బాంబ్ సైక్లోన్ గా పిలుస్తున్న అమెరికా మంచు తుపానులో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఐస్ లేక్‌లో చిక్కుకుని గుంటూరు జిల్లాకు చెందిన వారు చనిపోయారు. వారి ఇద్దరు పిల్లలు ఏమయ్యారో తెలియాల్సి ఉంది. మంచు, చలిగాలులను తట్టుకోలేక అమెరికాలో ఇప్పటి వరకు అరవైమంది చనిపోయారు. అందులో న్యూయార్క్ ప్రాంత వాసులే ఎక్కువ. మంచులో చిక్కుకున్న వారిని కాపాడటం కూడా దుర్లభమవుతోంది. అత్యవసర సేవలు కూడా ఆగిపోయాయి. ఆ క్రమంలోనే గుంటూరు జిల్లా దంపతులు ప్రాణాలు వదిలారు.
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రుకు చెందిన నారాయణ, హరిత కొన్ని సంవత్సరాలుగా ఆరిజోనాలో ఉంటున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు. జూన్లో అందరూ సొంతూరికి వచ్చి వెళ్లారు. ఇప్పుడు వారు న్యూజెర్సీలో విహార యాత్రకు వెళ్లారు. ఫీనిక్స్ దగ్గర ఐస్ లేక్‌లో దంపతులు పడిపోయినట్లు గుర్తించారు. మంచుకిందకు వాళ్లు జారిపోయారు. హరితను చూసిన సహాయ సిబ్బంది ఆమెకు సీపీఆర్ చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం కనిపించలేదు. నారాయణ కోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి. అతని సహచరుడు కూడా ఒకరు లేక్ లో మునిగిపోయారని చెబుతున్నారు. ఈ ఘటన గురించి తెలియడంతో పాలమర్రులో విషాదం అలుముకుంది. ప్రభుత్వం సాయం చేసి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలని బంధువులు కోరుతున్నారు..