బీజేపీ మిషన్ 90.. టార్గెట్ రీచ్ అవుతారా?

By KTV Telugu On 1 January, 2023
image

తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనని చెప్పుకుంటున్న కమలదళం ఎన్నికల కదనరంగంలోకి దూకుతోంది. ఇప్పటివరకు ఒకలెక్క ఇకనుంచి మరో లెక్క అంటున్నారు బీజేపీ నేతలు. తెలంగాణలో ఆ పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన పెద్దలు తగ్గేదేలే అంటున్నారు. వచ్చే ఏడాదికి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేశారు. నాలుగు అంచెల వ్యవస్థతో దూసుకెళ్లాలంటూ శామీర్‌పేట సమావేశంలో రాష్ట్ర ముఖ్యనేతలకు రోడ్ మ్యాప్ అందించారు. ఈ ఏడాది అంతా ఎన్నికల సమరోత్సవ సంవత్సరం కావడంతో పార్టీ నాయకులందరూ జనంలోనే ఉండేలా ప్రణాళికలు రూపొందించారు కమలనాథులు. పాలక్‌లు, ప్రభారీలు, కన్వీనర్లు, విస్తారక్‌లు ఇలా మొత్తం 4 అంచెల వ్యవస్థను సిద్ధం చేశారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతను నలుగురు సీనియర్లకు అప్పగించారు. మొత్తం 119 నియోజకవర్గాలకు పాలక్‌లను ప్రకటించారు. ప్రతి రోజు ప్రతిగ్రామం ప్రతి పోలింగ్‌బూత్ ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక యాక్టివిటీ ఉండేలా ప్లాన్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు గెలుచుకునేలా మిషన్ 90 పేరుతో బీజేపీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అయితే బలమైన బీఆర్ఎస్‌ను ఓడించడం 90 సీట్లలో బీజేపీ పాగా వేయడం సాధ్యమేనా అనే చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో బీజేపీకి ఊపు వచ్చినప్పటికీ బలమైన అభ్యర్థులు మాత్రం కనిపించడం లేదు. బీజేపీకి చాలా నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు. ఆ పార్టీ కేవలం కొన్ని పట్టణాలకే పరిమితమైంది. గ్రామస్థాయిలో కేడర్ లేరు. మండల జిల్లా స్థాయిలోనూ చాలా చోట్ల లీడర్లు కరువే. ఇలాంటి తరుణంలో 90 సీట్లలో గెలవడం ఎలా? అనే సందేహం కలుగకమానదు. అయితే అక్కడే బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించబోతోంది. 45 నియోజక వర్గాల్లో పార్టీగా వీక్‌గా ఉండడంతో వాటిపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టాలని నిర్ణయించారు. నాయకత్వ కొరత ఉన్న చోట పక్క పార్టీల్లోని నేతలకు గాలం వేసి అక్కడ గెలుపుకు బాటలు వేసుకోవాలనుకుంటున్నారు.

ఇప్పటికే బీజేపీ ఏర్పాటు చేసిన చేరికల కమిటీ వలస నేతల కోసం ద్వారాలు తెరిచి ఉంచుతోంది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ ఓడిపోవడంతో చేరికలకు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే వారు తగ్గిపోయారు. ఈ కారణంగా ఆ పార్టీ కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అసంతృప్తి రాజ్యమేలుతోంది. సీనియర్లు పార్టీని ధిక్కరిస్తున్నారు. ఈనేపథ్యంలో నియోజకవర్గాల్లో పట్టు ఉన్న నేతలను ఆకర్షించాలని బీజేపీ భావిస్తోంది. మిషన్ 90లో సక్సెస్ సాధించాలంటే కచ్చితంగా వలసలు అవసరమనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన సీనియర్లను కాషాయగూటికి తీసుకురావాలని ట్రై చేస్తున్నారట. పార్టీలో చేరితే టికెట్ ఇస్తామనే హామీతో బీజేపీ అనేక మంది నేతలతో టచ్‌లోకి వెళ్తోంది. ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ మేరకు చేరికల కమిటీకి సందేశం ఇచ్చారు. పార్టీలో చేరుతామని వచ్చే వారికి టిక్కెట్ హామీ ఇద్దామని ఈ విషయాన్ని పార్టీ అగ్రనేతలతోనే చెప్పిద్దామని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఎమ్మెల్యేల ఎరకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ ప్రధానంగా తెలంగాణపై దృష్టి సారించారు. బీజేపీ నాయకుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మిషన్‌ ప్లాన్‌ను రాష్ట్ర నేతలకు వివరించారు. విడిగా ముఖ్యనేతలతో సమావేశమై పార్టీ బలోపేతం‌పై సూచనలు ఇచ్చారు. సమావేశాల్లో పాల్గొనడమే కాదు కేసీఆర్ కాస్కో అంటూ హెచ్చరించారు. తనపై ఆరోపణలు చేసిన వారు పర్యవసానాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ముందుంది అసలు ఆట అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించడాన్ని వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా కొత్త సంవత్సరం నుంచి సరికొత్త కార్యాచరణతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. రాష్ట్రంలో మిషన్ 90 అజెండా ఏ మేరకు పని చేస్తుంది? 90సీట్లలో బీజేపీ గెలుపు సాధ్యమేనా అనేది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.