కొత్త ఏడాది రోజు కూడా క్షిపణి వదిలాడు.

By KTV Telugu On 1 January, 2023
image

ఆయన రూటే సెపరేటు. ఎవరి మాట వినడు. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతుంటే ఆయన మాత్రం కొత్త సంవత్సరం రోజు కూడా ఆయుధ పరీక్షల్లో మునిగిపోయాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ తన దుందుడుకు చర్యలు మానడం లేదు. ఇప్పటికే పలు ప్రమాదకర ఆయుధాల తయారీతో అమెరికాసహా పలు దేశాల్ని వణికిస్తున్న కిమ్ ఇప్పుడు మరింత దూకుడు పెంచబోతున్నారు. కిమ్ క్షిపణి ప్రయోగంతో కొత్త ఏడాదిలోకి స్వాగతం పలికాడు. 2022లో రికార్డు స్థాయిలో ఆయుధ ప్రయోగ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియా 2023లోకి అడుగుపెట్టిన మొదటి రోజే తూర్పు జలాల్లోకి ఓ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించింది. తద్వారా ఈ ఏడాది కూడా ఆయుధ పరీక్షలు భారీ ఎత్తునే ఉంటాయని పరోక్షంగా అమెరికా, దక్షిణాకొరియాలను హెచ్చరించింది.

కొత్త సంవత్సరం సందర్భంగా అధికార పార్టీ సమావేశంలో మాట్లాడిన కిమ్‌ అణ్వస్త్రాల తయారీని గణనీయంగా పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు. మరింత శక్తిమంతమైన ఖండాంతర క్షిపణులను తయారు చేస్తామని ప్రకటించారు. అమెరికా సహా ఇతర ప్రత్యర్థి దేశాలను ఎదుర్కొనేందుకు సైనిక శక్తిని మరింత పటిష్ఠ పరుస్తామన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని భద్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వ్యూహాత్మక అణ్వస్త్రాల తయారీ గణనీయంగా పెంచాల్సిన పరిస్థితులు సృష్టిస్తున్నారంటూ అమెరికా, దక్షిణ కొరియాలపై విరుచుకుపడ్డారు. తాజా క్షిపణి ప్రయోగాలను దక్షిణ కొరియా అమెరికా ఇండో- పసిఫిక్‌ కమాండ్‌ తీవ్రంగా ఖండించాయి. ఉత్తర కొరియా తీవ్రమైన కవ్వింపు చర్యలకు దిగుతోందని దక్షిణ కొరియా మండిపడుతోంది. అమెరికాతో కలిసి ఉత్తర కొరియా చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దక్షిణ కొరియా జపాన్‌ను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ తెలిపింది.

ఇటీవల ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. గత వారం దక్షిణ కొరియాలోకి ఉత్తర కొరియా డ్రోన్లతో దూసుకెళ్లింది. బదులుగా దక్షిణ కొరియా మిస్సైల్స్ ప్రయోగించింది. అవి కూడా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్స్‌ని ఉత్తర కొరియా భూభాగంలోకి ప్రయోగించింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అణ్వాయుధాలు, క్షిపణులపై కిమ్ దృష్టి సారించాడు. వేగవంతమైన ప్రతీకార దాడి సామర్థ్యంతో కూడిన కొత్త రకం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని తయారు చేయాలని అధికారులను కిమ్ ఆదేశించినట్లు ఆ దేశ అధికారిక మీడియా కేసీఎన్‌ఏ పేర్కొంది. అలాగే తొలి మిలిటరీ స్పై శాటిలైట్‌ సైతం త్వరలో ప్రయోగించాలని యోచిస్తున్నట్లు కిమ్ తెలిపారు. శనివారం కూడా ఉత్తర కొరియా మూడు స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైళ్లను తన తూర్పు జలాల్లోకి ప్రయోగించింది. ఉత్తర ప్రాంతంపై అంతరిక్షం నుంచి నిఘా సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు దక్షిణ కొరియా ఘన ఇంధన రాకెట్‌ను ప్రయోగించిన మర్నాడే ఉత్తర కొరియా క్షిపణులను వదిలింది.