Kapu Politics In Ap
. ఎన్నికలకు ముందు ఆ సామాజిక వర్గాన్ని మచ్చికచేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. కాపుల శక్తి వంగవీటి మోహన రంగాను ఓన్ చేసుకునేందుకు ఎత్తుగడ వేస్తున్నాయి. రంగా వర్థంతి వేళ వైసీపీ, టీడీపీ, జనసేనలు ఓ రేంజ్లో హడావుడి చేశాయి. రాధా టీడీపీలో ఉన్నందున కాపు సామాజికవర్గం తమవెంటే ఉంటుందని ఆ పార్టీ భావిస్తుంటే ఇక వైసీపీ సైతం రాధాను దగ్గరకు తీస్తూ ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కాపుల పార్టీగా చెప్పుకుననే జనసేన ఆ సామాజికవర్గం ఈసారి తమ వెంటే ఉంటుందని విశ్వసిస్తోంది. ఏపీలో కాపులు ఓటు బ్యాంక్ బలంగా వుంది. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వారి మద్దతు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో కాపులు ఆరాధ్య దైవంగా భావించే వంగవీటి రంగా వర్ధంతి సభను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాయి.
విశాఖలో జరిగిన కాపునాడులో రాధా – రంగా అసోసియేషన్ కాపులు పాలకులు కావాలనే నినాదం తెరపైకి తీసుకొచ్చింది. వారు ముందుండి నడిస్తే సర్వసైన్యాధ్యక్షులుగా వెనకాల నడుస్తామని చెప్పుకొచ్చారు. అడ్డంకులు సృష్టించే నాయకులను బంగాళాఖాతంలో కలిపేస్తామంటూ శపథం చేశారు. విశాఖలోని కాపునాడుకు దూరంగా ఉన్న వైసీపీ విజయవాడలో నిర్వహించిన రంగా వర్థంతి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం విశేషం. విశాఖలో జరిగిన కార్యక్రమం వెనుక మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు జనసేన నాయకులు ఉన్నారనే ఉద్దేశంతోనే వైసీపీ చివరి నిమిషంలో తప్పుకున్నట్లు తెలుస్తోంది. వారు పక్కాగా జనసేనాని ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారనే సంకేతాలతో వైసీపీ తమ కాపు నేతలను దూరంగా ఉండాలని ఆదేశించింది. అయితే పవన్ పేరెత్తితే చంపుతామని వైసీపీలోని కొందరు తమను బెదిరించారంటూ కాపు నేతలు సమావేశంలో ప్రస్తావించడం కలకలం రేపింది. విజయవాడలో జరిగిన రంగా వర్థంతి కార్యక్రమానికి వైసీపీ కమ్మ నేతలు హాజరయ్యారని మరి కాపు నేతలు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. ఓట్ల కోసమే కాపులు కావాలా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే కాపు రిజర్వేషన్ల గురించి పార్లమెంటులో ప్రస్తావించిన జీవీఎల్‌ను కాపునాడు సన్మానించింది.
ఇక రాజకీయంగా పవన్‌పై దూకుడుగా వెళ్లే వైసీపీ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో జనసేనేనానిపై విమర్శలను తగ్గించుకుంటోంది. టీడీపీ టార్గెట్‌గా చెలరేగిపోతున్నారు ఆ పార్టీ నేతలు. వైసీపీ టీడీపీ ఇద్దరూ ఇప్పుడు కాపు నేత వంగవీటి రంగాను స్మరించుకుంటున్నారు. ఆయన కుమారుడు రాధా ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కేంద్రం క్లారిటీతో కాపు రిజర్వేషన్ల అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈనేపథ్యంలో పవన్ జోలికి వెళ్లొద్దనే నిర్ణయానికి వైసీపీ వచ్చినట్లు తెలుస్తోంది. కాపు నాడు భేటీ, రంగా వర్ధంతి నేపథ్యంలో అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పవన్ పై నిత్యం ఏదో ఒక విషయంలో విమర్శలకు దిగే పేర్నినాని, కొడాలి, అమర్నాథ్ వంటి నేతలు కూడా కొంతకాలంగా సైలెంట్ అయ్యారు. మధ్యలో వారాహి వాహనంపై విమర్శలు చేసినా త్వరగానే వాటి నుంచి వెనక్కితగ్గారు. జగన్ కు వ్యతిరేకంగా పవన్ చేస్తున్న రాజకీయంతో సహజంగానే కాపులు సీఎం పదవి డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ నేతలు కాపులకు ఆశాదీపంగా కనిపిస్తున్న పవన్ పై విమర్శలకు దిగితే ఆ ప్రభావం కచ్చితంగా అధికార పార్టీపై పడటం ఖాయం. అందుకే వైసీపీ వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం జగన్ కు రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ వేదికగా కాపు రిజర్వేషన్ల అంశంపై కేంద్రం ఇచ్చిన స్పష్టతను ముద్రగడ తన లేఖలో ప్రస్తావించారు. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ పై ఇచ్చిన తీర్పును గుర్తు చేసారు. 2019 ఎన్నికల్లో కాపు జాతి వైసీపీ గెలుపుకు కృషి చేశారని తమ జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి వారి ఆదరాభిమానాన్ని చాటుకోవాలని ముద్రగడ సూచించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్లను ప్రజలు దేవుళ్ళులా భావించారన్నారు. పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించబడడానికి పునాదులు వేసుకోవాలని ముద్రగడ సూచించారు. తన జాతి కోసం తపన తప్ప సీఎంను ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు లేదని ముద్రగడ లేఖలో వివరించారు. ఇప్పటికే మాజీమంత్రి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య కాపులకు ఆమోదయోగ్యమైన ఉత్తర్వులను ఈ నెలాఖరులోగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లేఖ రాశాడు. లేకుంటే నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. దీంతో ఇప్పుడు సీఎం జగన్ ఈ వరుస లేఖల నేపథ్యంలో కాపు రిజర్వేషన్ల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
మొత్తంగా చూస్తే ఎన్నికలకు ముందు కాపులంతా ఏకమవుతామని చెబుతున్నప్పటికీ వారిలో చీలికలు కనిపిస్తున్నాయి. వారు రాజకీయ పార్టీల ట్రాప్‌లో పడుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కొందరు వైసీపీ జపం చేస్తుంటే మరికొందరు టీడీపీ, ఇంకొందరు జనసేన తరపున వకల్తా పుచ్చుకుంటున్నారు. హరిరామజోగయ్య పవన్‌వైపు ఉంటే ముద్రగడ జగన్‌వైపు నిలుస్తున్నారనే టాక్ ఉంది. ఇక రాధా టీడీపీలో ఉన్నప్పటికీ ఆయన వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. రంగా ఆశయ సాధనే తన లక్ష్యమంటున్న రాధా రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకం కానుండడంతో రాధాను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను కొడాలి, వంశీల ద్వారా వైసీపీ చేస్తోంది. అటు టీడీపీ కూడా రాధా చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఉంది. మధ్యలో జనసేన సైతం రాధాను పార్టీలోకి తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.