నాసల్‌ టీకా బూస్టర్ డోస్‌ వచ్చేసింది… ధర ఎంతో తెలుసా ?

By KTV Telugu On 27 December, 2022
image

చైనాతో పాటు మరికొన్ని అగ్రదేశాలలో కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ ఈ వార్త భారతీయులకు కచ్చితంగా ఊరటనిస్తుంది. దేశీయ ఔషధ తయారీ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా నాసల్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ నాసల్‌ వ్యాక్సీన్‌ను 18 ఏళ్లు పైబడివారికి బూస్టర్‌ డోసుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నాసల్ వ్యాక్సిన్‌ ధరను భారత్‌ బయోటెక్ ప్రకటించింది. ప్రయివేటు ఆసుపత్రులకు ఒక డోస్ ధర రూ.800గా నిర్ణయించినట్లు తెలిపింది. దీనికి అదనంగా 5 శాతం జీఎస్టీ, వ్యాక్సిన్ ఇచ్చినందుకు చార్జీ వసూలు చేస్తారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 325కే ఇవ్వనున్నట్లు భారత్‌ బయోటెక్ వెల్లడించింది. రెండు రోజుల క్రితమే భారత్ బయోటెక్ నాసల్ టీకాను కేంద్ర సర్కారు బూస్టర్ డోస్ గా ఆమోదించింది. ఇంకోవాక్‌ అని పిలిచే ఈ నాసల్‌ వ్యాక్సిన్‌ జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులోకి రానుంది. కోవిన్ యాప్ ద్వారా సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. శనివారం సాయంత‌్రం నుంచే స్లాట్‌లు బుక్‌ చేసుకోవచ్చు. ఇప్పటికే కోవాగ్జిన్ లేదా కోవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నవారు ఈ నాసల్‌ వ్యాక్సిన్‌ ను బూస్టర్‌ డోసుగా తీసుకోవచ్చు.