలముందు ఆయన్ని మార్చే పరిస్థితి లేదు. రిస్క్ తీసుకుందామనుకున్నా కాస్త ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడెవరూ కనిపించడంలేదు. బొమ్మై ఒంటిచేత్తో ఎన్నికలబాధ్యతని నెత్తినేసుకునే సీన్ లేదు. యడ్యూరప్ప ఇంకా అలకపాన్పు దిగలేదు.
కర్నాటకలో బీజేపీ బలంపై పార్టీ నేతలకే నమ్మకం దూరమవుతోంది. గాలి జనార్దన్‌రెడ్డి కొత్త పార్టీ దీనికి సంకేతం. కమలంపార్టీని నమ్ముకునేకంటే సొంత బలంతో పోటీచేయడమే మంచిదన్న ఆలోచనతో ఉన్నారు గాలిబ్రదర్స్, వారి అనుచరుడు శ్రీరాములు. దీంతో దక్షిణాన మిగిలిన రాష్ట్రాల్లో కూడా బలపడాలనుకుంటున్న బీజేపీకి కర్నాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద సవాలుగా ఉంది. మరోవైపు ఈ నాలుగేళ్లలో కర్నాటకలో కాంగ్రెస్ బలపడింది. రాహుల్ జోడోయాత్ర కూడా ఆ పార్టీలో జోష్ నింపింది. అదే సమయంలో జేడీఎస్ కూడా బలంగానే ఉంది. కాస్త అటూఇటయినా మళ్లీ రెండుపార్టీలు మళ్లీ కలిసే అవకాశం కూడా ఉంటుంది. చూస్తుంటే కర్నాటకలో కమలానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది.