అసలు సిన్మా ముందుందట.. సంతోష్‌ వేసేశాడు!

By KTV Telugu On 30 December, 2022
image

మ‌నం ఒక‌టి త‌లిస్తే విధి మ‌రోలా త‌లుస్తుంది. బీఎల్ సంతోష్ ఢిల్లీలో ఉన్నా మ‌న పోలీసులు వెళ్లి ఆయ‌న్ని ప‌ట్టుకొచ్చి ఎంక్వ‌యిరీ చేసి జైలుకు పంపాల‌న్న‌ది ప్లాన్‌. కానీ ఎంతో క‌ష్ట‌ప‌డి ఆయ‌న‌కు నోటీసులు ఇవ్వ‌డంతోనే ఆగిపోయిందా ప్ర‌య‌త్నం. ఫాంహౌస్ కేసులో తెర‌వెనుక అంతా ఆయ‌నే చేశార‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం నిందించిన బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ ద‌ర్జాగా హైద‌రాబాద్ వ‌చ్చారు. సమావేశాల‌తో కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు. కానీ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆయ‌న్ని ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌స్థితి. ఎందుకంటే ఆ కేసే రాష్ట్ర ప‌రిధిని దాటిపోయింది.
మెయినాబాద్ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం బ‌య‌టికొచ్చేదాకా బీఎల్ సంతోష్ పేరు పెద్ద‌గా ఎవ‌రికీ తెలీదు.

పార్టీలో ఆయ‌న సీనియ‌ర్ లీడ‌ర్‌. సంఘ్‌తో సుదీర్ఘ‌కాల అనుబంధం ఉన్న నాయ‌కుడు. మోడీషాలు కూడా అన్ని విషయాలే ఆయ‌న‌తో చ‌ర్చిస్తారంటేనే సంతోష్‌కున్న ప్రాధాన్యం అర్ధ‌మైపోతోంది. అంత‌టి నాయ‌కుడు నిజంగా ఫాంహౌస్ కేసులో దొరికి ఉంటే నిజంగా పెద్ద సంచ‌ల‌న‌మై ఉండేది. కానీ సాక్ష్యాలు లేక‌ విచార‌ణ స‌రిగ్గా సాగ‌క చివ‌రికి కేసు సీబీఐకి వెళ్లిపోయింది. ఇప్పుడు కేసీఆర్ చేసేదేమీ లేదు. కేంద్ర‌ద‌ర్యాప్తుసంస్థ ఎంక్వ‌యిరీ ఎలా జ‌రుగుతుందో చూస్తుండ‌ట‌మే. బీఎల్ సంతోష్ ద‌ర్జాగా తెలంగాణ‌కు రావ‌డ‌మే కాదు ఓపెన్‌గా వార్నింగ్ ఇచ్చేశాడు. త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన‌వారు ప‌ర్య‌వ‌సానాల‌కు సిద్ధ‌ప‌డాల‌ని హెచ్చ‌రించారు. ఇప్ప‌టిదాకా తానంటే తెలంగాణ‌లో ఎవ‌రికీ తెలీద‌ని కేసులో పెట్టి అంద‌రికీ తెలిసేలా చేశార‌న్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వంపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు బీఎల్ సంతోష్‌. కేసులో ఇరుక్కుని దొర‌క్కుండా త‌ప్పించుకుంటార‌నుకుంటే ఇంటికొచ్చి తొడ‌గొడుతున్నారు. గులాబీపార్టీకి ఇంత‌కంటే అవ‌మానం ఏముంటుంది. ఓ ప‌క్క క‌విత లిక్క‌ర్‌స్కామ్‌లో కూరుకుపోయారు. ఫాంహౌస్ కేసు ఎపిసోడ్‌లో కీల‌క‌మైన పైలెట్ రోహిత్‌రెడ్డి గుట్కాకేసులో ఈడీ ముందుకు రావాల్సి వ‌చ్చింది. రేపు ఫాంహౌస్‌లో దేశ‌ద్రేహానికి కుట్ర చేశార‌ని మిగిలిన ఎమ్మెల్యేల మీద కేసు బుక్ అయినా ఆశ్చ‌ర్య‌పడాల్సిన ప‌న్లేదేమో! బీఎల్ సంతోష్ వ‌చ్చారు. ద‌మ్ముంటే ట‌చ్ చేయండి చూద్దాం అన్న‌ట్లుంది బీజేపీ. రావ‌డ‌మే కాదు స‌ర్కార్‌కే సవాలు విసిరారు. ఓటుకునోటు కేసే ఇప్ప‌టికీ దిక్కూదివాణం లేదు. ఇలాంటి ఫాంహౌస్ కేసులు ఇంకెప్పుడు నిల‌వాలి?