ఒక శునకం గర్భం దాల్చింది. మూడు పిల్లలకు జన‌్మనిచ్చింది అందులో వింతేముంది అది ప్రకృతి సహజం అనుకుంటున్నారా ? మీరన్నది నిజమే కానీ అది మామూలు శునకం కాదు కట్టుదిట్టమైన భద్రత నడుమ విధులు నిర్వర్తించే స్నిఫర్ డాగ్. అవును అది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన ఓ కాపలా శునకం. అది గర్భం దాల్చింది. మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
సరిహద్దుల్లో అత్యంత రక్షణ వలయంలో ఉండే శునకం ఎలా గర్భం ధరించిందో అర్థం కాక తలలు పట్టుకున్నారు అధికారులు. రక్షణ పరమైన విధుల్లో సహాయకారిగా ఉంటాయనే ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ స్నిఫర్ డాగ్స్‌కు ట్రెయినింగ్ ఇచ్చి కీలకమైన ప్రాంతాల్లో వాటి సేవలను వినియోగించుకుంటుంది. వాటి పెంకపకం, శిక్షణ, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాటి పర్యవేక్షకులు. క్రమం తప్పకుండా టీకాలు వేయిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు.
మేఘాలయాలోని బంగ్లాదేశ్ సరిహద్దులో విధుల్లో ఉన్న లాల్సీ అనే శునకం మూడు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది. అది చూసి అధికారులు అవాక్కయ్యారు. 43వ బెటాలియన్ కు చెందిన ఈ స్నిఫర్ డాగ్ ఎలా గర్భం దాల్చిందో తేల్చాలని బీఎస్ఎఫ్ షిల్లాంగ్ విభాగం డిప్యూటీ ఆఫీస్ కమాండెంట్ అజీత్ సింగ్ ఆదేశించారు.
మామూలుగా బీఎస్ఎఫ్ క్యాంప్ బార్డర్ పెట్రోలింగ్ సహా సరిహద్దుల దగ్గర విధుల్లో నియమించిన శునకాలను నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లరు. వాటిపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. అలాగే బయటి నుంచి కూడా ఇతర శునకాలు లోనికి వచ్చే అవకాశం ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఈ స్నిఫర్ డాగ్ ఎలా గర్భం ఎలా దాల్చిందో అధికారులకు అంతుబట్టడంలేదు. దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి మరి.