” పర్యవసానాలు అనుభవించాల్సిందే ” అంటూ తమ పార్టీ వేదికపై నుంచి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్కు బీజేపీ అగ్రనేతల్లో ఒకరైన బీఎల్ సంతోష్ హెచ్చరికలు జారీ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో సంచలనం అవుతోంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రధాన సూత్రధారి ఆయనేనని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. కొంత కాలం దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా దాదాపుగా అదే అభిప్రాయంతో ఉంది. బయటకు వచ్చిన ఆడియోలు, వీడియోలు రామచంద్రభారతి అనే స్వామి తనకు తాను చెప్పుకున్న గొప్పల్లో ఇతర ప్రభుత్వాలను ఎలా పడగొట్టామో అందులో బీఎల్ సంతోష్ పాత్ర ఏమిటో చెప్పుకున్నారు. ఆయనతో సంతోష్ నేరుగా చాట్ చేసినట్లుగా కూడా తేలింది. అయితే ఇప్పుడు అదే బీఎల్ సంతోష్ తెలంగాణ గడ్డపై నుంచి బీఆర్ఎస్ చీఫ్ కు సవాల్ విసిరారు. పర్యవసానాలు అనుభవించాల్సిందనంటున్నారు.
బీఎల్ సంతోష్ ఈ ఒక్క మాట మాత్రమే అనలేదు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్పై ఇంకా చాలా వ్యాఖ్యలు చేశారు. అందులో అతి కీలకమైనవి తెలంగాణ సంపదను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని చెప్పడం. హైదరాబాద్ సంపదను దేశమంతా పంచుతున్నారని కూడా వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ దగ్గర నుంచి అఖిలేష్ యాదవ్ సహా అనేక మందికి కేసీఆర్ ఎన్నికల నిధులు పంపారనేది బీఎల్ సంతోష్ ఆరోపణ. అదంతా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. సంపాదించి పంపారా లేకపోతే బ్యాంకుల్లో అప్పులు తీసుకుని పంపారా అని ప్రశ్నించారు. తెలంగాణ సంపదనే తన రాజకీయం కోసం కేసీఆర్ పంపుతున్నారని బీఎల్ సంతోష్ అంటున్నారు. అయితే ఆధారాలు మాత్రం సరైన సమయంలో బయటపెడతామని బీఎల్ సంతోష్ చెప్పుకొచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల్ని కేసీఆర్ బలపరుస్తున్నారన్న ఆగ్రహం బీఎల్ సంతోష్ మాటల్లో వ్యక్తమవుతోంది.
రాజకీయాల్లో కొంత కాలంగా కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు ఆర్థికంగా అండగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. కానీ దానికి ఆధారాలు లేవు. ఇప్పుడు బీజేపీ నేత బీఎల్ సంతోష్ కూడా దాదాపుగా అదే చెప్పారు. అయితే ఆయన కేంద్రంలో అధికారపార్టీలో కీలక నేత. ఎలాంటి ఆధారాలు కావాలన్నా క్షణాల్లో వచ్చి పడిపోతాయి. కానీ ఆయన ఆరోపణలు మాత్రమే చేశారు. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు చేసి సరైన సమయంలో బయటపెడతాం అన్నారంటే వారి దగ్గర ఏమీ లేవని ఎక్కువ నమ్మకం. బీఎల్ సంతోష్ కూడా బెదిరంపు ధోరణిలోనే మాట్లాడారన్న అభిప్రాయం దీని వల్ల కలుగుతుంది. నిజంగా అలాంటి ఆధారాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఊరుకోదు. ఏ చిన్న ఆధారం దొరికినా ఇప్పటికే ప్రతి ఒక్కరిపై దాడులు చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు.
అయితే బీఎల్ సంతోష్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అంత తేలిగ్గా తీసుకునే చాన్స్ కూడా లేదు. ఎందుకంటే బీఎల్ సంతోష్ బహిరంగ హెచ్చరికలు చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ ను టార్గెట్ చేశామని చెప్పకనే చెప్పారు. ఓ రకంగా ఇది బీఆర్ఎస్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయమే. బీజేపీని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదన్నది కళ్ల ముందు కనిపించే నిజం. కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ మరో చోట కానీ ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న చోట పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. తెలంగాణలో మాత్రం ఎదురు తిరిగింది. పైగా కేసుల పాలయ్యారు. చట్ట పరంగా ఎప్పటికైనా తేలుతుందో లేదో కేసీఆర్కు బాగా తెలుసు కాబట్టి ఫామ్ హౌస్ కేసులో ముందుగా ఆధారాలన్నీ ప్రజల ముందు పెట్టారు. ఇదే మైనస్ అయినప్పటికీ బీజేపీ కొనుగోళ్ల వ్యవహారాన్ని ప్రజల ముందు ఉంచడమే లక్ష్యం కాబట్టి కేసీఆర్ తాను అనుకున్నది చేశారు. అయితే తమను బీఆర్ఎస్ చీఫ్ బద్నామ్ చేశారని బీజేపీ పెద్దలు ప్రతీ కార జ్వాలతో రగిలిపోవడం సహజం. బీఎల్ సంతోష్ మాటల్లో అదే కనిపించిందని ఎక్కువ మంది అభిప్రాయం.
దర్యాప్తు సంస్థలతో విరుచుకుపడటం బీజేపీ స్టైల్ మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎదురు తిరిగిందని ఉద్దవ్ ధాకరే ప్రభుత్వాన్ని పడగొట్టారు. ముగ్గురు కీలక నేతల్ని జైలుకు పంపారు. ఆర్నాబ్ విషయంలో షారుఖ్ కుమారుడి కేసు విషయంలో ఎదురు తిరిగిన మంత్రిని దావూద్ తో సంబంధాల పేరుతో అరెస్టు చేశారు. ఆర్నాబ్ కేసులో హోంమంత్రి దేశ్ ముఖ్నూ జైలుకు పంపారు. చివరికి సంజయ్ రౌత్నూ వదిలి పెట్టలేదు. చివరికి ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ పగబడితే ఎలా ఉంటుందో మహారాష్ట్రలో చూపించారు. ఇప్పుడు వారి పగ తెలగాణ మీద ఉందని బీఎల్ సంతోష్ మాటలతో స్పష్టమైంది. తమ శత్రువుగా కేసీఆర్ను బీజేపీ అగ్రనేతలు డిసైడ్ చేసేశారు. ఇక ముదు వారు తెలంగాణలో ఎలాంటి అడుగులు వేస్తారనేది ఊహించడం కష్టం. ఎలా అయినా చేయవచ్చు. ఏదీ ఆశ్చర్యపోవాల్సింత ఘటన ఉండదు.
కానీ కేసీఆర్ ముందు చేతులెత్తేసే అవకాశం ఉండదు. పోరాడతారు. అందుకే తెలంగాణ రాజకీయం ముందు ముందు మరింత ఉద్రిక్తంగా మారనుంది. బీఎల్ సంతోష్ హైదరాబాద్ గడ్డపై నుంచి బీఆరెఎస్కు చేసిన హెచ్చరికలు ఆయన తనపై ఆరోపణలను వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకోవడంతో ఓ భీకర రాజకీయ యుద్ధానికి పునాదిగా భావించవచ్చు.