టీటీడీకి కొత్త చైర్మ‌న్.. రేసులో ఎవరూ ఊహించని పేరు 

By KTV Telugu On 28 December, 2022
image

తిరుమల తిరుపతి దేవస్థానం పాల‌క మండ‌లికి కొత్త చైర్మన్ రాబోతున్నారు. టీటీడీ బోర్డు ప‌దవీ కాలం వ‌చ్చే ఏడాది ఆగ‌స్టుతో ముగియ‌నుంది. ప్రస్తుతం బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఆయన అటు ఉత్త‌రాంధ్ర వైసీపీ వ్యవహారాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సుబ్బారెడ్డికి పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర బాధ్యతలను అప్పజెప్పాలని సీఎం జగన్‌ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను టీటీడీ చైర్మ‌న్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పిస్తున్నార‌ని తెలిసింది. వైకుంఠ ఏకాదశి దర్శనాలు ముగిసిన త‌ర్వాత చైర్మ‌న్ బాధ్య‌త‌ల నుంచి వైవీ త‌ప్పుకోనున్నారు. టీటీడీ బోర్డు కొత్త చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో పాటు పాలకమండలిలో సైతం కీలక మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టీటీడీ కొత్త ఛైర్మన్ పాలకమండలి సంక్రాంతి తర్వాత భాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది. కరుణాకర్‌రెడ్డి గతంలోనూ ఒకసారి టీటీడీ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇప్పుడు మరోసారి ఆయనకే టీటీడీ బోర్డు చైర్మన్‌ పదవి కట్టబెట్టాలని జగన్‌ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే జగన్‌ దృష్టిలో మరో పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వంలో బీసీలకు పెద్ద పీట వేస్తున్నామని జగన్‌ చెబుతున్నారు. ఇటీవల జయహో బీసీ పేరుతో మహాసభ కూడా నిర్వహించారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి టీటీడీ పాల‌క మండ‌లి నూత‌న చైర్మ‌న్‌గా బీసీ సామాజికవర్గానికి చెందిన జంగా కృష్ణ‌మూర్తిని నియ‌మించాలని అనుకుంటున్నారని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈయ‌నది యాద‌వ సామాజిక వ‌ర్గం. ప‌ల్నాడు జిల్లా గుర‌జాల‌లో రాజ‌కీయ కార్యక‌లాపాలు సాగిస్తున్నారు. వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ప‌ని చేశారు. ఈయ‌న సేవ‌ల్ని గుర్తించిన జగన్ ఆయనకు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. ఇప్పుడు టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మించి తాము బీసీల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే సంకేతాల‌ను పంపాలనుకుంటున్నారు జ‌గ‌న్. గ‌తంలో చంద్ర‌బాబు కూడా పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు టీటీడీ చైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. నిజంగా జంగా కృష్ణమూర్తి కి అవకాశం దక్కితే బీసీలలో జగన్‌ పాపులారిటీ మరింత పెరిగే అవకాశం ఉంది అనంటున్నారు పరిశీలకులు.