జగన్ జగమొండి. పార్టీ నాయకులే కాదు ప్రభుత్వంలో భాగస్వాములైన అధికారయంత్రాంగంలోని ప్రతీ ఉద్యోగికీ తెలుసు. ఎంత కాదనుకున్నా ఉద్యోగులు వ్యవస్థలో కీలకం. వారి డిమాండ్లు కొన్నిసార్లు శృతిమించొచ్చు. బాధ్యతలు మరిచి హక్కులకోసమే పోట్లాడుతుండొచ్చు. కానీ అప్పుడప్పుడూ కోప్పడ్డా వాళ్లని కలుపుకుని పోవడంలోనే ప్రభుత్వ విజ్ఞత ఉంటుంది. పట్టువిడుపులు లేకపోతే తెగేదాకా లాగినట్లవుతుంది. అసలే వైసీపీ ప్రభుత్వంపై కొన్నాళ్లుగా ఉద్యోగులు చిర్రుబుర్రులాడుతున్నారు. పీఆర్సీనుంచి ఇతర ప్రయోజనాలదాకా ఏపీ ప్రభుత్వం విషయంలో ఉద్యోగులు అంత సంతృప్తిగా లేరు. పెన్షన్ విధానంపై మొన్నటిదాకా రగడ నడిచింది. ఇప్పుడు తమని కట్టడిచేసేందుకు ప్రభుత్వం కొత్తకొత్త ప్రయోగాలు చేస్తోందన్న అసంతృప్తి వాళ్లలో కనిపిస్తోంది.
సాధారణంగా కీలకమైన ఉద్యోగులు అసంతృప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తపడతాయి. అందరి విషయంలో చండశాసనుడిలా వ్యవహరించే కేసీఆర్ కూడా తెలంగాణలో ఉద్యోగవర్గాలను మాత్రం దువ్వుతుంటారు. వారి విషయంలో ఉదారంగా వ్యవహరిస్తుంటారు. అసలే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం. దీంతో రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు ప్రయోజనాలు, నిబంధనలు ఇతరత్రా అంశాలపై పోల్చుకోకుండా ఉండలేరు. దీంతో సహజంగానే తామేదో కోల్పోతున్నామన్న అసంతృప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంటుంది. ఏపీలో ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా లేదన్న అభిప్రాయం అంతకంతకూ బలపడుతోంది. ఈ అభిప్రాయాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం వైపునుంచి చెప్పుకోదగ్గ ప్రయత్నాలు లేవన్నది ఓపెన్ సీక్రెట్.
ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కచ్చితంగా ఉండటంతో ఆ ప్రభావం నాయకులపై పడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయంగా తమకు నష్టాన్ని కలిగిస్తున్నాయని అధికారపార్టీ ప్రజాప్రతినిధులే బాధపడే పరిస్థితి ప్రమాదకరం. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన నిబంధనతో ప్రజాప్రతినిధులు కూడా నలిగిపోతున్నారు. ఇకపై డ్యూటీకి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చినా జీతాల్లో కోత పెట్టాలనుకుంటోంది ఏపీ సర్కార్. అంటే నిర్దేశించిన సమయం కంటే పది నిమిషాలు లేటయ్యారంటే శాలరీ కట్ అయినట్లే. మొదట సెంట్రలైజ్జ్ ఫండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగంలో అమలుచేయాలనుకున్నా తర్వాత అన్ని చోట్లా అమలు కావచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగులు టైంకి డ్యూటీకి రావాలనుకోవడం తప్పుకాదుగానీ అదే సమయంలో ఫస్ట్కి ఠంచనుగా జీతాలిస్తున్నారో లేదో కూడా చూసుకోవాలి. ఏపీలో ప్రతీనెలా జీతాలు ఆలస్యమవుతూనే ఉన్నాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దకుండా ఇలా జీతాల్లో కోతల నిర్ణయాలు కక్షసాధింపేనంటున్నారు ఉద్యోగులు. మరి జగన్ సర్కార్ ఈ నిర్ణయంపై పునరాలోచిస్తుందా? ఒక్కసారి ఫిక్స్ అయితే వెనక్కి తిరిగి చూసుకునేది లేదంటుందా?