నెల్లూరు ఎమ్మెల్యేల అసహనం.. మొన్న కోటంరెడ్డి, నేడు ఆనం

By KTV Telugu On 28 December, 2022
image

వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి తీరాలని సీఎం జగన్ పరితపిస్తున్నారు. ప్రజలకు చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేశాం. వైనాట్ 175 అని అంటున్నారు ముఖ్యమంత్రి. కానీ, క్రేతస్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రజాసమస్యలను పరిష్కరించడం లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తే ఓకే కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి బయటకు తన్నుకుంటూ వస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నా ఏం లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఏ పనులు కావడం లేదని మొన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. మంత్రులు మారుతున్నారు శాఖలు మారుతున్నాయి కలెక్టర్లు మారారు. కానీ గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు మాత్రం కావడం లేదని మండిపడ్డారు. గతంలో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనిల్‌ను తప్పించి జిల్లా నుంచి కాకానిని జగన్ కేబినెట్‌లోకి తీసుకున్నారు. వ్యవసాయశాఖ అప్పగించారు. ఈక్రమంలోనే కాకాని సమక్షంలోనే మంత్రులు మారినా శాఖలు మారిన ఏం ఉపయోగం లేదంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.

తాజాగా మరో సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామని ఓట్లు అడుగుతామంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరులో నూతనంగా నియమించిన సచివాలయ వైసీపీ కన్వీనర్లు వాలంటీర్లతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. రోడ్ల గుంతలు పూడ్చలేకపోతున్నాం తాగడానికి నీళ్లు లేవు. నాలుగేళ్లలో ఏం పని చేశామని ప్రజలను ఓట్లు అడుగుతాం. ప్రాజెక్టులు కట్టమా? పనులు మొదలుపెట్టామా? అంటూ ప్రభుత్వంపై ఒకింత ఆగ్రహం వెలిబుచ్చారు. పింఛన్లు ఇస్తే ఓట్లు వేస్తారా? అలా అయితే గత ప్రభుత్వమూ ఇచ్చిందంటూ దుయ్యబట్టారు. ఇల్లు కడతామని లేఅవుట్‌ వేసినా ఇప్పటికీ కట్టలేదని ఎస్‌ఎస్‌ కెనాల్‌ గురించి సీఎం జగన్‌కు ఎన్నోసార్లు చెప్పడంతో పాటు అసెంబ్లీలోనూ ప్రస్తావించామని అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉందని నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే ఏకరవు పెట్టడం గమనార్హం.

కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్‌ఆర్‌ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటూ జగన్‌ను లక్ష్యంగా చేసుకొని ఆనం మండిపడ్డారు. గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నామని అపనమ్మక వ్యవస్థలో పనిచేస్తున్నామని ఆనం చెప్పుకొచ్చారు. ఇప్పుడే కాదు గతంలోనూ పలుమార్పు ప్రభుత్వ తీరును అనేక విషయాల్లో ఆనం తప్పుబట్టారు కూడా. ప్రభుత్వం తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఆనం ఉన్నారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆనం మళ్లీ టీడీపీలోకి వెళతారనే ప్రచారం జరుగుతోంది. ఇక సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేపట్టాల్సి వస్తుందంటూ అటు కోటంరెడ్డి కూడా ఇటీవల ప్రభుత్వాన్ని గట్టిగానే హెచ్చరించారు. ఏ పనులు కావడం లేదని ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ వైసీపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నాయి. ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.