మొన్న మ‌ర‌ణాలు.. ఇప్పుడో అదృశ్యం.. ఏం జరుగుతోంది?

By KTV Telugu On 1 January, 2023
image

ఎక్క‌డి ర‌ష్యా..ఎక్క‌డి ఒడిశా. మ‌న దేశంలోని ఒడిశాలో కొంద‌రు ర‌ష్య‌న్ల మ‌ర‌ణం, అదృశ్యం అనుకోకుండా జ‌రిగిందేనా? ఆ సంఘ‌ట‌న‌ల వెనుక పుతిన్ గూఢ‌చ‌ర్యం ఉందా? పుతిన్ ప‌గ‌బ‌డితే అలాగే ఉంటుంద‌న్న విష‌యం ప్ర‌పంచానికి తెలుసు. అందుకే ఈ సంఘ‌ట‌న‌ల‌ను ఎవ‌రూ తేలిగ్గా తీసుకోవ‌డం లేదు. ఉక్రెయిన్‌పై విచ‌క్ష‌ణార‌హితంగా దాడులుచేస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఆ దేశ పౌరులు కొంద‌రు గొంతెత్తారు. త‌న యుద్ధ‌దాహంతో పుతిన్ ర‌ష్య‌న్ల‌ను ప్ర‌మాదంలో ప‌డేస్తున్నాడ‌న్న అభిప్రాయం ఆ దేశ పౌరుల్లో ఉంది. కొంద‌రు క‌డుపులోనే దాచుకుంటే ఇంకొంద‌రు త‌మ అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పారు. అలాంటివారిపై పుతిన్ క‌త్తిగ‌ట్టార‌నే వార్త‌ల‌కు ఒడిశా సంఘ‌ట‌న‌లు బ‌లం చేకూరుస్తున్నాయి.

ఒడిశాలోని రాయగడ హోటల్‌లో ఈమ‌ధ్య రోజుల వ్య‌వ‌ధిలో ఇద్ద‌రు ర‌ష్య‌న్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ర‌ష్యా ఎంపీ, వ్యాపార‌వేత్త‌ పావెల్‌ అంటోవ్‌(65), ఆయన స్నేహితుడు వ్లాదిమర్ బెడెనోవ్(61) రెండ్రోజుల వ్యవధిలో హోటల్‌లో రక్తపు మడుగులో శ‌వాల‌య్యారు. ఈ ఇద్దరు టూరిస్టుల మృతి భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలోనూ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మృతుల్లో ఒక‌రైన ఎంపీ ఆంటోవ్ ఉక్రెయిన్‌పై రష్యా దాడిని బ‌హిరంగంగా విమ‌ర్శించ‌టంతో పుతిన్ కుట్రేన‌న్న అనుమానాలు కూడా ఉన్నాయి. లండన్ డెయిల్ మెయిల్ వార్తా సంస్థ ఆంటోవ్‌ను పుతిన్‌కు బద్ధ వ్యతిరేకిగా ప్ర‌స్తావించింది. న్యూయార్క్ టైమ్స్ కీవ్‌పై రష్యా క్షిపణి దాడులపై ఆంటోవ్ విమర్శలను గుర్తుచేసింది.

ఈ ఇద్ద‌రి మ‌ర‌ణ‌మే పెద్ద మిస్ట‌రీగా ఉంటే పుతిన్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన మరో రష్యా పౌరుడు కనిపించకుండా పోయాడనే వార్త కలకలం సృష్టిస్తోంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో రష్యాకు చెందిన 60ఏళ్ల వ్యక్తి ప్లకార్డు పట్టుకుని యుద్ధానికి వ్య‌తిరేకంగా నిరసనకు దిగాడు. ఆ వ్య‌క్తి ఉన్న‌ట్లుండి అదృశ్యం అయ్యాడ‌నే వార్తలు చక్కర్లు కొంటాయి. ఆయనకు ప్రాణహాని ఉందని ప్రచారం జ‌ర‌గ‌టంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వ్య‌క్తి భిక్షాట‌న చేసుకుంటూ క్షేమంగానే ఉన్నాడంటున్నారు. అయితే త‌న‌ను విమ‌ర్శిస్తే త‌న‌ను వ్య‌తిరేకిస్తే భూమండ‌లంలో ఏమూల‌న ఉన్నా పుతిన్ వ‌దిలిపెట్ట‌డ‌న్న ప్ర‌చారానికి ఈ సంఘ‌ట‌న‌లు బ‌లం చేకూరుస్తున్నాయి.