కవితను రెండో సారి ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతోంది. ఛార్జ్ షీటులో పేరు చేర్చిన ఈడీ ఇప్పుడామెను మొదటిసారి ప్రశ్నించాలనుకుంటుంది. ఆదాయ పన్ను శాఖ నజర్ పెట్టినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. ముప్పేట దాడిలో కవిత ఉక్కిరిబిక్కిరవుతున్న నేపథ్యంలో ఆసలు ఆమెకింత కష్టం ఎందుకు వచ్చిందన్న చర్చ సమాంతరంగా జరుగుతోంది. కవిత సొంతంగా అలాంటి పనులు చేయలేని పరిస్థితుల్లో ఎవరో వెనుక ఉండి నడిపించి ఆమెకు తెలియకుండానే ఇరికించేశారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. అందులో కొంతైనా వాస్తవం ఉందని విశ్వసిస్తున్నారు.
లిక్కర్ స్కాం నుంచి బయటపడేందుకు కవిత పది ఫోన్లు ధ్వంసం చేశారన్న కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్థారించాయి. ఈడీ ఛార్జ్ షీటులో కూడా ఆ ప్రస్తావన ఉంది. రెండు నెంబర్లకు సంబంధించిన ఫోన్లను ఆమె వినియోగించి తర్వాత పగులగొట్టారని ఛార్జ్ షీటులో పేర్కొన్నారు. ఆ చార్జ్ షీట్ల ప్రకారం కవితే ఫోన్లు వాడినట్లు చెబుతున్నారు. అయితే కవిత పేరుతో ఉన్న ఫోన్లను ఆమె ఎప్పుడూ వాడలేదని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. కవితకు ఇద్దరు ముగ్గురు పీఏలున్నారు. వారే ఆమె తరపున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కవిత తరపున దందాలు కూడా చేస్తుంటారు. కవిత పేరుతో ఫోన్ ఉంటే ఇతరులను నమ్మించేందుకు కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచనతోనే ఆమె పేరు మీద ఫోన్లు తీసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. అసలు స్కాం సూత్రధారులు కూడా వారే అయి ఉంటారని. కవితకు చెప్పీ చెప్పకుండా పని కానిచ్చేసి ఉంటారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవితకు తెలియకుండానే పీఏలు సెటిల్మెంట్లు, దందాలు చేసేందుకు ఆమె పేరును వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు చెడ్డపేరు వస్తోంది. అయినా కవిత గుడ్డిగా వారిని నమ్మి ట్రాప్ లో పడిపోయారని, ఇప్పుడు ఢిల్లీ లెవెల్లో చెడ్డ పేరు వచ్చిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ కాంట్రాక్టులు సిద్దం చేసి ప్లానింగ్ అయిపోయిన తర్వాత చివరకు ఆమె దృష్టికి తీసుకెళ్లి ఉంటారని డబ్బు ఆశ చూపడంతో ఆమె ఒప్పుకుని ఉంటారని అత్యంత సన్నిహితుల నుంచి విశ్లేషణలు వస్తున్నాయి.
కేసీఆర్ బంధువైన ఒక వ్యక్తి నిత్యం ప్రగతి భవన్లో ఉంటూ కవితను మిస్ లీడ్ చేశారని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ కు నీడలా ఉండే ఆ వ్యక్తిని ముద్దుగా దుష్టశక్తి అని కూడా పిలుస్తుంటారట. అతడ్ని కేటీఆర్, హరీష్ రావు దగ్గరకు రానివ్వకపోవడంతో కవిత గ్రూపులో చేరిపోయి. కుటుంబంలో రాజకీయాలు చేస్తున్నాడని ఇటీవలి కాలంలో వినిపిస్తున్న మాట. బోయినపల్లి అభిషేక్ రావును కవిత దూరం పెట్టిన తర్వాత సదరు వ్యక్తే జోక్యం చేసుకుని అభిషేక్ సేవలు వినియోగించుకోవాలని సలహా ఇచ్చాడట. కవిత పీఏలకు అన్ని విషయాలు చెబుతూ ఆమెను ఎలా మిస్ లీడ్ చేయాలో కూడా సదరు దుష్టశక్తి హితబోధ చేస్తున్నాడని ప్రగతి భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సంగతిని కేసీఆర్ గ్రహించలేకపోతున్నారని ఆయన ముందుకు వెళ్లి చెప్పే ధైర్యం ఎవరికీ లేదని చెప్పుకుంటున్నారు.
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కవిత ఓడిపోయిన తర్వాత ఆమె క్రియాశీలత కొంత తగ్గిన మాట వాస్తవం. అయితే ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత మళ్లీ యాక్టివ్ అయ్యారు. అమె కంటే ఆమె పీఏలు ఎక్కువ యాక్టివ్ అయ్యారు. దందాలు తారా స్థాయికి చేరుకున్నాయి. బీజేపీ ఆరోపిస్తున్నది కూడా అదే. అయితే బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా పీఏల సంగతి చెప్పకుండా కవిత పేరునే నేరుగా ప్రస్తావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై బీజేపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేసేంత వరకు కూడా కేసీఆర్ కు ఎలాంటి సమాచారం లేదు. జరుగుతున్న పనులు కేసీఆర్ కు తెలియకుండా ఆ దుష్టశక్తి అడ్డుపడ్డారని ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో టాక్ నడుస్తోంది. ఏదైనా సరే స్కాంలో కవిత పాత్ర లేకపోయినా పీఏల కారణంగా ఆమె పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు.