ఏపీలో టీడీపీ, జనసేనల పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు పార్టీల అధినేతలు కిం కర్తవ్యం వహిస్తున్నారు. 2024లో కలిసి వెళ్లే విషయంలో సంకేతాలు ఇవ్వడం మినహా స్ట్రెయిట్ పాయింట్‌కు రావడం లేదు. కానీ వైసీపీ రెబల్ ఎంపీ మాత్రం ఆ రెండు పార్టీల తరపున వకల్తా పుచ్చుకున్నారు. కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలతో పాటే తాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్లేస్ ఏదైనా టీడీపీ జనసేనలతో కలిసే పోటీ చేస్తానంటున్నారు రఘురామకృష్ణం రాజు. అందులో ఎలాంటి సందేహం లేదంటున్నారు. సొంత పార్టీపై వెటకారం, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నిత్యనూతనంగా మరింతగా వెలుగొందుతున్నారు నరసాపురం ఎంపీ. నిత్యం వైసీపీపై విమర్శలు గుప్పిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన్ను వైసీపీ టార్గెట్ చేసిందో లేక వైసీపీనే ఆయన టార్గెట్ చేశారో గానీ ఇద్దరి మధ్య రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది.
ప్రస్తుతం రఘురామకృష్ణంరాజు వైసీపీ నేతల మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. వైఎస్ జగన్, వైసీపీపై రఘురామ చేసిన విమర్శలను అధికారపార్టీ నేతలు తిప్పి కొడుతున్నారు. రానురాను ప్రజలు అసహ్యించుకునేలా వ్యవహరిస్తోన్నారంటూ రాజుపై ఎదురుదాడికి దిగారు మేకతోటి సుచరిత. రఘురామ ఎంత దిగజారి మాట్లాడుతున్నారో ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా అంతే దిగజారిపోతోందని మంత్రి వనిత అన్నారు. అయోధ్యరామిరెడ్డి సహా మరికొందరు వైసీపీ నేతలు రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల మూకుమ్మడి ట్విట్టర్ దాడిపై స్పందిస్తూ తనను ఎంతలా రెచ్చగొట్టాలని చూసిన తాను రెచ్చిపోయేది లేదన్నారు రఘురామ. 150 మంది ఎమ్మెల్యేలు తనపై ట్విట్టర్ వార్‌కు వచ్చినా తనకొచ్చిన నష్టం గాని ఇబ్బంది గాని ఏమీ లేదంటున్నారు. తన పబ్లిసిటీ ద్వారానైనా ట్విట్టర్లో వారికి మరో వెయ్యి మంది ఫాలోవర్స్ పెరగాలని కోరుకుంటున్నానంటూ రఘురామకృష్ణంరాజు సెటైర్లు వేశారు. భవిష్యత్ ముఖచిత్రం పెద్దలకు స్పష్టంగా కనిపిస్తోందని అందుకే తనపై ఇంత మంది చేత ట్విట్టర్ వేదికగా దాడి చేయిస్తున్నారని అన్నారు ఎంపీ.
గత ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు ఆ తర్వాత కొంతకాలానికే పార్టీపై తిరుగుబాటు చేశారు. నిత్యం పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ కంట్లో నలుసులా మారుతున్నారు. ప్రతిపక్షాల కంటే రఘురామ చేస్తున్న విమర్శలే అధికార పార్టీని కొన్ని సార్లు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అప్పట్లో రాజుగారి అరెస్ట్ పెను దుమారమే రేపింది. పార్టీకి వ్యతిరేకంగా మారిన రఘురామకృష్ణం రాజును వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలనే కసితో వైసీపీ ఉంది. ఇటీవల నరసాపురంలో పర్యటించిన జగన్ అక్కడ పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈసారి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుని నరసాపురం పార్లమెంట్ బరిలో నిలపాలనే నిర్ణయానికి జగన్ వచ్చినట్టు చెబుతున్నారు. దాదాపు రంగరాజే అభ్యర్ధిగా ఉంటారని ప్రచారం జరుగుతోంది.
అయితే వైసీపీ వ్యూహాన్ని పసిగట్టిన రఘురామకృష్ణం రాజు ఈసారి నియోజకవర్గం మారతారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే నరసాపురం నుంచే రఘురామ పోటీ చేస్తారని తెలుస్తోంది. వైసీపీకి దూరమయ్యాక రఘురామకృష్ణం రాజు చంద్రబాబుతో పాటు ఢిల్లీలో బీజేపీ పెద్దలకు దగ్గరయ్యారు. ఈసారి ఆయన టీడీపీ, బీజేపీ రెండు పార్టీల్లో ఏదో ఓ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే తాజాగా రఘురామకృష్ణం రాజు టీడీపీ, జనసేన పొత్తుపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కచ్చితంగా ఆ రెండు పార్టీల పొత్తుంటే నరసాపురంలో వైసీపీని ఈజీగా ఓడించవచ్చు అనేది రఘురామ ప్లాన్ అని తెలుస్తోంది. మొత్తంగా రఘురామ చెబుతున్నట్టు టీడీపీ-జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తాయా? లేదా అనేది త్వరలోనే తెలిపోనుంది. అయితే రఘురామకృష్ణం రాజు ఎక్కడ నిలబెట్టిన ఓడిస్తామంటోంది వైసీపీ. చూడాలి ఏం జరుగుతుందో.