రైతుల్ని నమ్మించడమే అసలు టాస్క్ – “డిక్లరేషన్”పై కాంగ్రెస్ ఆపరేషన్ వర్కవుట్ అవుతుందా ?

By KTV Telugu On 22 May, 2022
image

తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు ప్రజలు పట్టం కడతారని రెండు విడతలుగా పెద్దగా ప్రయత్నాలు చేయకుండా అదృష్టాన్ని నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి తత్వం బోధపడింది. అందుకే ఇప్పుడు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తోంది.  రైతు డిక్లరేషన్ ద్వారా ముందుగా రైతు వర్గాలను ఆకట్టుకునేందుకు హస్తం నేతలు ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాటిని తీసుకుని రచ్చబండల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. రైతులకు వివరించి.. మద్దతు కూడగట్టుకోవాలనుకుంటున్నారు.

రైతులను ఆకర్షించేలా డిక్లరేషన్‌లో హామీలు !

రైతులకు ఏక కాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ,  రైతులు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. పదిహేను వేల పెట్టుబడి సాయం –  ఉపాధి హామీలో నమోదు చేసుకున్న ప్రతి రైతు కూలీకి ఏటా రూ. పన్నెండు వేల ఆర్థిక సాయం,   గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు, ధరణి పోర్టర్ రద్దు, రైతు కమిషన్ ఏర్పాటు,  మూతపడిన చెరుకు ఫ్యాక్టరీల రీ ఓపెనింగ్ తో పాటు అన్నిరకాల పంటలకూ మద్దతు ధరలు పెంచుతామని ప్రకటించారు. ఇవన్నీ రైతుల్ని ఆకర్షించేవే. కానీ అంత మాత్రాన నమ్మేస్తారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే రాజకీయ నేతలు ఎన్నో చెబుతారు. కానీ చేయరు. అనాదిగా జరుగుతుంది ఇదే. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందంటే వారు గుడ్డిగా నమ్మేయలేరు. కానీ అలాగని తీసి పరేసే పరిస్థితి లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు రైతుల్ని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

రచ్చబండల ద్వారా రైతుల్లో డిక్లరేషన్‌పై చర్చ !

వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించిన డిక్లరేషన్ కేవలం కాగితం కాదని.. అది రైతులకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తున్న గ్యారంటీ కార్డు అని రాహుల్ గాంధీ కూడా ప్రకటించి నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. మరోసారి డిక్లరేషన్ చదవండీ… రైతులందరితో చదివించండి.. ప్రతి అంశంపై చర్చించండి.. కాంగ్రెస్‌ గ్యారెంటీ అని ఇంటింటికీ తిరిగి చెప్పండి అని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఓ వైపు రాహుల్ మాటలు.. మరో వైపు రైతుల్లో సానుకూలత ఉందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. ఈ నెల 21 నుంచి నెల రోజులపాటు ‘పల్లె పల్లెకు కాంగ్రెస్‌’పేరుతో ఈ డిక్లరేషన్‌ గురించి ప్రజలకు వివరించేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు ఆల్రడీ రూట్‌మ్యాప్‌లు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్‌ నాయకులు, ఆయా గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయరంగ వ్యతిరేక విధానాలను వెల్లడించనున్నారు. గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించవచ్చని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది.

రైతులు నమ్మితే జాక్ పాట్.. లేకపోతే కష్టం!

కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ఫలించి రైతులు నమ్మితే ఆ పార్టీకి జాక్ పాట్ తగులుతుంది. ఓట్లు గుంపగుత్తగా వస్తాయి. కానీ రైతులకు ఇచ్చిన హామీల్ని ఎలా అమలు చేస్తారో వివరించాల్సి ఉంటుంది. రూ. రెండు లక్షల రుణమాఫీ అంటే.. అంత తేలిక కాదు. టీఆర్ఎస్ సర్కార్ రూ. లక్ష రుణమాఫీ చేయలేకపోయింది. తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో రుణమాఫీ అంటే సాధ్యమయ్యే పని కాదు. ఆర్థిక వెసులుబాటు ఎక్కడ నుంచి వస్తుందో కాంగ్రెస్ చెప్పాల్సి ఉంది. అలాగే ఇతర హామీలు కూడా. ధరణి పోర్టల్‌ను రద్దు చేయవచ్చు.. కానీ దాని వల్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? పంటలకు మద్దతు ధర అనేది కేంద్ర విధాన నిర్ణయం. రాష్ట్రం సొంతంగా అమలు చేయాలంటే దానికి తగ్గ వ్యవస్థ ఉందా?.. ఇలాంటి వాటిపై ఎన్నో సందేహాలను రైతులకు తీర్చాల్సిఉంటుంది. అవేమీ లేకుండా ఉత్తినే కాంగ్రెస్ గెలిస్తే అవి జరుగుతాయని చెబితే రైతులు నమ్మడం కష్టమే.