ఖమ్మం సభ సక్సెస్ కావడంతో టీడీపీపై రాజకీయ వర్గాల్లో ఆపారమైన విశ్వాసం ఏర్పడింది. రాజకీయ విభజన పెరిగిపోయిన తెలంగాణలో చంద్రబాబు మళ్లీ పుంజుకుంటారన్న చాలా మంది నేతలు నమ్ముతున్నారు. దానితో ఇప్పుడు మళ్లీ పచ్చ చొక్కాలు తొడుక్కునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేస్తున్న ప్రకటనలు కూడా అలానే ఉన్నాయి. వెళ్లిపోతున్న తరుణంలో పార్టీపై బురద చల్లడం రాజకీయాల్లో మామూలేనని చెబుతారు. సండ్ర ఇప్పుడు కొందరు బీఆర్ఎస్ నేతలపై ఫైర్ కావడం ఆ దిశగా సంకేతాలనిస్తోంది. తాను టీడీపీని వీడాలనుకోలేదని ఆ పార్టీని కాపాడటానికి సర్వ శక్తులా ప్రయత్నించానని వీరయ్య ఆవేశంగా మాట్లాడటం ఆయన తదుపరి చర్యలకు దర్పణం పడుతోంది. టీడీపీ కోసం కేసులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేయడం కూడా ఘర్ వాపసీ కోసమేనని భావిస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి వర్గంతో ఆయనకు బద్ధవైరం ఉంది. పొంగులేటి వర్గం వచ్చి టీడీపీలో చేరే లోపే తాను చంద్రబాబును కలవాలని సండ్ర కోరుకుంటున్నట్లు ఆయన సహచరులు చెబుతున్నారు.
ఇక అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా మళ్లీ టీడీపీ వైపు చూస్తున్నారని బీఆర్ఎస్ లో వినిపిస్తున్న మాట. తుమ్మల నాగేశ్వరరావు ఒత్తిడి మేరకే తాను బీఆర్ఎస్ లో చేరానని చాలా కాలం తుమ్మలకు కనిపించకుండా తిరిగానని మెచ్చా అప్పట్లో ప్రకటించడం సంచలనమైంది. అయిష్టంగానే ఆయన బీఆర్ఎస్ లో చేరినట్లు వ్యక్తమైన కామెంట్స్ ను టీడీపీ వారు ఇప్పుడు మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. మెచ్చా ఎప్పుడైనా టీడీపీలోకి వచ్చెయ్యొచ్చన్నట్లుగా టాక్ నడుస్తోంది. భయపెట్టి వత్తిడి చేసి అధికార పార్టీలో చేర్చుకునే సీన్ ఇకపై ఉండదని చెబుతున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన పలువురు ప్రస్తుత బీఆర్ఎస్ నేతలు కూడా పక్క చూపులు చూసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది. గ్రేటర్ ఎమ్మెల్యేల్లో చాలా మంది గతంలో టీడీపీలో పనిచేసిన వారే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో టీడీపీలో పనిచేసినా ఇప్పుడు హార్డ్ కోర్ బీఆర్ఎస్ నాయకుడిగా మారిపోయారు. పైగా ఆయన చంద్రబాబు నాయుడిని పలు పర్యాయాలు పరుష పదజాలంతో దూషింటారు. తలసాని వెనక్కి వచ్చే అవకాశం లేనప్పటికీ ఇతర నేతల్లో కొందరైనా రావచ్చని ఎదురుచూస్తున్నారు. టీడీపీలోకి వెళ్లిపోవాలని అనుచరుల వైపు నుంచి వత్తిడి వస్తోందని చెబుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రస్తుతానికి ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బీఆర్ఎస్ లో ఇమడ లేకపోతున్న కృష్ణారావు మరో పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారు. బీజేపీలో చేరేందుకు ఆహ్వానాలు కూడా వస్తున్నాయి. ఆయన వస్తే తనకేమీ అభ్యంతరం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ప్రకటించారు. అయినా జూపల్లి అన్ని ఆప్షన్స్ చూసుకుంటున్నట్లు సమాచారం. బీజేపీ బెటరా టీడీపీ నయమా అని తన అనుచరుల వద్ద జూపల్లి చర్చిస్తున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీలోకి వెళితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. బీఆర్ఎస్ లో చేరాలనుకుంటే అక్కడ నాయకుల గుంపు ఎక్కువై పోయిందని అందుకే టీడీపీ వైపు చూడటమే కరెక్టని వారు అనుకుంటున్నారట. మరో మూడు నెలల వ్యవధితో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్న మాట చూడాలి మరి.