బీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్ కర్ణాటక – వ్యూహం ఖరారు చేసిన కేసీఆర్ !

By KTV Telugu On 29 December, 2022
image

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీ విస్తరణకు మొదటి చాయిస్ గా కర్ణాటకనే ఖరారు చేసుకున్నారు. వచ్చే ఏప్రిల్ లోపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ అయిన జేడీఎస్ కూడా పోటీ చేస్తోంది. జేడీఎస్ బీఆర్ఎస్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకుంది. బీఆర్ఎస్ తరపున నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమానికి జేడీఎస్ నేత కుమారస్వామి హాజరవుతున్నారు. బీఆర్ఎస్ నెక్ట్స్ టార్గెట్ కర్ణాటక అని అక్కడ కలిసి పోటీ చేస్తామని కుమారస్వామి కేసీఆర్ ప్రకటించారు. దీనికి తగ్గట్లుగా కేసీఆర్ కార్యాచరణ ప్రారంభించారు

కర్ణాటకలో తెలుగు మూలాలు ఉన్న ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాలపై బీఆర్ఎస్ ప్రధానంగా దృష్టి పెట్టి జేడీఎస్‌కు సహకారం అందించనుంది. కర్ణాటక జనాభాలో దాదాపు 15 శాతం మంది తెలుగు మాట్లాడే వారు ఉంటారు. కర్ణాటక రాష్ట్రంలోని 12 జిల్లాల్లో తెలుగువారు కీలకంగా ఉన్నారని బీఆర్ఎస్ ఇప్పటికే సమాచారం సేకరించింది. కలబురిగి, బీదర్, కోలార్, బళ్లారి నాలుగు జిల్లాలలో దాదాపు 30 శాతం మంది తెలుగు ఓటర్లు ఉన్నారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాచారాన్ని సేకరించారు. 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న బెంగళూరులో కూడా భారీ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాసనసభా నియోజకవర్గాలలో 14 పార్లమెంట్ స్థానాల్లో తెలుగువారి ఓట్లు ప్రభావం ఉన్నట్లుగా బీఆర్ఎస్ అధినేత గుర్తించారు.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం బీజేపీకి 104, కాంగ్రెస్‌కు 80, జేడీఎస్‌కు 37 సీట్లు ఉన్నాయి. ఏ‌ప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో హైదరాబాద్‌-కర్ణాటక జిల్లాల్లోని 40 సీట్లు అత్యంత కీలకం కానున్నాయి. హైదరాబాద్‌-కర్ణాటక ప్రాంతంలోని బీదర్‌, యుద్గీర్‌, రాయచూర్‌, కొప్పాల, కలబురిగి, బళ్లారి-విజయపుర జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో జేడీఎస్‌కు భారత రాష్ట్ర సమితి తోడయితే మెజార్టీ సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో జేడీఎస్‌కు అంత పట్టు లేదు. కానీ బలం ఉంది. బీఆర్ఎస్ మద్దతుతో ప్రస్తుతం జేడీఎస్‌కు ఉన్న 37 సీట్లకు ఈ 40 సీట్లు తోడయితే ఈ కూటమి 70 నుంచి 80 స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉంటుందని ప్రాథమిక అంచనా బీఆర్ఎస్ అధినేత అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

కర్ణాటకలో జేడీఎస్ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. కానీ రెండు జాతీయ పార్టీలు ఇంకా బలంగా ఉన్నాయి. ఈ కారణంగా జేడీఎస్ అనుకున్నంతగా విజయాలు సాధించలేకపోతోంది. మూడో అతి పెద్ద పార్టీగా ఉంటోంది కానీ అధికార పీఠానికి సొంతంగా దగ్గర కాలేకపోతోంది. కర్ణాటకలో ఒక్కలిగ వర్గం జేడీఎస్‌కు అండగా ఉంటుంది. లింగాయత్‌లు ఎవరి వైపు ఉంటే వారికే అధికారం లభిస్తుంది. యడియూరప్ప లింగాయత్ వర్గమే. అయితే ఆయనను బీజేపీ పక్కన పెట్టింది. ప్రస్తుతం సీఎం బొమ్మై కూడా లింగాయత్ వర్గమే. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ వర్గం నుంచే సీఎం అవుతారు. అన్ని పార్టీలు ఆ వర్గాన్నే ఎక్కువగా నమ్ముతున్నాయి. టీఆర్ఎస్ తరపున జహీరాబద్ నుంచి ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ కూడా లింగాయత్ వర్గానికి చెందినవారే. ఆయన నేతృత్వంలోనే జేడీఎస్ కు అన్ని విధాలుగా సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అలాగే కర్ణాటకలో మెడికల్ కాలేజీలు సహా పలు విద్యా సంస్థలు ఉన్న నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి కూడా కీలక బాధ్యతలు ఇప్పగించినట్లుగా తెలుస్తోంది. కన్నడ భాషపై పట్టుకలిగిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరవాత కేసీఆర్ కూడా కర్ణటాకలో బీఆర్ఎస్- జేడీఎస్ తరపున ప్రచారం చేయనున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, జేడీఎస్ పొత్తు ఖాయమయింది.. కానీ అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై అధినేత కేసీఆర్ కూడా స్పష్టత ఇవ్వడం లేదు. పోటీ గురించి చెప్పడం లేదు, జేడీఎస్ ను గెలిపించడానికి కుమారస్వామిని సీఎం చేయడానికి కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కుమారస్వామి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ కర్ణాటకల్లో కొన్ని సీట్లలో పోటీ చేస్తుందని ఆయన చెప్పినట్లుగా కర్ణాటక మీడియా వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రస్థానానికి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను వేదికగా మల్చుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ లోపు వచ్చే అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో స్థానికంగా కలిసి వచ్చే భావసారూప్య పార్టీలకు మద్దతివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ తరఫున పరిశీలక, ప్రచార బృందాలను పంపడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో రాజకీయ స్థితిగతులను అధ్యయనం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అంటే… కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ ఉండదని పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అయితే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది.