ఒకరికి ఒకసారి అర్థమవుతుంది. ఒకరికి రెండు మూడు సార్లకు అర్థమవుతుంది.. మరికొంత మందికి కొన్ని రోజుల తర్వాతైనా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తే మాత్రం అసలు అర్థమవుతుందన్న నమ్మకం కలగడం లేదు. మేథోమథనాలు, చింతన్ బైఠక్ లు జరుగుతూనే ఉంటాయి. కానీ పార్టీ ఒక అడుగు ముందుకేసినట్లు మాత్రం కనిపించడం లేదు. రెండు అడుగులు వెనక్కి వేయడం మాత్రమే దర్శనమిస్తోంది. పొత్తు భాగస్వాములు కూడా కాంగ్రెస్ పరిస్థితి చూసి ఆగ్రహావేశాలకు లోనవుతున్నా.. నాయకత్వానికి చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదు. సొంత పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలు బహిరంగంగానే తమ గోడును వినిపిస్తున్నా.. అగ్రనాయకత్వం వినీ విననట్లుగా ఊరుకుంటోంది…..
ఉదయ్ పూర్ .. మాట్లాడిందేమిటి.. చేసిందేమిటి ?
కాంగ్రెస్ పార్టీ ఎంతో అట్టహాసంగా ఉదయ్ పూర్ లో చింతన్ బైఠక్ నిర్వహించింది. పార్టీలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు చెప్పుకుంది. పార్టీలోని అన్ని విభాగాల్లో యువతకు 50 శాతం సీట్లు కేటాయిస్తామని అట్టహాసంగా ప్రకటించింది. మహిళలకు పెద్ద పీట వేస్తామని చెప్పింది. ఇంతకాలం పదవులు అనుభవిస్తున్న వారు త్యాగాలు చేయాలని సూచించింది. ఒక కుటుంబానికి ఒక పదవేనంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. త్వరలో పార్టీకి ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ వస్తాడని ప్రకటించింది. పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు రావాలో చెబుతూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బరువైన ఉపన్యాసాలు ఇచ్చారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకా గాంధీకి ఇవ్వాలని కొందరు నేతలు ఎప్పటిలాగే విజ్ఞప్తులు చేశారు.
శివసేన ఆగ్రహం
కాంగ్రెస్ పార్టీ తీరుపై శివసేన తీవ్ర ఆసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకత్వం నిష్క్రియా పర్వంగా తయారైందని శివసేన పత్రిక సామ్నా తన సంపాదకీయంలో విమర్శలు సంధించింది. చింతన్ బైఠక్ లో చెప్పిందేమిటి .. ఇప్పుడుచేస్తున్నదేమిటి? అని నిలదీసింది. రాహుల్ గాంధీ ఉపన్యాసాలతో సరిపెడుతున్నారే తప్ప… ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైందని సామ్నా ఆరోపిస్తోంది… మహారాష్ట్రలోని అధికార సంకీర్ణం.. మహా వికాస్ ఆగాఢీకి శివసేన నాయకత్వం వహిస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీ ఆ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాయి. ఇంతకాలం బీజేపీతో రాజకీయ భాగస్వామిగా ఉన్న శివసేన ఇప్పుడు క్రమంగా కాంగ్రెస్ కు దగ్గరవుతోంది. కాంగ్రెస్ శక్తిమంతంగా ఉంటేనే తామ మనుగడ సాధ్యమని శివసేన విశ్వసిస్తోంది. అయితే నాయకత్వ సమస్యను కాంగ్రెస్ పరిష్కరించుకోలేకపోవడం శివసేనకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలన్న చిత్తశుద్ధి నాయకుల్లో లేదని ఆగ్రహం చెందుతోంది. ఇంతవరకు పార్టీ నాయకుడెవరో తెలీక నానా తంటాలు పడుతున్న పార్టీతో ఎలా కలిసి నడవాలో తెలియక శివసేన నానా తంటాలు పడుతోంది….
అంతా ఔట్ గోయింగే
కాంగ్రెస్ పార్టీ రాను రాను సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. తెల్లారే సరికే ఒకరు పార్టీ నుంచి నిష్క్రమిస్తున్నారు. తాజాగా సునీల్ జాఖర్ వెళ్లిపోయారు. పైగా బీజేపీలో చేరిపోయారు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాదా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది, అందులోనూ భారీగా ఓట్లు తీసుకురాగలిగిన నేతలు జారిపోతున్నా.. కాంగ్రెస్ పార్టీ మినమేషాలు లెక్కిస్తోంది. అదీ జనంలో నెగిటివ్ ఫీలింగ్ తెస్తుందని శివసేన లాంటి పార్టీలు మొత్తుకుంటున్నాయి. ఇకనైనా మారండని వేడుకుంటున్నాయి…
పార్టీలోనూ అసంతృప్తి
కాంగ్రెస్ పార్టీలోనూ తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఒక వర్గమైతే.. అసలు ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని కొందరు సూచిస్తున్నారు. ఎలాగూ పది సంవత్సరాలు విపక్షంలో ఉన్నామని, ఇంకో పది సంవత్సరాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. సొంత బలంతోనే అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు మరి అధిష్టానం అందుకు సిద్ధ పడుతుందో లేదో చూడాలి…