రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా యువబ్యాటర్ రిషబ్ పంత్… అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి బయటపడి కోలుకుంటున్నాడు. పంత్‌కు ప్రమాదమేమీ లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. రిషబ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డెహ్రాడూన్ వైద్యులు తెలిపారు. పంత్ తలకు తీవ్ర గాయమైంది. వీపుపై కాలిన గాయాలు, కుడి మోకాలు ఫ్యాక్చర్ అయినట్లు చెబుతున్నారు. ఇతర స్కాన్‌ల కోసం ట్రీట్‌మెంట్ జరుగుతోందని బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు.
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ వద్ద తెల్లవారుజామున 5.30 నిమిషాలకు పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వస్తున్న సమయంలో హరిద్వార్ జిల్లాలోని మంగలౌరు వద్ద ప్రమాదం జరిగింది. డివైడర్‌ను ఢీకొట్టడంతో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. వెంటనే కారులో నుంచి దూకడంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. కారులో మంటలు చెలరేగగానే చాకచక్యంగా అద్దాలు పగలగొట్టుకొని బయటకు వచ్చాడు. రోడ్డుపై పడి ఉన్న అతడిని అటుగా వెళ్తున్న కొందరు గుర్తించి పంత్‌ను రక్షించారు. గాయాలు తీవ్రమైనవి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు.
పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్ కు వైద్యసాయం అందిస్తున్న డాక్టర్ ఆశిష్ యాజ్ఞిక్ స్పందిస్తూ, ప్రాణాపాయం లేదని తెలిపారు. పంత్ కు ఓ మోస్తరు గాయాలు తగిలాయని వివరించారు. పంత్ ను తొలుత డెహ్రాడూన్ లోని సాక్షమ్ హాస్పిటల్ మల్టీస్పెషాలిటీ అండ్ ట్రామా సెంటర్ లో చేర్చారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం మ్యాక్స్ హాస్పిటల్ కు తరలించారు.
పంత్‌కు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సంసిద్ధంగా ఉన్నామన్నారు బీసీసీఐ కార్యదర్శి జై షా. పంత్ వైద్య చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ప్రమాద సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉన్నట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతోనే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడని దీంతో వాహనంలో మంటలు చెలరేగినట్లు డీజీపీ వెల్లడించారు.
విచారకర ఘటనపై స్పందించిన క్రీడా ప్రముఖులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తుండడంతో #RishabhPant ట్రెండ్ అవుతోంది. కాగా బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్న రిషబ్ పంత్‌కు స్వదేశంలో జరగనున్న శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో విశ్రాంతినిచ్చారు. క్షేమంగా కోలుకొని మళ్ళీ పంత్ దేశం తరపున ఆడాలని అభిమానులు ఆ దేవుడిని వేడుకుంటున్నారు.