టార్గెట్ రఘునందన్.. దుబ్బాకలో ఏం జరగబోతోంది ?

By KTV Telugu On 31 December, 2022
image

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం రాజకీయ కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాల్సిందేనని సీఎం కేసీఆర్ నిర్ణయించుకుని ఆ దిశగా ప్లాన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు ఆ పని అప్పగించడంతో వారు రంగంలోకి దిగారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్ధిపేట ఎమ్మెల్యే అయిన మంత్రి హరీష్ రావు, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి క్షేత్రస్థాయిలో తిరుగుతుంటే బీజేపీకి బీపీ పెరిగిపోతోంది. పైగా నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు వేగాన్ని పెంచేయ్యడంలో రఘునందన్ రావుకు దిక్కు తోచడం లేదు. బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు ఎదురుపడితే రణనినాదం వినిపిస్తోంది. అరుచుకుంటూ ఒకరిని ఒకరు తోసుకుంటున్నారు.

తొలుత వ్యూహాత్మకంగా సోషల్ మీడియాను వేదికగా చేసుకుని రఘునందన్ వ్యతిరేక ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రఘునందన్ రావు ఇచ్చే ప్రతీ స్టేట్ మెంటుకు పదిమంది బీఆర్ఎస్ నేతలు బలమైన కౌంటర్ ఇస్తున్నారు. రఘునందన్ రావు రాజీనామా చేస్తే కౌన్సిలర్ గా కూడా గెలవలేరని రెచ్చగొడుతున్నారు. ఈ సారి ప్రభాకర్ రెడ్డి పరిస్థితి కూడా అంతేనని బీజేపీ సమాధానమిస్తోంది. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు అసెంబ్లీ ఎన్నికల వరకు సాగాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు.

దుబ్బాక అభివృద్ధికి బీఆర్ఎస్ మాత్రమే కృషి చేయగలదని చెప్పేందుకు ఇటీవల పది వేల మెట్రిక్ టన్నుల గోదాంలను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునీకరించారు. 13 కోట్లతో నిర్మిస్తున్నచెల్లాపూర్-ముస్తాబాద్ డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాలకు వచ్చినప్పుడు బీజేపీ శ్రేణులు అడ్డు తగిలేందుకు ప్రయత్నించారు. దానితో బీఆర్ఎస్ శ్రేణులు వారిపై ఎగబడ్డాయి. దుబ్బాక ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రమైంది. పైగా మంత్రి హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు రఘునందన్ పై తెగ సెటైర్లు వేస్తున్నారు.

మరోవైపు కొద్దిరోజుల క్రితం రఘునందన్‌రావును బీఆర్ఎస్‌ శ్రేణులు అడ్డుకోవడం ఎక్కడికక్కడ నిరసనకు దిగడం తెలంగాణలో చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. గతంలో కొత్త ప్రభాకర్‌రెడ్డి గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటనలకు సమయం కేటాయించేవారు. ఇప్పుడు రూటు మార్చి దుబ్బాకలో విస్తృతంగా పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పనిలో పనిగా బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు కూడా అధికార పార్టీలో చేరిపోతున్నారు. మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఎంపీటీసీ బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. వ్యూహాత్మకంగా బీజేపీని దెబ్బకొట్టడం ద్వారా రఘునందన్‌రావును ఒంటరిని చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండలాల వారీగా కొత్త నాయకులను నియమించుకున్నారు. సోషల్ మీడియా టీమ్‌ను పటిష్టం చేశారు. ఎక్కడ ఏం జరిగినా సమాచారం అందేలా జాగ్రత్త పడుతున్నారు.

బీఆర్ఎస్ వ్యూహాలకు రఘునందన్‌రావు కూడా ప్రతివ్యూహలు రచిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గ యువతపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. పార్టీ నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. తాను లేకపోతే బీజేపీ వాయిస్ ఉండదని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు. అయితే ఇరు వర్గాల నేతలు యువతపైనే దృష్టి సారించడంతో దుబ్బాక రాజకీయం ఆసక్తిగా మారింది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరికొకరు అడ్డుకోవడాలు నిలదీయడాలు చేస్తుండడంలో ఆందోళనలు ఘర్షణలకు తెరలేస్తున్నాయి. పైగా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ శ్రేణులు రఘుునందన్ రావును అడ్డుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.