జగన్ లండన్ పర్యటన ఆకస్మికమా ? ప్రీ ప్లాన్డా ? అసలు వివాదం ఏమిటి ?

By KTV Telugu On 23 May, 2022
image

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల తర్వాత పెట్టుబడుల కోసం దేశం దాటారు. దావోస్‌కు వెళ్లేందుకు కోర్టు అనుమతి తీసుకున్నారు. అత్యంత కుబేరులు ఉపయోగించే లగ్జరీ విమానాన్ని బుక్ చేసుకుని నేరుగా ఆయన స్విస్ వెళ్లలేదు. లండన్ వెళ్లారు. దీంతో ఏపీలో రాజకీయ దుమారం ప్రారంభమయింది. జగన్ లండన్ వెళ్లడం తప్పని ఎవరూ అనట్లేదు.. కానీ కోర్టు దగ్గర్నుంచి పర్మిషన్ తీసుకోకుండా.. పబ్లిక్‌కి చెప్పకుండా ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. అక్కడేదో గూడుపుఠాణీ చేయడానికేనని అంటున్నారు . దీనిపై ప్రభుత్వ వాదన మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికి ఉపయోగపడేలా ఉంది.

స్విస్ పర్యటనకు పర్మిషన్ తీసుకున్న జగన్ !

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దావోస్‌ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును సీఎం జగన్‌ కోరారు.  సీబీఐ కోర్టు జగన్‌ దావోస్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. స్విట్జర్లాండ్‌ దావోస్‌లో జరిగే 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నారు.  కానీ జగన్ 19వ తేదీ నుంచే విదేశీ పర్యటనకు అనుమతి తీసుకున్నారు. సదస్సు తర్వాత మరో ఐదు రోజులు విహారయాత్రలో ఉండనున్నారు.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి ఏపీకి పెట్టుబడుల కోసం ఆయన విదేశాలకు వెళ్లారు. అయితే ఆయన పర్మిషన్ తీసుకున్న 19వ తేదీనే బయలుదేరారు. కానీ పర్మిషన్ తీసుకున్న దావోస్‌కు కాకుండా నేరుగా లండన్‌కు వెళ్లడంతోనే వివాదం ప్రారంభమయింది.

ఎయిర్ ట్రాఫిక్ వల్లనే లండన్‌కు వెళ్లారని బుగ్గన వివరణ !

జగన్ లండన్ వెళ్లారని వైసీపీ ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. కానీ అక్కడ ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియ ఆలస్యం అయింది. అందువల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. అంతే కాదు అక్కడ కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అక్కడ్నుంచి బయలుదేరి జ్యూరిచ్‌లో ల్యాండ్ అవ్వాలంటే ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయింది. ల్యాండింగ్‌కు పర్మిషన్ ఇవ్వలేదు. ఉదయం బయలుదేరుతామంటే పైలట్లు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణాల వల్ల లండన్‌లో జగన్ బస చేశారు. ఒక రోజు అక్కడ గడిపిన తర్వాత జగన్ దావోస్ చేసుకున్నారు.

బుగ్గన చెప్పినదంతా అబద్దమని టీడీపీ పత్రాలు విడుదల !

జగన్ ఆకస్మికంగా లండన్ పర్యటనకు వెళ్లలేదని ప్రణాళిక ప్రకారమే వెళ్లారనిటీడీపీ కొన్ని పత్రాలు విడుదల చేసింది. ఇస్తాంబుల్‌లో విమానం ఇంధనం నింపుకోవడం ఆలస్యం కాలేదన్నారు. సహజంగా రెండు గంటలు పడుతుందని.. అంతే పట్టిందని… అక్కడి నుంచి జూరెక్ చేరుకోవడానికి సమయం ఉన్నా లండన్ వెళ్లారన్నారు. లండన్‌లోని ప్రైవేటు ఎయిర్‌పోర్టులో దిగడానికి కూడా రెండు వారాల ముందే పర్మిషన్ తీసుకున్నారన్నారు. అప్పటికప్పుడు వెళ్తే దిగడానికి ఎలా పర్మిషన్ ఇస్తారని  ప్రశ్నిస్తున్నారు. లండన్‌లో రస్ అల్ ఖైమా ప్రతినిధులతో చర్చలు జరిపి… క్విడ్ ప్రో కేసుల్లో సెటిల్మెంట్ చేసుకోవడం మాత్రమే కాకుండా.. వచ్చే ఎన్నికలకు డబ్బులు హవాలా మార్గంలో తెచ్చుకునేందుకు వెళ్లారంటున్నారు. బుగ్గన చెప్పినట్లుగా జురెక్‌లో పది గంటల తర్వాత విమానాలు దిగడానికి పర్మిషన్ లేదని చెప్పడం అబద్దమని.. అక్కడ ల్యాండయిన విమానాల వివరాలను అందించారు. మొత్తంగా జగన్ లండన్ పర్యటనపై బుగ్గన చెప్పింది అవాస్తవమని టీడీపీ వాదిస్తోంది.

బెయిల్ షరతులు ఉల్లంఘించినట్లేనా ?

బెయిల్ షరతులు ఉల్లంఘించి జగన్ ఇతర దేశాల్లో ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ అయ్యారని.. ముందుగానే తీసుకున్న అనుమతులే దానికి సాక్ష్యమని టీడీపీ వాదిస్తోంది. బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపిస్తోంది. ఈ అంశంపై వారు కోర్టుకెళ్లే ఆలోచన కూడా చేసి అవకాశంది. ఇది వైసీపీకి ఎప్పటికప్పుడు ఇబ్బందికరంగా మారే పరిస్థితి.

నిజానికి జగన్ లండన్ వెళ్లడం పై ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ సీక్రెట్‌గా వెళ్లడంపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు నుంచి నేరుగా పర్మిషన్ తీసుకుని వెళ్లవచ్చు కదా .. ఇలా అబద్దాలు చెప్పి అక్కడ పర్యటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సమర్థించుకోలేకపోతోంది. తమను సమర్థించేవాళ్లు ఎప్పటికీ సమర్థిస్తూనే ఉంటారు కానీ.. ఇలాంటి విషయాలు తటస్థ ఓటర్లు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.