రాజకీయ వ్యూహకర్త అనే పదం ఇంతకు ముందు రాజకీయనాయకులు తమకు తాము వాడుకునేవారు. ఆ నేతకు చాణక్యుడంతటి తెలివితేటలు ఉన్నాయని తమ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. అయితే రాజకీయాల్లో నయాతరం వచ్చాక ఈ తెలివి తేటల్ని అరువు తెచ్చుకోవడం ప్రారంభించారు. తాము ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండము కానీ ఉన్న వారిని గెలిపిస్తామంటూ బయలుదేరారు. వారు ఇప్పుడు అన్ని చోట్లా విస్తరించారు. అపర చాణక్యులమని చెప్పుకున్న నేతల్ని చెప్పు చేతల్లో ఉంచుకుంటున్నారు. తమ విచ్చిన్న రాజకీయాలతో సోషల్ మీడియాను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తున్నారు.
మొదట ఐ ప్యాక్ పేరుతో ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగింది. పీకేతో పాటు ఐ ప్యాక్‌లో ఉన్న వారంతా ఐఐటీల్లో చదివిన వాళ్లే. ఉన్నత చదువులు అభ్యసించినవాళ్లే. కానీ వాళ్లు పెట్టిన ఐప్యాక్ చేసిందేమిటి? భారత ప్రజాస్వామ్యాన్ని కుల, మత, వర్గాల వారీగా విడగొట్టి సోషల్ మీడియాను గరిష్టంగా దుర్వినియోగం చేసి రాజకీయ పార్టీలకు లబ్ది చేయడం. ఇప్పుడు ఆ ఐప్యాక్ పుట్ట పగిలిన పాములా మారింది. ఆ సంస్థ నుంచి బయటకు వచ్చిన సునీల్ కనుగోలు, రాబిన్ శర్మ, శాంతను సింగ్ ఇలా అనేక మంది రాజకీయాల్ని శాసిస్తున్నారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయరంగానికి చేయాల్సినంత నష్టం చేస్తున్నారు.
రాజకీయాల్లో ఎవరూ ఊహించనంత వేగంగా నిర్ణయాలు తీసుకుని తెలంగాణ సాధించిన కేసీఆర్ లాంటి వ్యూహకర్త కూడా ఓ సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ను నమ్ముకున్నారు. ఇక చంద్రబాబు కూడా రాబిన్ శర్మను అపాయింట్ చేసుకున్నారు. సీనియర్ నేతలు అపర చాణక్యులుగా పేరు తెచ్చుకున్న వారు కూడా కొత్త తరం రాజకీయాలు చేయాలంటే స్ట్రాటజిస్టులు ఉండాల్సిందేనని నమ్మకానికి వచ్చేశారు. అలా కడివెడు పాలను చెడగొట్టడానికి విషపూరితం చేయడానికి చుక్క విషం చాలన్నట్లుగా వందల పార్టీలు వేల మంది నాయకులతో విస్తరించిన రాజకీయాన్ని ఒకే ఒక్క స్ట్రాటజిస్ట్ విషపూరితం చేశారు. రాజకీయాలంటే కుట్రలు కుతంత్రాలు అని నిన్నామొన్నటిదాకా అనుకునేవారు. కానీ ఇప్పడు అంతకు మించి అని సోషల్ మీడియా పుణ్యమా అని పుట్టుకు వచ్చిన వ్యూహకర్తలు చెలరేగిపోతున్నారు.
పీకే షార్ట్ కట్‌లో తెచ్చుకున్న తెచ్చి పెట్టిన విజయాలు చూసి ఆయననకు మించిన వారు రంగంలోకి వచ్చారు. ఫలితంగా ఇప్పుడు రాజకీయం విషపూరితం అవుతోంది. ఇప్పుడు హత్యలు అంటే నేరుగా చేయాల్సిన పని లేదు. మానసికంగా చేయవచ్చు. ఎదుటి వారి వీక్‌నెస్‌ను పట్టుకుని దానిపై సోషల్ మీడియా ద్వారా దెబ్బకొడితే చాలు. టార్గెట్ చేసిన వాడు మానసికంగా కుంగి కృశించి పోయి ప్రాణాలు పోగొట్టుకుంటాడో, ఆత్మహత్య చేసుకుంటాడో వాడిష్టం అన్నట్లుగా మార్చేయవచ్చు. ఇందు కోసం కోట్లు ఖర్చు పెట్టి సోషల్ మీడియా వారియర్స్ పేరుతో రాజకీయ పార్టీలు సైన్యాలను నడుపుతూ ఉంటాయి. ఎక్కడిక్కడ ఫలానా లీడర్‌ను ఎలా దెబ్బకొట్టాలి అనే దానిపై స్ట్రాటజిస్టులను పెట్టుకుని ఎప్పటికప్పుడు తాము టార్గెట్ చేయాల్సిన నేతలను ఎలా వేధించాలో పక్కా ప్లాన్ ప్రకారం రెడీ అయిపోతున్నారు.
ఏ రాజకీయ పార్టీకైనా బలం సిద్ధాంతం అని ఇప్పుడు ఎవరైనా చెబితే వారి వైపు పిచ్చి వాడిని చూసినట్లుగా చూస్తారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు కాలగమనంలోకి కలసిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీకైనా బలం ఏమిటి అంటే సోషల్ మీడియా అని చెప్పే పరిస్థితి వచ్చింది. అధినేతకు ఎంత ప్రజాదరణ ఉన్నా కింది స్థాయి నుంచి పార్టీకి నాయకత్వం ఉన్నా సోషల్ మీడియా బలంగా లేకపోతే గెలుపు కష్టమేననే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారణం స్ట్రాటజిస్టులే. స్ట్రాటజిస్టుల వ్యూహం రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం. రెండు ప్రత్యర్థులను ట్రోల్ చేయడం. సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువ. పాజిటివ్ అంశాలకు ప్రాధాన్యం లభించదు. కానీ నెగిటివ్‌గా ఏదైనా ఉంటే మాత్రం వైరల్ అయిపోతుంది. ఇది ప్లస్ అయిపోయింది.
ఇప్పుటు స్ట్రాటజిస్టుల పాపం ఎంత వరకూ వెళ్లిందంటే జనం కూడా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు. ఏదైనా కళ్ల ముందు జరిగిందంటే జనం నమ్మరు. కానీ వాట్సాప్‌లో వచ్చిందంటే అది జగలేదని మన కళ్లతో చూశామని చెప్పినా కూడా నమ్మరు. ఆ స్థాయిలో మన బుర్రల్ని ఖరాబు చేస్తున్నారు స్ట్రాటజిస్టులు. స్ట్రాటజిస్టుల తప్పుడు ఆలోచలను తాత్కాలిక విజయం కోసం ప్రోత్సహించే రాజకీయ నాయకులదే అసలుతప్పు. అధికారం అందుకోవాలని లేని అధికారాన్ని అందుకోవాలని ఎలాంటి మార్గమైన సరే అనుకుని ముందుకెళ్లే రాజకీయ నాయకులతోనే సమస్య. రాజకీయానికి పట్టిన వైరస్ కూడా అదే.