రాజధాని వ్యవహారాన్నే బ్యాలెన్స్ చేయలేక కిందామీదా పడుతున్న వైసీపీ సర్కారుకు ఇప్పుడింకో సవాల్. కాపులు ఏకమవుతున్నారు. ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తపడాలనుకుంటున్నారు. సామాజికవర్గ నేత సీఎం అభ్యర్థి కావాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో కాపుల రిజర్వేషన్ అంశం మరోసారి బర్నింగ్ టాపిక్ అయింది. కేంద్రం క్లారిటీతో మొన్నటిదాకా ఫ్రిడ్జ్‌లో ఉన్న ఇష్యూ బయటికొచ్చింది. కాపు సామాజికవర్గం కాకమీదుంటే విపక్షాలు ఆజ్యంపోసే పనిలో ఉన్నాయి.
తన మరణంతోనైనా కాపు రిజర్వేషన్లు సాధిస్తానంటూ సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య చేసిన ప్రకటన సంచలనంగా మారింది. చేగొండి కాపు సామాజికవర్గానికి పెద్ద తలకాయ. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు ఆయనే. కాపులకు 5శాతం రిజర్వేషన్లు ప్రకటించాలంటూ ఆయన పెట్టిన డిసెంబరు31 డెడ్‌లైన్ ముగిసింది. దీంతో జనవరి2న పాలకొల్లులో దీక్షకు హరిరామజోగయ్య సిద్ధమయ్యారు. పోలీసులు తన దీక్షను భగ్నం చేసినా ఎక్కడికి తరలిస్తే అక్కడే కొనసాగిస్తానంటున్నారు కాపు నాయకుడు.
ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పుతో రాష్ట్రాలు రిజర్వేషన్లు అమలుచేసుకోవచ్చని కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో కాపుల రిజర్వేషన్లు మళ్లీ తెరపైకొచ్చాయి. కాపు వర్గానికి చెందిన మరో ముఖ్యనేత ముద్రగడ పద్మనాభం కూడా ఈమధ్యే సీఎం జగన్‌కు లేఖ రాశారు. రిజర్వేషన్ల కేటాయింపుని పరిశీలించాలని అభ్యర్థించారు. అయితే ముద్రగడ ప్రభుత్వాన్ని బతిమాలుకున్నట్లు లేఖరాశారని కాపుల్లోనే కొందరు మండిపడుతున్నారు. దీంతో హరిరామజోగయ్య దీక్ష నిర్ణయానికి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేని సున్నిత అంశం కావటంతో ప్రభుత్వంపై ఒత్తిడిపెరుగుతోంది.
2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అక్కడ కాపు రిజర్వేషన్లకు బ్రేక్ పడింది. దీంతో ముద్రగడ నేతృత్వంలో కాపులు ఉద్యమం చేశారు. దీనిపై ప్రతిష్ఠంభన నడుస్తుండగానే 2019 ఎన్నికలకు ముందు కేంద్రం అగ్రవర్గాల్లోని పేదలకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్లను ప్రకటించింది. చంద్రబాబు ఏపీలో ఈ రిజర్వేషన్లని అమలు చేశారు. కాపులకు 5 శాతం మిగిలిన వర్గాలకు 5 శాతం కేటాయించారు. వైసీపీ అధికారంలోకొచ్చాక ఒక్క కులానికే 5 శాతం కేటాయించడం కుదరదని మొత్తం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లని పక్కన పెట్టారు. ఇప్పుడు కేంద్రం నుంచి ఎలాంటి ఆక్షేపణలు లేకపోవటంతో కాపు రిజర్వేషన్లపై జగన్ సర్కారు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం పరిస్థితి ఓ రకంగా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లే ఉంది.