టీడీపీ అధినేత చంద్రబాబు సభలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లాలోని కందుకూరులో విపక్షనేత నిర్వహించిన సభలో తోపులాట ఏడు నిండుప్రాణాలు తీసింది. గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో సభను అర్ధాంతరంగా ముగించిన చంద్రబాబు మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. దుర్ఘటనలు చెప్పి జరగవు. కొన్ని ఘటనలు అనూహ్యంగా ఉంటాయి. కొన్నిటికి మానవతప్పిదాలు కారణమవుతుంటాయి. కందుకూరు దుర్ఘటనలో నిర్వహణ, పర్యవేక్షణ లోపం కూడా కారణంగా కనిపిస్తున్నాయి.
రాజకీయపార్టీ బహిరంగసభ నిర్వహించే ప్రదేశం, అక్కడి పరిస్థితులు రద్దీని తట్టుకునేలా ఉండాలి. పార్టీపరంగా దానికి తగ్గ ఏర్పాట్లు జరగాలి. చంద్రబాబు సభ సమీపంలోని కాలువలో ఒక్కసారిగా పదిహేనుమందిదాకా పడిపోవటం అందులో ఏడుగురు ప్రాణాలు వదలటం దురదృష్టకర ఘటనని దులిపేసుకుంటే సరిపోదు. సంతాపం ప్రకటిస్తే పోయిన ప్రాణాలు తిరిగిరావు. ప్రజలు కాలువ పక్కన నిలబడితే ప్రమాదం జరుగుతుందని ముందే ఊహించి అక్కడ అడ్డుగా బ్యారికేడ్లనో, కర్రలతో అడ్డుగా కట్టి ఉంటేనో ఈ దారుణం జరిగి ఉండేది కాదు. కానీ జనం తండోపతండాలుగా తరలిరావాలని కోరుకుంటారేగానీ ఎవరికీ ఏ హానీ జరగకూడదని ఈరోజుల్లో రాజకీయ నాయకులు కోరుకుంటారనుకోవడం అత్యాశే.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనను జనం ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు. రాజమండ్రి పుష్కరఘాట్‌లో అప్పట్లో చంద్రబాబు కోసం జరిగిన హడావుడి తొక్కిసలాటకు దారితీసింది. దాదాపు 30మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వచ్చి వెళ్లేదాకా మూడుగంటల పాటు అప్పట్లో భక్తులను అనుమతించలేదు. దీంతో చంద్రబాబు వీపు తిప్పారో లేదో భక్తులు ఒక్కసారిగా చొచ్చుకురావటంతో తొక్కిసలాట జరిగింది. ఆయన ప్రచార పాకులాటే ఆ విషాదానికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు మీటింగ్‌లో జరిగిన దుర్ఘటనకు కేవలం చంద్రబాబునే నిందించలేంకానీ తన తప్పేం లేదని ఆయన తప్పుకోలేరు. అధికారయంత్రాంగం పర్యవేక్షణాలోపం ఉన్నా అధినేత వచ్చినప్పుడు పార్టీ యంత్రాంగం కాస్త ముందు జాగ్రత్తచర్యలు చేపట్టి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు!